‘ఎవరు వీరు..?/ దేశమాత పెదవిపై/ మాసిన చిరునవ్వులు/ మనసులేని పిడికిలిలో/నలిగి పడిన పువ్వులూ..’ అంటూ ఆకలికి, ఆర్థిక బాధలకీ, అమాయకత్వంలో అమ్ముడుపోయిన అపరంజి బొమ్మలను చూసి సినారె కన్నీళ్లు పెట్టించే పాట రాశారు. ‘ అత్తరు చల్లిన నెత్తురు జలతారులలో, మైల పడిన మల్లెలు ఈ నవ్వులు...’ అంటూ వేశ్యా వాటికల్లో జీవితాలను కోల్పోయిన వారిని చూసి వేటూరి హృదయాన్ని కదిలించే గొప్ప కవిత్వం రాశారు. నలభై యాభై ఏళ్ల క్రితం వ్యభిచార కూపాలు బహిరంగ రహస్యాలు. చీకటి బతుకులు గడిపే మహిళల జీవితాలు దుర్భరంగా ఉండేవి. నాటి వేశ్యా జీవితాల నేపథ్యంలో రచించిన కథ 'మనిషి'. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సయ్యద్ సలీం రచించిన ఈ కథ 1981లో అచ్చయింది.
పేదరికాన్ని ఆసరాగా చేసుకుని అమాయకమైన మహిళలను వ్యభిచార కూపంలోకి దించే ఓ వ్యక్తి పేరు ఎల్లప్ప. అతనికి ఎంతో కఠినాత్ముడు, దుర్మార్గుడని పేరు. ఎల్లప్పకు ఎంతో మంది పెద్దమనుషులతో పరిచయాలు వుండేవి. పగలు పెద్దమనుషుల్లా కనిపించే చాలామంది బుద్ధిమంతులు రాత్రుల్లో ఎల్లప్పతో స్నేహం చేస్తారు. ఇలాంటి ఓ పెద్ద మనిషికి ఎల్లప్పతో ఇరవై ఏళ్ల పరిచయం ఉంది. యాభై ఏళ్లు కూడా నిండని ఆ వ్యక్తికి సమాజంలో మంచి పేరు, హోదా ఉంది. ఆ పెద్ద మనిషికి ఓ పడుచు పిల్లపై మనసు పడుతుంది. పాత బట్టలు వేసుకున్నా, పండు వెన్నెల్లా ఉండే ఆ పిల్లపై మనసు పడిన విషయాన్ని ఎల్లప్పకు చెబుతాడు. దాందేముంది, ఈసారి వచ్చినప్పుడు మీ పని పూర్తి చేస్తాలే అంటూ ఎల్లప్ప మాటిస్తాడు.
ఓసారి ఎల్లప్పతో మాట్లాడుతూ పెద్ద మనిషి కంట ఆ అమ్మాయి పడుతుంది. ఆరోజు సాయంత్రం ఎల్లప్పను పిలిచి అమ్మాయి ఆచూకీ తెలిసిందని చెబుతాడు. ‘ఎవరు సారూ’ అంటూ ఆత్రుతగా అడిగిన ఎల్లప్పకు ఉదయం నీతో మాట్లాడుతున్న ఆ చిన్నదే అని బదులిస్తాడు. ఆ మాట విన్న ఎల్లప్ప ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోతాడు. కాళ్ళ కింద భూమి కదిలినట్టు, తలంతా గిర్రును తిరిగినట్లు, ఏదో ఆలోచిస్తూ, శూన్యంలోకి చూస్తూ, అక్కడి నుంచి మారు మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతాడు. దుర్మార్గుడిగా పేరుపడిన ఎల్లప్ప కంటి నుంచి ఎవరికీ కనిపించకుండా ఓ కన్నీటి బొట్టు రాలి పడుతుంది.
ఆ తరువాత తెలిసిన విషయం ఏమంటే.. ఆ అమ్మాయి ఎల్లప్ప కూతురని. కానీ, పెద్దమనిషికి నమ్మకం కుదరదు. ఎందుకంటే ఎల్లప్పతో అతనికి ఇరవై ఏళ్ల పరిచయం. ఇలాంటి నీతిమాలిన పనులు చేసే ఎల్లప్ప లాంటి వాళ్ళకు పెళ్లి, పిల్లలు, కుటుంబం, మానవత్వం ఉంటుందా? అయినా, ఆ పిల్ల ఎవరో తెలుసుకోవాలనే ఆలోచనతో నేరుగా ఎల్లప్ప ఇంటికి వెళతాడు. అమాయకంగా గుమ్మంలో నిల్చున్న ఆ అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయే కాదు ఆ ఇంటి గోడకి వేలాడుతూ ఓ ఫొటో కూడా కనిపిస్తుంది. ఆ ఫోటో ఎవరిదో కాదు, కమలది. ఇరవై ఏళ్ళ క్రితం తనకు పరిచయం ఉన్న కమలది. ఈ అమ్మాయి అచ్చుగుద్దినట్లు కమలలా వుంది. అంటే ఈ అమ్మాయి కమల కూతురా..? ఇరవై ఏళ్ల క్రితం నాటి సంగతులు గిర్రున తిరిగి కళ్ళముందు ప్రత్యక్షమవుతాయి. ఓ రోజు పనిమీద పట్టణం వస్తే కమలను ఎల్లప్ప పరిచయం చేస్తాడు. 'నిన్ను పెళ్లి చేసుకుంటాలే' అని నమ్మబలికి కమలను లొంగదీసుకుంటాడు. అలా కమల దగ్గరికి వస్తూ, వెళుతూ ఉండేవాడు. కొన్నాళ్లకు కావాలనే కమలకు దూరం అవుతాడు. ఆ తరువాత కమల ఏమైందో తెలియదు.
ఒకసారి ఎల్లప్ప "జీవితంలో మిమ్మల్నే నమ్ముకుంది సారూ.. ఎవరి దగ్గరకు పోలేదు.. పిచ్చిపిల్ల. పాప పుట్టాక ఆత్మహత్య చేసుకుంది.." అంటూ కమల గురించి చెబుతాడు. ఒక క్షణం గుండె కలుక్కుమన్నా అదేమీ తన మనసును కదిలించలేదు. ఇప్పుడు తాను మనసు పడ్డ పిల్ల కమల కూతురు. అంటే తన కూతురు. చిన్నప్పట్నుంచీ తన సొంత కూతురుగా ఎల్లప్ప పెంచుకున్నాడు. ఇదంతా అర్థమైనా ఆ పెద్దమనిషి ఏ మాత్రం బాధపడడు. ఏమీ తేలినట్టే ఇంటికెళ్ళి రోజువారీ పనుల్లో మునిగిపోయాడు. తన ' హాబీ ' ని ఏమాత్రం వదులుకోడు.సమాజంలో పెద్ద మనుషుల్లా కనిపిస్తూ రాయిలాంటి గుండెను మోస్తున్న కొందరికి ఎల్లప్ప లాంటి వ్యక్తుల్లో ఉన్న మానవత్వం ఎప్పటికీ కనిపించదు. పైకి సౌమ్యంగా కనిపించే మనిషిలోని మరో మనిషి దుర్మార్గుడై ఉండవచ్చు. పైకి రాక్షసుడిలా కనిపించే మనిషిలో మానవత్వం మెండుగా ఉండవచ్చు. అందుకే, ' మనిషి ఎలాంటి వాడో మనిషిని ' చూసి చెప్పలేం. ఈ కథ రాసే సమయానికి సలీం వయసు కేవలం 21 ఏళ్లు. ఈ వయసులోనే కథా వస్తువు ఎంపికలో ఎంతో పరిణితి కనిపిస్తుంది. ఎత్తుగడ, కథనం, ముగింపు, శైలి, ఎంతో గొప్పగా ఉంటుంది. ' మనిషి ' కథలో ప్రాణం ఉంది. అందుకే ఈనాటికీ నూతనంగా వుంటుంది. కథ చదివితే అందులోని పాత్రలు మనల్ని వెంటాడుతాయి. ఆలోచనలో పడేస్తాయి.
-వి. పద్మ,
తెలుగు ఉపాధ్యాయురాలు,
98666 23380