Summer Health: ఎండలు మండుతున్నాయ్! ఈ అనార్యోగ సమస్యలు వచ్చే ప్రమాదం.. జాగ్రత్త!
ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. పైగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయట అడుగుపెట్టాలంటేనే జంకుతున్నారు. ఇక, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోతే వేసవి వేడి కారణంగా వివిధ రకాల వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో సాధారణంగా వేసవిలో వచ్చే అనారోగ్య సమస్యలేంటో తెలుసుకుందాం.
చాలా మంది వర్షాకాలం, చలికాలంలోనే వ్యాధులు ఎక్కువగా వస్తాయని అనుకుంటారు. కానీ, వేసవిలో కూడా కొన్ని వ్యాధులు ముప్పుతిప్పలు పెడతాయి. ఇక వేసవిలో సాధారణంగా కనిపించే అనారోగ్యం వడదెబ్బ (Heat stroke). వాతావరణం మారి అధిక ఉష్ణోగ్రత, పొడివేడి గాలి, సూర్యరశ్మికి గురికావడం వల్ల వడదెబ్బకు గురవుతుంటారు. ఇక ప్రతి ఏటా వడదెబ్బ పడే వారి సంఖ్య పెరుగుతున్నట్లు సమాచారం. దీనికి వెంటనే చికిత్స చేయకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. ఇక ఈ సమస్య రాకుండా ఉండాలంటే నీరు ఎక్కువగా తాగాలి. నిమ్మరసం, కొబ్బరి నీరు, గ్లూకోజ్ తరచుగా తీసుకోవాలి.
అలాగే, వేసవిలో వచ్చే ఆరోగ్య సమస్యల్లో డీహైడ్రేషన్ కూడా ఒకటి. వాతావరణంలోని వేడి కారణంగా చెమట పట్టడం వల్ల శరీరం నుంచి చాలా నీరు, లవణాలు బయటకు వెళ్లిపోతాయి. అందుకే రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. అలాగే, వేసవిలో ఆల్కహాల్, కెఫైన్ తీసుకోవడాన్ని తగ్గించడం వల్ల హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడుతుంది. వేసవిలో చర్య సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. ఎండ కారణంగా ముఖం, చేతులు, కాళ్ళపై బాధాకరమైన దద్దుర్లు ఏర్పడుతాయి. వడదెబ్బ వల్ల ఎరుపు, పొక్కులు, చర్మ సమస్యలు వస్తాయి. దీనిని నివారించడానికి చర్మాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్‌గా ఉంచుకోవాలి.
ఇక ఎండ కాలంలో ఆహారం ద్వారా వ్యాధులు అధికంగా వ్యాపిస్తుంటాయి. ముఖ్యంగా ఫుడ్ పాయిజనింగ్ సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఇది నీరు, కలుషితమైన ఆహారం ద్వారా వ్యాపిస్తుంది. ముఖ్యంగా వేసవి కాలం బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. వండిన ఆహారాన్ని బయట వేడిలో ఉంచినప్పుడు బ్యాక్టీరియా పెరగడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు తాజా ఆహారాన్ని తినడం ముఖ్యం. మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుకోవాలి. మసాలా ఆహారాలను ఎక్కువగా తినడాన్ని తగ్గించాలి. లేకపోతే ఫుడ్ పాయిజన్ వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఎండల కారణంగా శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ చాలా సాధారణం. ఈ సమస్యలో ఆమ్ల లేదా పుల్లని పండ్లు తక్కువగా తినాలి. దాల్చిన చెక్క, వెల్లుల్లి, తేనె వంటి యాంటీ బాక్టీరియల్ ఆహారం తీసుకోవటం వల్ల ఈ సమస్యను పరిష్కరించటంలో సాయపడుతుంది. అంతేకాదు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడేందుకూ వేసవి పరిస్థితులు కారణమవుతాయి. అలాగే, అధిక వేడి లేదా సీజన్ మారడం వల్ల చాలా మంది జలుబు, దగ్గు, గొంతునొప్పి బారిన పడుతున్నారు. తాజా పండ్లు, కూరగాయలు, పోషకాలతో నిండిన ఆరోగ్యం తీసుకోవటం వల్ల ఈ సమస్యల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.