Special saree.. నిర్మలమ్మ చీరకట్టు.!
నిర్మలమ్మ బడ్జెటే కాదు.. నిర్మలమ్మ చీరది కూడా ప్రత్యేకతే.!
బడ్జెట్.. బడ్జెట్.. బడ్జెట్..
కామన్‌మ్యాన్ నుంచి కార్పొరేట్ ఎంప్లాయ్ దాక..
అందరినోటా బడ్జెట్ మాటే.!
పెరిగేవి ఏంటి.?
తగ్గేవి ఏంటి.?
ఊరట ఎవరికి.?
ఉతార్ ఎవరికి.?
... వీటన్నింటి మీద చర్చ జరుగుతూనే ఉంది.
ఇవన్నీ కామన్‌గా ఉండేవే.
ఇవి కాకుండా వేరే ఇంకో అంశపై చర్చ జరుగుతోంది.
అదే.. నిర్మలా సీతారామన్ చీర.!
ఆర్థికమంత్రికి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం ఓ పండగలాంటిది. అందుకే ప్రత్యేకంగా ముస్తాబవుతారు. ఈ విషయంలో నిర్మలా సీతారామన్‌ది సమ్‌థింగ్ స్పెషల్. ప్రతీ బడ్జెట్‌కు ప్రత్యేకంగా ముస్తాబవుతారామె. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా చీరకట్టులో కనిపిస్తారు. ఎక్కువగా చేనేత చీరలకే ప్రాధాన్యత ఇస్తారు. ఈ బడ్జెట్‌లో మధుబణి ఆర్ట్ కళంకారి చీరలో మెరిసారు. నిర్మలమ్మ బడ్జెటే కాదు.. నిర్మలమ్మ చీరది కూడా ప్రత్యేకతే.!
మధుబని ఆర్ట్
బాదం రంగు.. హస్తకళా బొమ్మలున్న చీరను బడ్జెట్ వేళ నిర్మలా సీతారామన్ ధరించారు. ఇది ప్రఖ్యాతిగాంచిన మధుబని ఆర్ట్ కళంకారీకి చెందినది. బీహార్‌లోని మధుబని జిల్లా మధుబని ఆర్ట్ కళంకారీ చీరలకు ఫేమస్. కళంకారీ చీరలకు మధుబని కళా చిత్రాలు వేయడమే దీని ప్రత్యేకత. భారతీయ వస్త్ర వారసత్వానికి ఇది నిదర్శనం. నిర్మలా సీతారామన్ ధరించిన ఈ చీరను పద్మశ్రీ దులారీ దేవి డిజైన్ చేశారు. నిర్మలా సీతారామన్ మిథిల ఆర్ట్ ఇనిస్టిట్యూట్‌ను సందర్శించినప్పుడు దులారీ దేవి ఈ చీరను ఆమెకు బహూకరించారు. బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ధరించాలని దులారీ దేవి కోరారట.
కంఠ ఎంబ్రాయిడరీ
గతేడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ నీలిరంగు చీరను ధరించారు. అది పశ్చిమబెంగాల్ బ్రాండ్ కంఠ ఎంబ్రాయిడరీ చీర. దీనిపై కనిపించే ఆకు డిజైన్ బెంగాల్‌కు చెందిన ప్రాచీన ఎంబ్రాయిడరీ వర్క్‌లో ఒకటి. బెంగాల్ నుంచి నిర్మలమ్మ ఈ చీరను ప్రత్యేకంగా తెప్పించుకున్నారు. నీలిరంగు చీర ఆక్వా కల్చర్ ఉత్పాదకతను తెలియజేస్తుంది. తమ ప్రభుత్వం మత్స్యరంగం అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తుందో తెలియజేసేందుకు కంఠ ఎంబ్రాయిడరీ బ్రాండ్ చీరను సూచికగా దీనిని అభివర్ణించారు.
టస్సర్ పట్టు
ఎన్నికల తర్వాత జులైలో జరిగిన మధ్యంతర బడ్జెట్ సమావేశాలకు నిర్మల మేడం తెలుపు.. బంగారు మోటిఫ్ చీరను ధరించారు. ఆ చీరకు మెజెంటా బోర్డర్ ప్రత్యేక ఆకర్షణ. అంతకుముందొకసారి టస్సర్ పట్టు చేనేత చీరను ధరించారు. దీనికి గోధుమ రంగు ఎంబ్రాయిడరీ ఉంది. అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ప్రతీకగా ఈ రామా బ్లూ కలర్ చీర ధరించారని చెప్తారు. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠను కేంద్రం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో తెలియజేస్తుంది ఈ చీర. టస్సర్ పట్టునే దసలి పట్టు అంటారు. నిజాంలను మెచ్చిన పట్టు ఇది. నాడు దేవతలకు మాత్రమే ఈ పట్టుతో చేసిన వస్త్రాలను సమర్పించేవారు.
కస్తూరీ ఎంబ్రాయిడరీ
2023లో ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా నిర్మల మేడం ప్రకాశవంతమైన ఎరుపు చీరను కట్టుకున్నారు. దీనికి బ్రౌన్ కలర్‌లో టెంపుల్ బోర్డర్ ఉంది. కర్ణాటకలని ధార్వాడ నుంచి ఈ చీరను తెప్పించారు. దీనినే కస్తూరీ ఎంబ్రాయిడరీ గోల్డ్ శారీ అని కూడా పిలుస్తారు. కస్తూరీ ఎంబ్రాయిడరీలో చాలా వెరైటీలు ఉంటాయి. చీరల విషయానికి వస్తే వీటిని మామూలుగా కాకుండా భారతీయ సంప్రదాయాన్ని.. కళాత్మకతను.. వృత్తి నైపుణ్యాన్ని మిళితం చేస్తూ వీటిని తయారు చేస్తారు. ఆ విశిష్టతను చాటిచెప్పేందుకు బడ్జెట్ సమయంలో నిర్మల ఈ చీరను ధరించారు.
బొమ్‌కై చేనేత
2022 బడ్జెట్ సమయంలో మంత్రి మెరూన్ రంగు దుస్తులో చాలా సాదాసీదాగా కనిపించారు. ఒడిశాలోని గంజాం జిల్లా బొమ్‌కై నుంచి ఈ చీరను తెప్పించుకున్నారు. దీనిని బొమ్‌కై చేనేత అంటారు. అంతర్జాతీయ ఫ్యాషన్ షోలలో కూడా బొమ్‌కై చీరలు మెరుస్తుంటాయి. వీటిని ముతక పత్తితో తయారుచేస్తారు. ప్రకాశంతమైన రంగుల్లో ఉంటాయివి. వీటిలో ఎక్కువగా కాంట్రాస్ట్ బార్డర్లు ఉంటాయి. పల్లూస్ కూడా ఉంటాయి. సహజ మూలకాలచే ప్రేరేపింపబడిన భారీ మోటిఫ్ వర్క్‌లు ఉంటాయి.
పోచంపల్లి చీర
2021 బడ్జెట్ సందర్భంగా భూదాన్ పోచంపల్లి చేనేత చీరలో కనిపించారు నిర్మలా సీతారామన్. చేనేత కార్మికులు.. కళాకారులకు మద్దతుగా గోధుమ.. ఎరుపు రంగు కలగలిసిన చీర అది. పోచంపల్లి చేనేత గురించి తెలుసు కదా.? నిలువు పేకల మగ్గంపై నేసిన ఈ చేనేత కళాఖండాలకు దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. సాధారణ మహిళల నుంచి విదేశీ వనితల వరకూ అందరికీ ఆకట్టుకునే చీరలు పోచంపల్లి సొంతం. అగ్గిపెట్టెలో పెట్టే పట్టుచీరను మొదటగా నేసిన ఘనత పోచంపల్లి చేనేతది.
మంగళగిరి చీర
2020 బడ్జెట్ సమయంలలో నిర్మల మేడం నీలంరంగు అంచులో పసుపు పచ్చ.. బంగారు వర్ణంలో ఉన్న చీరకట్టులో కనిపించారు. ఆస్పిరేషనల్ థీమ్‌కి అనుగుణంగా ఈ చీరను ధరించారు. ఇక నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ 2019లో కట్టుకున్న చీరను మంగళగిరి నుంచి తెప్పించుకున్నారు. ఈ చీర గులాబీరంగులో ఉంటుంది. మంగళగిరి సాంప్రదాయ చీరలకు పెట్టింది పేరు. మంగళకరమైన సందర్భాలన్నింటికీ మంగళాన్నిచ్చే చీరగా మంగళగిరి చీరకు గుర్తింపు ఉంది. అందుకే తొలి బడ్జెట్ సందర్భంగా నిర్మలమ్మ ఈ చీరను ధరించారు.
ఏ చీరను కట్టుకుంటే..
ఆర్థికమంత్రిగా తొలి బడ్జెట్ ప్రవేశపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు నిర్మలా సీతారామన్ ఏ చీర కట్టుకున్నా దానికో ప్రాధాన్యత ఉంటుంది. తొలి బడ్జెట్ సమయంలో మంగళగిరి చీరను ధరించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అవసరాలకు కీలకమైన పోలవరానికి నిధులు మంజూరు చేశారు. తాజా 2025 బడ్జెట్‌లో బీహార్ మధుబని ఆర్ట్ కళంకారీ చీరను ధరించి బీహార్‌కు అధిక నిధులు కేటాయించారు.
ఇవీ వేస్తారేమో.?
రాబోయే రోజుల్లో నిర్మలమ్మ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏ చీర ధరిస్తారనే చర్చ కూడా జరుగుతోంది. లిస్టులో పశ్చిమ బెంగాల్ ఇకరా చీరలు.. తమిళనాడు కాంజీవరం చీరలు.. గద్వాల చీరలు.. మధ్యప్రదేశ్ చందేరీ చీరలు.. ఆంధ్రప్రదేశ్ కళంకారీ చీరలు ఉన్నాయి. చూడాలి మరీ వచ్చే బడ్జెట్‌లో కూడా నిర్మలా మేడమే ఆర్థికమంత్రిగా ఉంట ఏ చీరలో దర్శనమిస్తారో.?