ఓ ఆడపిల్ల కల...

A girl's dream...

Update: 2024-01-28 19:00 GMT

14 ఏళ్ల వయసు.. నైన్త్ క్లాస్.. మండల కేంద్రం నంద్యాల టౌన్ (ఇప్పుడు జిల్లా) కరెంట్ ఆఫీసు ప్రహరీ గోడను ఆనుకుని మాది చిన్న హోటల్.. మా అమ్మ ఈశ్వరమ్మ చేసే ఉగ్గాని బజ్జీ, దోశకు బాగా గిరాకీ ఉండేది.. అలాగే అప్పుడప్పుడు పండగల సమయంలో ఆమె చేసే అత్తరాసెలు (అరిసెలు) కూడా కొనేవారు..

చిన్న బంకు ఉండేది.. హోటల్ అయిపోయాక సామాన్లు అవన్నీ అందులో పెట్టుకోడానికి.. అందులోనే నా స్కూల్ అయిపోయాక లేదా పొద్దున్నే సిగరెట్లు, బీడీలు, పాన్ పరాక్, మానిక్ చంద్ లాంటివి నేను అమ్మేదాన్ని.. వచ్చిన లాభం మా అమ్మకు ఇచ్చేది తక్కువే.. నేను లేని టైంలో కూడా ఒక్క సిగరెట్ అమ్మినా నాకు తెలిసిపోయేది అంతలా ప్రతీది గుర్తుపెట్టుకునేదాన్ని... SPM, తెలుగు గంగ ఆఫీసులు చాలా పెద్దగా ఉండేవి.. మా హోటల్లో పనిచేసే కుర్రాళ్ల కన్నా కూడా నేను పోతే మాత్రం ప్లాస్క్ టీ మొత్తం అవ్వగొట్టుకుని వచ్చేదాన్ని.. ఒక దగ్గర కాకపోతే ఇంకో దగ్గర రోడ్డు వెంట ప్లాస్క్ స్టాండ్‌లో గాజు గ్లాసులు పెట్టుకుని వెళ్లేదాన్ని.. దగ్గర దగ్గర 20 టీలు పట్టే ప్లాస్క్ టీని అవ్వగొట్టుకుని వచ్చి మళ్లీ తీసుకెళ్లేదాన్ని..

అటో డ్రైవర్లు ఎక్కువ వచ్చేవాళ్లు మా హోటల్‍‌కి. ఒకటి మా అమ్మ టీ, టిఫిన్ బాగా చేయడం ఒకటైతే ఇంకోటి మేము అందరం ఆడపిల్లలం హోటల్లో ఉండటం కూడా అనేది నాకు తర్వాత ఎప్పటికో అర్థమైంది (ఈ సబ్జెక్టులోకి వెళ్తే అదో పెద్ద స్టోరీ అవుతాది.. కానీ ఇప్పుడు నేను నా లిక్కర్ షాప్ స్టోరీ గురించి చెప్పాలి అనుకుంటున్నా కాబట్టి దాన్ని పక్కన పెడితే మరోసారి దాని గురించి చెప్తా).. ఆ ఏరియాలో చిన్న చిన్న హోటల్స్ బజ్జీల బండ్లు చాలా ఉండేవి.. వాటి దగ్గరికి ఆటో డ్రైవర్లు, మెకానిక్స్, తెలుగుగంగ ఆఫీసులో పనిచేసే వాళ్లు చాలా మంది వచ్చేవాళ్లు.. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు అయితే నేను చూసిన వాళ్లలో చాలా మంది ఎప్పుడూ తాగి వచ్చేవాళ్లు.. ఎందుకో నాకు అదేమీ తప్పు, చెడు అని అనిపించేది కాదు.. ఇంకా చెప్పాలంటే.. ఎప్పటికైనా మంచి లిక్కర్ షాప్ పెట్టాలి.. అందరూ వచ్చి తాగుతారు.. మంచి ఇన్ కమ్ వస్తాది అని నేను అప్పుడే ఫిక్స్ అయిపోయా.. అప్పుడు నా వయసుకు, మా పరిస్థితికి ఎలా చేయాలి ఏంటి అన్నది అర్థం కాలేదు కానీ.. లిక్కర్ షాప్ పెట్టాలి అంటే చాలా డబ్బులు కావాలి అని మాత్రం అర్థం అయ్యింది..

ఆ డబ్బు సంపాదనకే 18 ఏళ్ల వయసులో ఓ సంస్థలో సబ్ ఎడిటర్ ట్రైనింగ్‌కి ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తే అది రాసి సెలక్ట్ అయ్యి ట్రైన్ ఎక్కేసి వచ్చేశా హైదరాబాద్‌కి.. గుడ్డి నమ్మకం తప్ప నిజంగా ఒంటి సబ్బు కొనుక్కోడానికి కూడా నా దగ్గర డబ్బు లేవు.. కానీ ఎలాగైనా 20 లక్షలు సంపాదించాలి అంతే (బిజినెస్ మేన్ సినిమాలో మహేష్ బాబులాగా ఉండేవి నా ఫీలింగ్స్ ఆ రోజుల్లో)

ట్రైనింగ్‌లో మొదటి రోజే సాయంత్రానికి నాతో పాటు ఉన్న ఒక అమ్మాయి ట్రైనింగ్ దెబ్బకి పారిపోయింది.. మిగిలిన వాళ్లు అంతా 20పైనే ఏజ్. డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్లు. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోనే వదిలేసి వచ్చిన దాన్ని.. అయినా కిందా మీదా పడి.. ఎప్పుడూ ముందు వరుసలోనే ఉండేదాన్ని. ఎగ్జామ్స్ పెట్టినా, డిబేట్లు పెట్టినా ఫస్ట్ కాదు.. అలా అని లాస్ట్ కాదు.. సెకెండ్ ప్లేస్ మాత్రం వచ్చేది.. ట్రైనింగ్ పూర్తైంది.. జీతం రూ.6000.. హాస్టల్‌కు రూ.2800. ఖర్చులు నా తలకాయ.. అన్నీ పోను 2,000 కూడా మిగిలేవి కావు.. ఎంత లెక్కలు వేసినా పార్ట్ టైం పని చేసినా కనీసం రూ.50 వేలు కూడా కూడబెట్టలేదు నేను.. ఈ లోపు వయసుతోపాటు వచ్చి పడే కతలు.. ఆలోచనలతో.. నా లిక్కర్ షాప్ కల పక్కదారి పట్టిపోయింది..

ఇప్పుడు నా వయస్సు 35 ఇద్దరు పిల్లలు.. రూ.40 వేల జీతం.. వారంలో రెండు మూడు సార్లు లిక్కర్ షాప్ గురించి కలలు కంటూ.. ఎప్పటికైనా అవుతాదా అని ఆలోచించుకుంటూ.. గడిపేస్తున్నా.. ఎప్పటికైనా లిక్కర్ షాప్ మంచి సెంటర్లో పెట్టాలని ఇంకా కలలు కంటూనే ఉన్నాను.. ఇది తీరని నా లిక్కర్ షాప్ కల.. మీకు కూడా ఇలాంటి కలలు ఏమైనా ఉన్నాయా.. సాధించుకున్నారా.. లేక ఇంకా సాధించేందుకు కృషి చేస్తున్నారా... అన్నది నాతో చెప్తారా!!!

హైమ సింగతల

86868 00298

Tags:    

Similar News

తొడుగు