దిశ, ఫీచర్స్: గురక.. వినడానికిది చిన్న సమస్యగానే అనిపిస్తుంది కానీ.. బాధితుల్లో నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. అంతేకాకుండా గురక శబ్దంతో వారి కుటుంబంలోని వ్యక్తులు కూడా ఇబ్బంది పడతారు. పడుకున్నప్పుడు నోరు లేదా ముక్కు ద్వారా శ్వాస పీల్చడంలో ఏర్పడే అడ్డంకి కారణంగా వచ్చే ఒక విధమైన శబ్దాన్ని ఆరోగ్య నిపుణులు గురకగా పేర్కొంటున్నారు. ఇది ఎందుకు వస్తుంది?, ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం.
దాదాపు మిడిల్ ఏజ్ వ్యక్తుల్లో లేదా వృద్ధుల్లో గురక ఎక్కువగా కనిపిస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ గొంతులోని కండరాల్లో మార్పు రావడం ఇందుకు కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు. అలాగే గొంతు, మెడ చుట్టూ కొలెస్ట్రాల్ పేరుకుపోవడంతో అక్కడ శ్వాస నాళాలు కుంచించుకుపోయి, గాలి పీల్చడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. దీనివల్ల కూడా గురక శబ్దం వస్తుంది. ముక్క దిబ్బడ, జలుబు, సైనస్ ఇన్ఫెక్షన్లు, నాసికా రంద్రాల్లో ఏర్పడే ఆటంకం, నిద్రపోయే భంగిమ సరిగ్గా లేకపోవడం వంటి కారణాలతో కూడా గురక శబ్దం వచ్చే చాన్స్ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
ఏం జరుగుతుంది?
గురక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. నిర్లక్ష్యం చేస్తే ‘స్లీప్ ఆప్నియా’కు దారితీస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ పరిస్థితివల్ల నిద్రలో ఉండగానే మధ్య మధ్యలో సడెన్‌గా శ్వాస ఆగిపోతుంది. ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోతాయి. ఎక్కువ రోజులుగా సమస్యను ఎదుర్కొంటున్నవారిలో అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గురకవల్ల నిద్రలేమి సమస్య కూడా తలెత్తవచ్చు.
నివారించడం ఎలా?
*గురక ఎందుకు వస్తుందో తెలుసుకుంటే నివారణ సులువు అవుతుంది. ముఖ్యంగా అధిక బరువుతో బాధపడుతుంటే గనుక బరువు తగ్గడానికి వ్యాయామాలు, ఆహార నియమాలు పాటించాలని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే అధిక బరువు కారణంగా శరీరంలో కొవ్వు పెరుగుతుంది. మెడ చుట్టూ , గొంతు కండరాల చుట్టూ అది పేరుకుపోతే గురక వస్తుంది. బరువు తగ్గించుకోవడం ముఖ్యం.
*పడుకునే భంగిమను బట్టి కూడా గురక రావచ్చు. కాబట్టి పొజిషన్ మార్చి చూడండి. సైడ్ స్లీపింగ్ పొజిషన్ వల్ల తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. కుడి లేదా ఎడమ వైపునకు తిరిగి పడుకోవడంవల్ల గొంతు, ముక్కు కండరాలు, వాయు మార్గాలు క్లోజ్ అవుతాయి. శ్వాసలో ఆటంకం ఏర్పడదు. అలాగే నిద్రపోయేటప్పుడు మీ తల కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. అంటే సాధారణంకంటే ఎత్తైన దిండు వాడటం బెటర్.
*శరీరం డీహైడ్రేషన్‌కు, తీవ్రమైన అలసటకు గురైనా గురక వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ సందర్భంలో ముక్కు, గొంతు భాగాల్లో శ్లేష్మం చేరడంవల్ల మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రతిరోజూ సరిపడా నీళ్లు తాగాలి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు పెద్ద వయస్సులో గొంతు కండరాలను ప్రభావితం చేస్తాయి. దీంతో శ్వాస సరిగ్గా ఆడక గురక సమస్య వస్తుంది. కాబట్టి వాటిని మానివేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇవన్నీ సాధారణ గురక సమస్యకు నివారణ మార్గాలు.. అయితే వీటిని వైద్యుల సలహా మేరకే మాత్రమే పాటించాలి.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.