Mutton Fry Recipe: రుచిలో తిరుగులేని మటన్ ఫ్రై ఇలా చేయండి.. ముక్క గట్టిగా లేకుండా మెత్తగా వస్తుంది!

చాలా మంది మటన్ కర్రీని ఎంతో ఇష్టంగా తింటారు.

Update: 2023-12-31 08:31 GMT

దిశ, ఫీచర్స్: చాలా మంది మటన్ కర్రీని ఎంతో ఇష్టంగా తింటారు. కాగా మటన్ కూరను వివిధ రుచుల్లో తయారు చేస్తూ ఉంటారు. పైగా మటన్ ఫ్రై చేసి ఎక్కువకాలం పాటు స్టోర్ చేసుకుని మరీ తింటుంటారు. అయితే ఈ రోజు నోరూరించే మటన్ ఫ్రై గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఈ మటన్ ఫ్రై రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. చికెన్ ఫ్రై కన్నా ఎక్కువగా మటన్ ఫ్రైనే చేయాలనుకుంటారు అంతే. దీన్ని తయారు చేయడం చాలా ఈజీ. లొట్టలేసుకుంటూ తినాలనిపించే ఈ మటన్ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావల్సిన పదార్థాలు!

నూనె – 3 టేబుల్ స్పూన్స్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు- ఒక కప్పు, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన పచ్చి మిర్చి – 3, కరివేపాకు – ఒక రెమ్మ, తగినంత ఉప్పు, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, మటన్ మసాలా – ఒక టీ స్పూన్, కసూరిమెంతి – ఒక టీ స్పూన్, చివర్లో తగినంత కొత్తిమీర తీసుకోవాలి.

మటన్ ఉడికించడానికి కావల్సిన పదార్థాలు: నూనె - వన్ టేబుల్ స్పూన్, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , మటన్ – అరకిలో, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – ఒక టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ఒక కప్పు వాటర్ తీసుకోవాలి.

మటన్ ఫ్రై తయారీ విధానం!

ముందుగా కుక్కర్ తీసుకుని, నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాక మటన్ వేసి కలపాలి. తరువాత పసుపు, ఉప్పు, కారం వేసి కొద్దిగా వాటర్ వేసి కలపాలి. మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. దీంతో మటన్ మెత్తగా అవుతుంది. తరువాత అడుగు మందంగా ఉండే కళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. అనంతరం జీడిపప్పు వేయించి, ప్లేట్ లోకి తీసుకోండి. అదే ఆయిల్‌లో వెల్లుల్లి తరుగు వేసి వేయించండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పుదీనా వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక.. మటన్‌ను నీటితో పాటు కళాయిలో వేసుకోవాలి. మట‌లో ఉన్న నీరంతా పోయే వరకు పెద్ద మంటపై వేయించాక పెరుగు వేసి కలపాలి.

మటన్ చక్కగా వేగి నూనె పైకి తేలిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. 2 నిమిషాల పాటు వేగాక మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మటన్ మసాలా వేసి ఒకసారి కలపాలి. మరో రెండు నిమిషాల తర్వాత కసూరిమెంతి, కొత్తిమీర వేసి.. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే నోరూరించే మటన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఈ మటన్ ఫ్రైను ఒక్క ముక్క కూడా విడిచిపెట్టకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని సైడ్ డిష్‌గా తినడానికి, స్నాక్స్‌గా కూడా తీసుకోవచ్చు.


Similar News