ఆ అపార్ట్‌మెంట్‌లో నళ్లా విప్పితే.. లిక్కర్
కొందరు మందుబాబులు పొద్దున లేచి వైన్స్ తెరవకముందే వాటి ముందు క్యూలో నిలుచుంటారు. పొద్దంతా పెద్ద సమస్య కాదు గానీ మళ్లీ రాత్రి అయితేనే వైన్స్ ముందు లైన్లు ఉంటాయి. ఇలా ఇష్టమైన మందు కోసం వైన్స్ ముందు ముష్టి యుద్ధం చేసే మందుబాబులు.. మద్యం నేరుగా ఇంటి కుళాయి నుంచి వస్తున్నదని తెలిస్తే ఎగిరి గంతేయకుండా ఉంటారా? కానీ, కేరళలోని ఓ అపార్ట్‌మెంటు వాసులు మాత్రం మండిపడ్డారు. […]
కొందరు మందుబాబులు పొద్దున లేచి వైన్స్ తెరవకముందే వాటి ముందు క్యూలో నిలుచుంటారు. పొద్దంతా పెద్ద సమస్య కాదు గానీ మళ్లీ రాత్రి అయితేనే వైన్స్ ముందు లైన్లు ఉంటాయి. ఇలా ఇష్టమైన మందు కోసం వైన్స్ ముందు ముష్టి యుద్ధం చేసే మందుబాబులు.. మద్యం నేరుగా ఇంటి కుళాయి నుంచి వస్తున్నదని తెలిస్తే ఎగిరి గంతేయకుండా ఉంటారా? కానీ, కేరళలోని ఓ అపార్ట్‌మెంటు వాసులు మాత్రం మండిపడ్డారు.
త్రిసూర్ జిల్లా చలక్కుడి పట్టణంలోని సొలొమన్ అవెన్యూ అపార్ట్‌మెంటు కాంప్లెక్స్ వాసి గతవారం తన గదిలోని కుళాయి నుంచి వింత వాసన వస్తుండటాన్ని పసిగట్టాడు. ట్యాప్ విప్పగానే అందులో నుంచి బ్రౌన్ కలర్‌లో వస్తున్న మద్యం కలిసిన నీటిని గుర్తించారు. ఇరుగుపొరుగుని కనుక్కోగా వారి గదుల్లోనూ ఆల్కహాల్ వస్తున్నట్టు తెలిసింది. అంతే.. ఫిర్యాదు చేసేందుకు వారు స్థానిక మున్సిపాలిటీ కార్యాలయానికి పరుగెత్తారు. మద్యాన్ని నీటి కుళాయిల ద్వారా పంపి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతారా? అంటూ ఫిర్యాదు చేశారు.
ఏం జరిగిందో తెలుసుకుందామని వెళ్లిన మున్సిపల్ అధికారులు గ‘మ్మత్తు’ విషయాన్ని కనుగొన్నారు. గతంలో కోర్టు ఆదేశాల మేరకు బాటిళ్లను పగులగొట్టి విస్కీ, రమ్ము, బ్రాండీసహా ఆరు వేల లీటర్ల లిక్కర్‌ను ఆ అపార్ట్‌మెంట్ పక్కనే ఎక్సైజ్ అధికారులు గుంత తవ్వి పారపోసినట్టు గుర్తించారు. ఈ మద్యమే అపార్ట్‌మెంట్‌కు నీళ్లిస్తున్న బోరుబావి నీటితో కలిసిందనీ, ఆ నీరే అపార్ట్‌మెంట్ ట్యాంకుకు అటునుంచి గదుల్లోకి సరఫరా అయిందని చెప్పారు. ఇప్పుడైతే తాత్కాలికంగా వేరే దగ్గరి నుంచి నీటిని సరఫరా చేసేందుకు కనెక్షన్ ఇచ్చినట్టు వివరించారు.