Wi-Fi Vibes : మనం రోజూ వాడే Wi-Fi వెనుక అసలు కథ ఇదే..!
Wi-Fi Vibes : మనం రోజూ వాడే Wi-Fi వెనుక అసలు కథ ఇదే..!
దిశ, ఫీచర్స్ : మనకు నచ్చినా, నచ్చకపోయినా మార్పు సహజం. ఇది ప్రకృతి ధర్మమే కాదు. ప్రపంచ మానవాళి అవసరం కూడాను. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమూ అంతే. సానుకూలతలు, ప్రతికూలతలు ఎన్నున్నా మార్పులతో, సరికొత్త హంగులతో దూసుకెళ్తూనే ఉంది. ప్రస్తుతం మనం వాడుతున్న ఇంటర్నెట్, వైఫై (Wi-Fi ) కూడా అంతే. నేడు వీటిని యూజ్ చేయకుండా క్షణం కూడా గడవదంటే అతిశయోక్తి కాదు. ఓ విధంగా చెప్పాలంటే యావత్ ప్రపంచమే Wi-Fi మీద ఆధారపడి నడుస్తోంది. అయితే రీసెంట్‌గా దీని గురించి నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతుండగా.. అసలు వైఫై ఎలా కనుగొనబడిందనే డిస్కషన్ నడుస్తోంది. ఇంతకీ ఆ వైఫై వైబ్స్ ఏంటి? దాని వెనుక అసలు కథేంది తెలుసుకుందాం పదండి!
అంతరిక్ష పరిశోధనలో ఉండగా..
Wi-Fi ఆవిష్కరణ నిజానికి చరిత్రలో చెరగని సాంకేతిక విప్లవానికి సంకేతమనే విషయం తెలిసిందే. అయితే దీని ఆవిర్భావం మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఒక ప్రమాదకర సందర్భంలో కనుగొనబడిందని మీకు తెలుసా? అది 1992. ఆస్ట్రేలియన్ సైంటిస్టులు అంతరిక్షంలోని కృష్ణ బిలాల (black holes) నుంచి సిగ్నల్స్ క్యాప్చర్ చేసే పరిశోధనలో నిమగ్నమై ఉన్నారు. అందుకోసం రూపొందించిన ఒక టూల్‌పై వారు సీరియస్‌గా వర్క్ చేస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే వారు ఒక సరికొత్త సాంకేతికను కనుగొన్నారు. ఆ తర్వాత అదే ఇంటర్నెట్ డెవలప్ అయ్యేందుకు, నేడు మనం ఉపయోగిస్తున్న వైఫై ( Wi-Fi) టెక్నాలజీని కనుగొనేందుకు కారణమైంది.ఓ వైపు పరిశోధనల్లో భాగంగా బ్లాక్ హోల్స్ సిగ్నల్స్ కోసం శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. వాటిని క్యాప్చర్ చేయడమైతే.. సాధ్యం కాలేదు. కానీ ఈ పరిశోధన మరో విప్లవాత్మక మార్పునకు దారితీసింది. ఏంటంటే.. ఈ రీసెర్చ్‌లో డెవలప్ చేసిన గణిత సాధనం (A mathematical tool) ఆ తర్వాత వేరే సందర్భంలో ఉపయోగపడింది. ముఖ్యంగా 1992లో పరిశోధకుడు జాన్ ఓ ‘సల్లివన్ (John O'Sullivan)తన టీమ్‌తో కలిసి CSIROలో వైర్‌లెస్ కంప్యూటర్ నెట్వర్కులను డెవలప్ చేయడానికి దారితీసింది.
వైర్ లెస్‌డేటా బదిలీలో వేగం..
అప్పట్లో జాన్ ఓ ‘సల్లివన్ బృందం బ్లాక్ హోల్స్ రహస్యాల ఛేదనపై వర్క్ చేస్తుండగా.. తీవ్రమైన సమస్యను ఎదుర్కొన్నాడు. వైర్‌లెస్ సిగ్నల్స్ బలహీనంగా, స్మియర్డ్‌గా, నాయిస్‌లో కలిసిపోయేలా ఉండేవి. అయితే ఇవి బ్లాక్ హోల్స్ సిగ్నల్స్‌ను పోలి ఉండేవి(similar to the problem of black hole signals.). దీంతో సమస్యను పరిష్కరించేందుకు అతను కృష్ణ బిలాల కోసం రూపొందించి, అప్పటికే అతను ఉపయోగిస్తున్న మేథమెటికల్ టూల్‌ను ఉపయోగించాడు. ఇది రేడియో తరంగాలను (radio waves) విశ్లేషించి, బహుళ మార్గాల ద్వారా (multipath interference) వచ్చే సంకేతాలను సరిచేయడంలో సహాయపడింది. దీనివల్ల వైర్ లెస్ డేటా బదిలీ (transfer) చాలా ఫాస్ట్‌గా, వేగంగా జరిగింది. ఈ సాంకేతికత ఆధారంగానే ఆ తర్వాత వైఫై డెవలప్ చేశారు శాస్త్రవేత్తలు.
ఇప్పుడదే ఆధారం!
ముందుగా 1992లో ఈ టెక్నాలజీని ఆస్ట్రేలియాలో, 1996లో అమెరికాలో పేటెంట్ చేశారు. 2000 సంవత్సరం నాటికి దీనిని ఉపయోగించి పనిచేసే చిప్‌లను తయారు చేశారు. ఈ అధునాతన టెక్నాలజీ ఆధారంగానే వైఫై డెవలప్ చేయబడింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. వైఫైను కనుగొన్న కారణంగా పరిశోధకుడు జాన్ ఓ సల్లివన్ (John O'Sullivan) కారణంగా ఆ తర్వాత CSIRO రాయల్టీల రూపంలో బిలియన్ డాలర్లు సంపాదించింది. Wi-Fi ఆవిష్కరణకు గాను శాస్త్రవేత్త జాన్ ఓ సల్లివన్‌కు 2009లో ఆస్ట్రేలియా ప్రధాని మీదుగా అవార్డును సైతం అందించారు.