‘చెలం కొరడా..రంగనాయకమ్మ వెక్కిరింపు’

Ame Adavini Jayinchindi Book Introduction

Update: 2024-06-24 01:00 GMT

‘పట్టు చీర, నల్లపూసలు, ముత్యాల గొలుసు, ఒంటిపేట గొలుసు, మంగళసూత్రాలు, చెవికి ఝుంకాలు, ముక్కు పుడక, ఆకుపచ్చ గాజులు, కాలి వేళ్లకు మెట్టెలు, తలలో చామంతుల దండ’ సంధ్య అద్దంలో చూసుకుంటుంటే తనకు తాను వింత మృగంలా కనిపిస్తోంది. సంక్రాంతికి ఇళ్ల ముందు ఆడుకునే గంగిరెద్దు గుర్తుకు వస్తోంది.

‘లే సంధ్యా లే..లేచిపో..ఏంటిది. ఒక దిష్టి బొమ్మలా’? లోపల చెలం కొరడా ఝుళిపిస్తున్నారు. రంగనాయకమ్మ వెక్కిరిస్తోంది. సంధ్యలో ఆవేశం, ఆవేదన, దుఖం తన్నుకు వస్తున్నాయి. ఇలా సంధ్య ప్రధాన పాత్రగా సంప్రదాయ పీడనకు, శాస్త్రీయ ఆలోచనకు మధ్య జరిగే సంఘర్షణే గీతాంజలి ‘ఆమె అడవిని జయించింది’ నవల.

బతుకంటే పూజలే అన్ని కులాల్లోనూ...

‘సుఖ శాంతులకు, ఆయురారోగ్యాలకు వ్రతాలు, నోములు ఏమిటి వాటి కోసం తానిక్కడ పూజలు చేయడం హాస్యాస్పదం! మూర్ఖత్వం!’ మెడిసిన్ చదువుతున్న సంధ్యలో అంతర్మథనం. బ్రాహ్మణేతర కులాల్లో కూడా పూజలు, వ్రతాలు, నోములు ఒక ఎంటర్టైన్‌మెంట్ అయిపోయాయి. సంధ్యకు పెళ్లైన తొలి ఏడాది శ్రావణ మంగళ గౌరీ నోములకు బ్రాహ్మణ భూస్వామ్య కుటుంబమైన అత్తగారింటికి బోధ్ వెళుతుంది. సాంప్రదాయ కుటుంబంలో పైకి కనపడని ఈర్ష్యాద్వేషాలు, ఈసడింపులు కనిపిస్తాయి. ఈ బాధలన్నీ భర్త మధుకు ఉత్తరం రాస్తే, ‘మా మగాళ్లకి వందల(వేల) సంవత్సరాలుగా బలిసిన బద్దకం’ అని రాస్తాడు.చాకలి వాళ్లు మురికి బట్టలతో పాటు ముట్టు బట్టలు, పిల్లల దొడ్డికి బట్టలు కూడా ఉతుకుతారు. చాకళ్లు హీనకులస్తులా? బ్రాహ్మణుడైన వాడు తాగుబోతైనా భోజనానికి పిలిచి, దక్షిణలిచ్చి కాళ్లు మొక్కుతారు. చాకళ్లు, మంగళ్లను ఎందుకు గౌరవించరు? ఇలా సంధ్యలో అన్నీ ప్రశ్నలే.

అమ్మానాన్నల మధ్య ‘ఒప్పందం’

నోరెత్తితే ‘మెడ నరికి బైటకు గెంటేస్తా’ అనే నాన్నలో ఒక శాడిస్ట్ శాటిస్ఫ్యాక్షన్ కనిపించేది. నాన్న పురుషాధికారాన్ని ఎదిరించలేక ఒత్తిడి పెరిగిన అమ్మలో హిస్టారిక్ ఔట్లెట్ కనిపించేది. ఎంతసేపు నాన్న అహంకారాలకు, గద్దింపులకు తిట్లు, అమ్మ దుఃఖం, బూతులు.అమ్మంటే నాన్నకు ప్రేమ లేదా? ప్రేమ లేకుండానే అయిదుగురిని కన్నారా? ఇలా అన్నీ ప్రశ్నలే. అమ్మానాన్నల మధ్య ఒక బలవంతపు సాంఘిక ఒప్పందం మాత్రమే మిగిలింది. వారు ఒకరినొకరు ప్రేమించుకోలేరు. వారు వేరెవరినీ ప్రేమించలేరు.

ఒసేవ్, ఏమేవ్ పిలుపులు నేటికీ..

భర్త చంద్రం బాల్య స్నేహితుడు సిద్ధార్థ సంధ్య జీవితంలోకి ప్రేమ పేరుతో ప్రవేశిస్తాడు. సంధ్య కాదనలేక లోలోనే మదనపడిపోతుంది. చివరికి అతన్ని దూరంగా నెట్టేస్తుంది. కులాంతర వివాహం చేసుకున్న సుదేష్ణ (సంధ్య ఆడపడుచు) అత్తారింట్లోనూ వారి ఆచారాల పట్టింపులను ఎదుర్కొంటుంది. భార్యల్ని ‘ఒసేయ్’ ‘ఏమేవ్’ అని అసహ్యంగా పిలుపులు. వీళ్లని ‘ఏరోయ్’, ‘ఒరేయ్’ అని పిలిస్తే తప్పేంటి? వర్గ సమాజంలో వీటన్నిటికీ పరిష్కారం ఏమిటి?

రక్తసిక్త ఆవిష్కరణ వ్యథ!

గాంధీ ఆస్పత్రిలో పది టేబుళ్ల మీద కాళ్లు ఎడం చేసి, నొప్పుల్ని పళ్ల బిగువున భరిస్తూ, భరించలేక అరుస్తూ, గావు కేకలు, నర్సుల బూతులు ‘లంజ.. పడుకునేటప్పుడు లేదాయే నొప్పి’ నిరీక్షణ.. నొప్పులు, కేకలు, అరుపులు, కన్నీళ్లు, తిట్ల మధ్య ఓ రక్తసిక్త ఆవిష్కరణ కోసం నిరీక్షణ. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవించే వరకు స్త్రీలు పడే బాధలు, అవమానాలు. ‘నీ యవ్వ ఎందుకు కంటరే..’ అసహ్యించుకునే ఆయాలు. దీనంగా, హీనంగా రక్తనాళాల్లో సూదుల నొప్పి. సిగ్గుతో చితికిపోయే వాళ్ల అసహాయతను శాడిస్టుతనంతో చూసే హౌస్ సర్జన్లు.

ఒక్కో కుట్టుకి ఒక్కో ఆర్తనాదం

‘ఒద్దే అమ్మా..నాకో బిడ్డ..సచ్చిపోతనే..ఒద్దే..’ లేబర్ రూం నుంచి పారిపోవాలన్న ప్రయత్నంలో స్త్రీల రోదనలు. వీటిని చూస్తే గుండె పిండేసినట్టుండే బాధతో వైరాగ్యం వచ్చేస్తుంది. కొయ్యండి, కుట్టండి..స్త్రీల శరీరాలే కదా! స్త్రీల శరీరాలపై ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, గర్భాశయాల్లోకి కాపర్టీలు దించుకుని రక్తం ధారపోసే స్త్రీలు. ‘వెళ్లగానే ఎనీమా ఇచ్చే ఆయాలు. షేవింగ్ బ్లేడు పట్టుకుని ‘ఊ.. పండుకో విప్పు.’ పొడవాటి బల్లల మీద ప్రాణం కోసం కొట్టుకునే జీవాల్లా కాళ్లు రెండూ మడిచి..వెడల్పు చేసి.. రక్తం కారుస్తూ.. నొప్పి భరించలేక ఏడుస్తూ పిచ్చి కేకలు వేస్తూ..ఆరుస్తూ..జుట్టు పీక్కుంటూ ఆడవాళ్లు. చిరిగిన పెరేనియంని ఒక్కో కుట్టుకి ఒక్కో ఆర్తనాదం. ఏమిటీ పునరుత్పత్తి ప్రక్రియ ఇంత బాధాకరంగా ఎందుకుంది?

అత్యాచారాలపై చర్చ ఇలాగేనా?

స్త్రీలపై జరిగే అత్యాచారాలపై ‘మానవి’ సంస్థ సమావేశంలో సంధ్య పాల్గొంది. చర్చ. విరామంలో జీడిపప్పులు, పకోడీలు, కూల్ డ్రింక్‌లు. బాబ్డ్ హెయిర్లు, స్లీవ్ లెస్ జాకెట్లు, కుర్తా పైజామాలు, ప్యాంటు షర్టులతో అక్కడికొచ్చిన స్త్రీలు విద్యావంతులు. చర్చించి డాక్యుమెంటేషన్ చేస్తారు.

నవల కాదు.. సామాజిక విజ్ఞాన శాస్త్రం

మానవజాతికి జన్మనిచ్చే లేబర్ రూంలు ఎలా ఉంటాయో పురుషులకు అస్సలు తెలియదు. గీతాంజలి స్వయంగా డాక్టర్ కనుక, ‘ఆమె అడవిని జయించింది’ అనే  నవలలో వీటిని దృశ్యమానం చేశారు. మర్యాదస్తులకు మింగుడుపడని ఈ కఠోర వాస్తవాలను వెల్లడించడం నిజంగా పెద్ద సాహసం. కులం పేరుతో అణచివేత, స్త్రీల లైంగిక సమస్యలు, లైంగిక వేధింపులు, కుటుంబ సంబంధాలు, అసమానతలు, ఈర్ష్యా ద్వేషాలు, వాటి మూలాలున్న వ్యవస్థ గురించి సజీవమైన పాత్రలతో చర్చించిన నవల. దీన్ని నవల అనేకంటే సామాజిక విజ్ఞాన శాస్త్ర మనడం సరైందేమో! కార్యాచరణతోనే సంధ్య అడవిలా అల్లుకుపోయిన సమస్యలను జయించడానికి నడుం బిగించింది.

పుస్తకం: ఆమె అడవిని జయించింది

రచయిత: గీతాంజలి (డాక్టర్ భారతి)

పేజీలు : 230

వెల : రూ. 200

ప్రతులకు: డాక్టర్ భారతి

88977 91964

పరిచయకర్త

రాఘవ

94932 26180

Tags:    

Similar News

అమరత్వంపై