Last Memory : అంతిమ జ్ఞాపకం.. మరణించే ముందు మనిషి ఏం ఆలోచిస్తాడు?
Last Memory : అంతిమ జ్ఞాపకం.. మరణించే ముందు మనిషి ఏం ఆలోచిస్తాడు?

దిశ, ఫీచర్స్
మానవ జీవితం అద్భుతమైంది కావచ్చు..
కానీ శాశ్వతం మాత్రం కాదు.
మానవ పరిణామమొక చరిత్ర కావచ్చు..
కానీ చివరి క్షణాలేమిటో చెప్పలేం..
బతికున్నంత కాలం ఏం చేస్తామో తెలుసు..
కానీ చనిపోతున్నప్పుడు?
మనిషి ఏం ఆలోచిస్తాడు?
శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారో చూద్దాం..
జీవించినంత కాలం సంతోషంగా, సానుకూలంగా ఉండేందుకు ట్రై చేయాలని పెద్దలు, నిపుణులు సూచిస్తుంటారు. మనుగడలో భాగంగా మనుషులందరూ ఎంతో తెలివితో, స్పృహతో వ్యవహరిస్తుంటారు. అద్భుతంగా ఆలోచిస్తుంటారు. మరి చనిపోయే ముందు? మనిషి చివరి క్షణంలో ఏం ఆలోచిస్తాడు? ఆ సమయంలో బ్రెయిన్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? అనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఈ సందేహాలను ఛేదించడంపై బ్రిటన్ సైంటిస్టులు ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నారు. కాగా లూయిస్ విల్లే యూనివర్సిటీకి చెందిన అజ్మల్ జెమ్మర్ అండ్ ఎస్టోనియాలోని టార్టు యూనివర్సిటీకి చెందిన రౌల్ విసెంటే నేతృత్వంలోని పరిశోధకులు ఈ విషయంలో కొంత పురోగతి సాధించినట్లు పేర్కొన్నారు. ఈ వివరాలు ‘ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్ న్యూరోసైన్స్’లో పబ్లిష్ అయ్యాయి.
అధ్యయనంలో భాగంగా మరణానికి ముందు మానవ మెదడు భాగంలో జీవితంలోని అనుభవాలకు సంబంధించిన జ్ఞాపకాలు ఎలా ప్లే అవుతాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు గుండెపోటుతో మరణించిన 87 ఏండ్ల వ్యక్తిపై పరిశోధనలు జరిపారు. అందుకోసం వారు హార్ట్ ఎటాక్‌కు గురైనప్పటి నుంచి సదరు వ్యక్తి చనిపోయే వరకు మూర్ఛలను గుర్తించడానికి, బ్రెయిన్ యాక్టివిటీస్ రికార్డు చేయడానికి ఎలక్ట్రోఎన్సెఫలో గ్రఫీ (EEG)ని ఉపయోగించారు. గుండె కొట్టుకోవడం ఆగిపోయేకంటే ముందు, అట్లనే ఆగిపోయాక 30 సెకన్ల వ్యవధిలో గామా, డెల్టా, టీటా, బీటా డోలనాలో (oscillations), అట్లనే మెదడు డోలనాలలో (brain oscillations)లో ఏం మార్పులను వారు గుర్తించారు. సదరు వ్యక్తి మరణించడానికి ముందు, ఆ తర్వాత మెదడు తరంగాలను పరిశీలించడం ద్వారా, స్పృహలో లేకపోయినప్పటికీ అతని మెదడు ఎలా ఆలోచిస్తున్నట్లు, ఏదో గుర్తు చేసుకుంటున్నట్లు, కలలు గంటున్న తరంగాలను ప్రొడ్యూస్ చేసిందని ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు అంచనాకు వచ్చారు.
ఒక మనిషి జీవించి ఉన్నప్పుడు లేదా కలలు కంటున్నప్పుడు వివిధ అనుభవాలను జ్ఞప్తికి తెచ్చుకునే సందర్భంలో మెదడులో ఎటువంటి తరంగాలు ఉత్పన్నం అవుతాయో, అచ్చం అలాంటి తరంగాలే చనిపోవడానికి 30 సెకన్ల ముందు సదరు 87 ఏండ్ల వ్యక్తి మెదడులో ప్రొడ్యూస్ అయినట్లు సైంటిస్టులు కనుగొన్నారు. అయితే సదరు వృద్ధుడి మెదడ జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం, జీవితంలోని వివిధ సంఘటనలను గుర్తుకు తెచ్చుకోవడం వంటి ప్రాసెస్ కారణంగానే ఈ విధమైన మెదడు తరంగాలు ఉత్పత్తి అయి ఉండవచ్చని చెబుతున్నారు. అయినప్పటికీ దీనిపై పరిశోధనలు ఇంకా జరగాల్సిన అవసరం ఉందంటున్నారు రీసెర్చర్స్.