Health tips: కళ్ల కింద నల్లటి వలయాలకు కారణాలు ఇవేనా?
సాధారణంగా నిద్ర లేకపోవడం వల్లే కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయని అనుకుంటారు..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : సాధారణంగా నిద్ర లేకపోవడం వల్లే కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయని అనుకుంటారు. నిజానికి ఇది కూడా ఒక కారణం అయినప్పటికీ అలసట, జెనెటిక్స్ లేదా వృద్ధాప్యం వంటి ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. హైపర్ పిగ్మెంటేషన్‌కు కారణమయ్యే రక్తనాళాల సంకోచం కారణంగా లేదా కళ్ల చుట్టూ చర్మం పలుచబడటం వల్ల కళ్ల కింద ప్రాంతం నల్లగా కనిపిస్తుంది. అక్కడి చర్మం చాలా సున్నితంగా, పలుచగా ఉంటుంది కనుక మొదట ప్రభావితమవుతుంది. దీనివల్ల స్వేద గ్రంథులు దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాదు డార్క్ సర్కిల్స్ అకాల వృద్ధాప్యానికి సంబంధించిన మొదటి సంకేతాల్లో ఒకటిగా పరిగణించబడతాయి.
కారణాలు:
* జెనెటిక్స్ : ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే వారసత్వంగా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
* చర్మశోథ(డెర్మటైటిస్) : చర్మశోథగా పిలువడే తామర కళ్ల క్రింద రక్త నాళాలు విస్తరించడానికి, ఆ ప్రభావం చర్మం ద్వారా కనిపించేందుకు కారణమవుతాయి.
* కళ్లను రుద్దడం: రుద్దడం, నలపడం వల్ల కళ్ల కింద వాపు వస్తుంది. ఇది రక్తనాళాలకు అంతరాయం కలిగిస్తుంది.
* నిద్ర లేమి : నిద్రలేమి అలవాట్లు కళ్ల కింద చర్మం పాలిపోయినట్లు కనబడేలా చేస్తాయి. దీంతో మీ రక్త నాళాలు చర్మం ద్వారా సులభంగా బహిర్గతం కాగలవు.
* హైపర్ పిగ్మెంటేషన్ : సూర్యరశ్మికి ఎక్కువగా బహిర్గతమైతే మీ శరీరం మరింత మెలనిన్ ఏర్పడేందుకు ప్రేరేపిస్తుంది. మెలనిన్ అనేది మీ చర్మానికి దాని రంగును అందించే పదార్థం(వర్ణద్రవ్యం).
* నిర్జలీకరణం : తగినంత నీరు తాగకపోతే కళ్ల కింద చర్మం నిస్తేజంగా అనిపించవచ్చు.
* జీవనశైలి కారకాలు: ఒత్తిడి, మితిమీరిన ఆల్కహాల్ వినియోగం, ధూమపానం వంటి ఇతర అంశాలు కూడా కళ్ల కింద నల్లటి వలయాలను కలిగిస్తాయి.
చికిత్స ఎలా ?
* తగినంత నిద్ర : కళ్ల చుట్టూ నీడలు కనిపించకుండా నిరోధించేందుకు ప్రతి రాత్రి కనీసం ఏడు గంటలు నిద్రపోవాలి.
* కోల్డ్ కంప్రెస్ : విస్తరించిన రక్త నాళాలు కుంచించుకుపోయేందుకు కళ్లపై ఐస్ ముక్కలు పెట్టాలి. ఇది నల్లటి వలయాల రూపాన్ని కూడా తగ్గిస్తుంది.
* దోసకాయలు: కళ్లపై దోసకాయ ముక్కలను పెట్టాలి. ఇవి నీరు, విటమిన్ 'సి'తో నింపబడి ఉంటాయి కాబట్టి కళ్ల కింద వాపును నివారిస్తాయి.
* టీ బ్యాగ్స్ : చల్లని టీ బ్యాగ్‌లను కళ్ల కింద పెడితే.. 'టీ'లోని కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్లు ప్రసరణను పెంచుతాయి.
* ఫేషియల్స్: కంటి చుట్టూ మసాజ్ చేసే ఫేషియల్స్ సర్క్యులేషన్ మెరుగుపరచడంలో సాయపడతాయి.
* మేకప్ : మీ నల్లటి వలయాలను దాచడానికి మీ చర్మం రంగును మిళితం చేయడానికి అండర్ ఐ కన్సీలర్, మేకప్ ఫౌండేషన్ ఉపయోగించవచ్చు.
ఇవి కూడా చదవండి : పిరికి లక్షణాలతో పక్షుల్లో విడాకులు.. మగ జాతిలోనే