మీరు సక్సెస్ సాధించాలా?.. ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి!
వ్యక్తిగత జీవితంలోనే కాదు, ప్రొఫెషనల్ లైఫ్‌లో సక్సెస్ సాధించడానికి టైమ్ మేనేజ్‌మెంట్‌తోపాటు ఇతర అంశాలు కూడా ముడిపడి ఉంటాయి.
దిశ, ఫీచర్స్: వ్యక్తిగత జీవితంలోనే కాదు, ప్రొఫెషనల్ లైఫ్‌లో సక్సెస్ సాధించడానికి టైమ్ మేనేజ్‌మెంట్‌తోపాటు ఇతర అంశాలు కూడా ముడిపడి ఉంటాయి. మారుతున్న పరిస్థితుల్లో ఆయా రంగాల ఉద్యోగులు తక్కువ సమయంలోనే ఎక్కువ టాస్కులు పూర్తి చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఒక పని చేయాల్సి ఉన్నప్పుడు తీరికగా గంటల తరబడి చేసుకుంటూ పోతామంటే కుదరదు. అసలే పోటీ ప్రపంచం. ప్రతీ క్షణం కొత్త అప్‌డేట్ వచ్చిపడుతూనే ఉంటుంది. కాబట్టి ‘నిధానమే ప్రధానం’ ‘ఆలస్యమే అమృతం’ వంటి మాటలు ఈరోజుల్లో పనికిరావని నిపుణులు చెప్తున్నారు.
రాకెట్ స్పీడుతో దూసుకుపోయే తత్వం అలవర్చుకున్నవారే సక్సెస్ సాధించగలరని సైకాలజిస్టు హేమా మహేందర్ అంటున్నారు. అందుకే మీరు ఏ రంగంలో ఉన్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా అక్కడి పరిస్థితిని, మీ వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. కాలంతోపాటు పరుగెత్తగల నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి. ప్రతీ రంగంలో, ప్రతీ పనిలో యాజమాన్యాలు కోరుకునేది కూడా ఇదే. తక్కువ సమయంలో నాణ్యమైన పని లేదా ప్రొడక్ట్ కనిపించాలి. వ్యక్తులుగా మనం కూడా అదే కోరుకుంటాం. చాలా విషయాల్లో ఈజీ మెథడ్‌ను వెతుకుతుంటాం. అదే ఇప్పుడు అందరికీ కావాల్సింది. అలాగని ఈజీ మెథడ్ నాణ్యతను దెబ్బతీస్తుందని భావించనవసరం లేదు. నాణ్యత దెబ్బతీయని ఈజీ మెథడ్‌ని ఎంచుకోవడమే అసలైన నైపుణ్యానికి నిదర్శనం.
ప్రాముఖ్యతను గుర్తించండి
వృత్తిపరమైన జీవితంలో మీరు చేయాల్సిన పనిని ఎలా ఈజీగా చేయవచ్చో ఆలోచించండి. అందుకు ఉన్న వనరులేంటి? ఎలా అయితే సమర్థవంతంగా చేయగలమనే విషయాలు అబ్జర్వేషన్ ద్వారా, ఆచరణ ద్వారా తెలుసుకోవాలి. చేయాల్సిన పనిని ప్రాముఖ్యతల ఆధారంగా విభజించుకోవాలి. ఏది అత్యవసరం? ఏది తర్వాత చేయవచ్చు? అనేది గుర్తించి అవసరమైన దానిని మొదట పూర్తి చేయాలి. దీనివల్ల మీరు స్ట్రెస్‌గా ఫీలయ్యే పరిస్థితి రాదు. పనిని విభజించి, ఒక అవగాహనకు వస్తారు కాబట్టి క్లారిటీతో పనిచేయగలుగుతారు.
పనిలో బ్రేక్ తీసుకోండి
కొందరు పనిలో పడి విరామం తీసుకోకుండా ఉంటారు. సిస్టమ్ ముందు పనిచేసేవారు కంప్యూటర్లకు అతుక్కుపోతుంటారు. బ్రేక్ తీసుకుంటే పని పెండింగ్‌లో పడిపోతుందని భావిస్తుంటారు. ఇది కొంత నిమమే అయినప్పటికీ, విరామంలేని పనివల్ల ఒత్తిడికి గురయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. మధ్య మధ్యలో కాస్త రిలాక్స్ అయితే మీ మైండ్ రీ ఫ్రెష్ అవుతుందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఏ రకమైన ఉద్యోగం చేస్తున్నప్పటికీ ప్రతీ గంటలకు కనీసం నాలుగుసార్లు ఐదారు నిమిషాలైనా బ్రేక్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పరధ్యానం వదిలేయండి
పరధ్యానం పనికి ఆటంకం కలిగించే ప్రధాన శత్రువు. ఎందుకంటే ఇది ఏకాగ్రతను, పనిలో నాణ్యతను దెబ్బతీస్తుంది. కుటుంబ, ఆర్థిక, సామాజిక పరమైన సమస్యలు, రిలేషన్ షిప్‌లో తగాదాలు, లవ్ ఫెయిల్యూర్, అనారోగ్యాలు వంటివి చాలామందిలో పరధ్యానానికి కారణం అవుతుంటాయని నిపుణులు చెప్తుంటారు. ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నవారు పనిలో ఉన్నప్పటికీ వారి మనస్సు మరెక్కడో ఉంటుంది. కాబట్టి మీ పరధ్యానికి కారణమయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. అవసరమైతే మానసిక నిపుణులను, మీకు సపోర్టుగా ఉండే వ్యక్తులతో చర్చించి ప్రాబ్లం క్లియర్ చేసుకుంటే మీ వృత్తిపరమైన జీవితం ఇబ్బందుల్లేకుండా కొనసాగుతుంది.
సంబంధంలేని విషయాలు
కొందరు తాము చేస్తున్న పని ఒకటైతే, ఆలోచనలు మరోవైపు డైవర్ట్ అవుతుంటాయి. ఇందుకు చుట్టు పక్కల వ్యక్తులు, లేదా కన్ఫర్ట్‌గా లేని ఆఫీసు వాతావరణం, తరచూ డిస్టర్బ్ చేసే వ్యక్తులు, బయటి శబ్దాలు వంటి రకరకాల కారణాలు ఉండవచ్చు. అలాగే మీరు ఆఫీసు వర్కులో ఉన్నప్పుడు ఆ వర్కుతో సంబంధంలేని ఇతర పనులు పెట్టుకోవడం కూడా అసలు పనికి ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి ఆఫీసులో ఉన్నప్పుడు ఆఫీసు పనిగురించి మాత్రమే ఎక్కువగా ఆలోచించాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి విషయాల గురించి ఆలోచించాలి. అంతేగాని ఆఫీసులో ఉండి ఇంటి విషయాలు లేదా ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపిన క్షణాలు, విహార యాత్రలకు వెళ్లిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ, పక్కనున్న వారితో అదేపనిగా చర్చిస్తూ ఉంటే, పనిలో నాణ్యత తగ్గవచ్చు. లేదా ఒక పనిని పర్‌ఫెక్టుగా పూర్తి చేయలేకపోవచ్చు. అందుకే ఒక పనిలో నిమగ్నమైనప్పుడు సంబంధంలేని ఇతర విషయాల జోలికి వెళ్లడం మానుకోవాలి.
అతి ఆలోచనలు వదిలేయండి
పనిలో నాణ్యత దెబ్బతినేందుకు అసలైన కారణాల్లో ఓవర్ థింకింగ్ ఒకటి. కొందరు తమలో పనిచేయగల సామర్థ్యం బాగానే ఉన్నప్పటికీ మరింత బాగా చేయాలనో, బాస్ వద్ద మెప్పుపొందాలనో, మరింత నాణ్యతను జోడించాలనో అదే పనిగా ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచన మంచిదే కానీ, అది ఒక పరిమితిలో ఉన్నప్పుడే మెరుగుదలకు తోడ్పడుతుంది. అంతేగానీ ఆలోచన హద్దులు దాటి ఓవర్ థింకింగ్‌కు దారితీస్తేనే ప్రమాదమే అంటున్నారు మానసిక నిపుణులు. ఎందుకంటే ఒక పనిని పూర్తిచేసే క్రమంలో అతి ఆలోచనలు మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అధిక ఒత్తిడికి గురిచేస్తాయి. దీనివల్ల పనిలో నాణ్యత దెబ్బతింటుంది. అందుకే వాటిని వదిలేయాలి.
ఇవి కూడా చదవండి:
బ్రహ్మ ముహూర్తం.. సూర్యోదయానికి ఎన్ని గంటల ముందు ప్రారంభమవుతుంది..?