Health : శరీరంలోని ఈ భాగాల్లో నొప్పి.. ఆ వ్యాధి సంకేతం కావచ్చు!
Health : శరీరంలోని ఈ భాగాల్లో నొప్పి.. ఆ వ్యాధి సంకేతం కావచ్చు!
దిశ, ఫీచర్స్ : శరీరంలో జరిగే మార్పులు కొన్నిసార్లు అనారోగ్య సంకేతాలను కూడా వెల్లడిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. వాటిని బట్టి అలర్ట్ అయితే ఆరోగ్యాన్ని ముందుగానే కాపాడుకోవచ్చునని సూచిస్తుంటారు. ముఖ్యంగా జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో మార్పులు ఇటీవలి కాలంలో పలు రకాల సమస్యలకు దారితీస్తున్నాయి. అలాంటి వాటిలో మధుమేహం ఒకటి. ఎంతోమందిని ప్రభావితం చేస్తున్న ఈ వ్యాధిని ‘సైలెంట్ కిల్లర్’గానూ పేర్కొంటారు. అయితే కొందరు తమకు షుగర్ వచ్చిందనే విషయాన్ని ముందుగానే గుర్తించలేకపోవడం తర్వాత అవస్థలకు కారణం అవుతోంది. కాబట్టి అలా గుర్తించదగ్గ కొన్ని లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కీళ్ల నొప్పి
శరీరంలోని కొన్ని భాగాల్లో నొప్పి సంభవించడం డయాబెటిస్ డెవలప్ అవుతోందన్న సంకేతానికి నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. మఖ్యంగా ఏ కారణం లేకుండానే తరచుగా కీళ్ల నొప్పులు వేధిస్తుంటే అది మధుమేహ లక్షణాల్లో ఒకటిగా అనుమానించాలి. ఎందుకంటే వైద్య నిపుణుల ప్రకారం.. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడంవల్ల ఇలా జరుగుతుంది. నిర్లక్ష్యం చేస్తే ఎముకలు, కండరాలు బలహీన పడతాయి. పొట్ట కండరాలు, నడుము భాగంలో కూడా నొప్పిగా అనిపించవచ్చు. అలాగే కీళ్లల్లో వాపు, కదలికల్లో ఇబ్బందులు తీవ్రమవుతాయి. కాబట్టి అకారణంగా కీళ్ల నొప్పులు వేధిస్తుండటాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. అలాంటప్పుడు డయాబెటిస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
భుజాల్లో నొప్పి
ఎప్పుడో ఒకసారి భుజాల్లో పెయిన్ అనిపిస్తే అది కామన్. కానీ అప్పుడప్పుడూ వస్తూ వేధిస్తుంటే మాత్రం అది షుగర్ వ్యాధి సంకేతం కూడా కావచ్చు. రక్తంలో చక్కెరస్థాయిలు పెరిగినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా రోజులుగా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నవారు ఎంతకైనా మంచిది షుగర్ టెస్టులు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
చేతుల్లో తిమ్మిరి
పనిచేస్తున్నప్పుడో, ఖాళీగా కూర్చున్నప్పుడో ఒక్కసారిగా చేతులు జలదిరిస్తుంటాయి. తిమ్మిర్లు పడుతుంటాయి. ఎప్పుడో ఒకసారి ఇలా జరిగితే అది సరైన పొజిషన్‌లో కూర్చోకపోవడమో, బాడీ సహజమైన ప్రక్రియలో భాగమో అనుకోవచ్చు. కానీ తరచుగా ఇలాగే జరుగుతుంటే మాత్రం అనుమానించాల్సిందే. అట్లనే చేతుల్లో వాపు, నొప్పి, చర్మం గట్టిపడటం, కదలిక్లో ఇబ్బంది వంటివి కూడా మీ శరీరంలో షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయనడానికి సంకేతం కావచ్చు. సో.. కొంతకాలంగా ఇలాంటి సింప్టమ్స్ అనుభవిస్తుంటే గనుక బీ అలర్ట్. ఎందుకంటే అది మధుమేహం కావచ్చ.
కాళ్లల్లో భరించలేని నొప్పి
అధిక శ్రమ చేసినప్పుడు, బయట తిరిగి అలసిపోయినప్పుడు అరికాళ్లల్లో, పిక్కల్లో నొప్పులు రావడం కొందరికి సహజం కానీ.. ఏ పనీ చేయకపోయినా రావడం, తరచుగా రావడం మాత్రం అనారోగ్య సంకేతం. ఎందుకంటే రెండు వారాలకు మించి ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారంటే మీ శరీంలో డయాబెటిస్ స్టార్ట్ అయి ఉండవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఇలా జరుగుతుంది. మధుమేహం ఉన్నప్పుడు సిరలు సన్నబడి, రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడంవల్ల కూడా ఈ నొప్పి అధికం అవుతుంది. కాబట్టి ఎంతకైనా మంచిది షుగర్ టెస్ట్ చేయించుకొని జాగ్రత్త పడాలంటున్నారు నిపుణులు.
చిగుళ్లలో రక్తం కారడం
చిగుళ్లలో రక్తం కారడం సాధారణంగానే ఏదైనా దంత సంబంధిత వ్యాధి లక్షణం అనుకుంటాం. అయితే షుగర్ వ్యాధి వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉంది. అకస్మాత్తుగా చిగుళ్లలో నొప్పి సంభవించడం, రక్తం కారడం, దంతాలు బలహీన పడటం, ఆహారం నమలడానికి ఇబ్బందులు ఎదుర్కోవడం వంటి సమస్యలు వారానికి మించి కొనసాగుతున్నాయంటే డయాబెటిస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరంలో మధుమేహం డెవలప్ అవుతున్నప్పుడు చిగుళ్లకు రక్త ప్రసరణలో వచ్చే ప్రతికూల మార్పుల కారణంగా ఇలా జరుగుతుంది.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.