బయటికి వెళ్లినప్పుడు అతిగా తింటున్నారా.. కంట్రోల్ చేసేందుకు ఈ చిట్కాలను పాటించండి..
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దీని తర్వాత పండుగల పరంపర ప్రారంభమవుతుంది. పండుగ వచ్చిందంటే చాలు స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. వీటితో పాటు పండుగల సమయంలో ప్రతి ఇంటి బల్లమీద రుచికరమైన వంటకాలు ఉంటాయి. వీటిని చూసిన తర్వాత తినకుండా అస్సలు ఉండలేరు. కొంతమంది తమ శక్తి మేరకు ప్రయత్నించినా రుచికరమైన వంటకాలు తినకుండా ఉండలేకపోతుంటారు.
కొందరు తమ మనసు చెప్పిన మాట విని అతిగా తినేసి జీర్ణక్రియ పై భారాన్ని వేసేస్తారు. అందుకే పండుగల సమయంలో అతిగా తినడం మానుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే అతిగా తినడం వల్ల తరచుగా అజీర్ణం, యాసిడ్ రిఫ్లక్స్, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. దీని వల్ల బరువు కూడా పెరగవచ్చు. కాబట్టి అతిగా తినడం నివారించాలంటున్నారు. అందుకే ఈ చిట్కాలను పాటించి ఆరోగ్యకరమైన, సంతోషకరమైన పండుగను ఆనందించండి.
ఖాళీ కడుపుతో బయటకు వెళ్ళవద్దు..
ఇంటి నుండి బయలుదేరే ముందు ఆరోగ్యకరమైన ఆహారాన్ని లేదా ఆరోగ్యకరమైన స్నాక్స్ తినాలి. తద్వారా మీ కడుపు నిండుగా ఉంటుంది. అలాంటప్పుడు బయటి తిండి తినకు అని మనసుకు నచ్చచెప్పవచ్చు. మధుమేహం వంటి అనారోగ్యం ఉన్నవారికి ఇది చాలా ముఖ్యమైన చిట్కాగా చెప్పవచ్చు.
నో చెప్పడానికి సిగ్గు పడకండి..
మనం ఎవరింటికైనా వెళితే వాళ్లు తినమన్నప్పుడు బలవంతంగా భోజనం చేస్తారు. కానీ మీకు తినాలని అనిపించకపోతే లేదా ఆహారం మీ ఆరోగ్యానికి మంచిది కాదని భావిస్తే దానిని తినడం మానుకోండి. అవతలి వ్యక్తిని తిరస్కరించడం నేర్చుకోండి. ఎందుకంటే మీ ఆరోగ్యం కంటే ఏది ముఖ్యమైనది కాదు.
నెమ్మదిగా తినండి..
మనం ఆహారాన్ని తక్కువగా తినాలంటే ముందు నెమ్మదిగా తినడం నేర్చుకోండి. అలాగే ప్లేట్‌లో ఎక్కువ ఆహారానికి బదులుగా కొద్దిగా పెట్టుకుని నెమ్మదిగా తినండి. ప్రతి ముద్దను ఆస్వాదించండి. ఇలా చేయడం వల్ల మీ కడుపు నిండిపోతుంది. అలా చేయడం వలన ఎక్కువ తినడానికి అవకాశం ఉండదు.
ప్రొటీన్లు అధికంగా ఉండే స్నాక్స్ తినండి..
ఎక్కువ సేపు కడుపు నిండినట్టుగా ఉండేందుకు, నట్స్ లేదా గ్రీక్ పెరుగు వంటి ప్రోటీన్ - రిచ్ స్నాక్స్‌ను తినండి. వీటిని తినడం ద్వారా అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది.
వ్యాయామం చేయడం మర్చిపోవద్దు..
అదనపు కేలరీలను బర్న్ చేయడానికి రోజులో కొంత సమయం కేటాయించండి. తేలికపాటి వ్యాయామం కూడా ముఖ్యం.
* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.