Quietest world : మనసుకు హాయినిచ్చే నిశ్శబ్ద ప్రపంచం.. పర్యాటకులను అలరిస్తున్న అందమైన ప్రకృతి దృశ్యాలు!

Quietest world : మనసుకు హాయినిచ్చే నిశ్శబ్ద ప్రపంచం.. పర్యాటకులను అలరిస్తున్న అందమైన ప్రకృతి దృశ్యాలు!

Update: 2024-10-10 13:02 GMT

దిశ, ఫీచర్స్ : ఎవరూ లేని ఏకాంత ప్రదేశం.. జన సంచారం లేని నిశ్శబ్ద వాతావరణం.. వింటేనే భయంగా అనిపిస్తోందా? కానీ అన్ని సందర్భాల్లో అలా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు నిశ్శబ్దమే మనసుకు హాయినిస్తుంది. మానసిక ప్రశాంతతను కల్పిస్తుంది. ఆనంద డోలికల్లో విహరింపజేస్తుంది. అలాంటి మధురానుభూతిని కలిగించే నిశ్శబ్ద పర్యాటక ప్రదేశాలు ఈ ప్రపంచంలో ఎక్కడున్నాయో మీకు తెలుసా? ఎంతోమంది పర్యాటకులను అలరిస్తున్న ఆ ప్రాంతాలు మానసిక ఆనందాన్ని, వికాసాన్ని కలిగిస్తాయని చెప్తారు. ఆ ప్రదేశాలేవి? ప్రత్యేకతలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

హలేకాలా క్రేటర్, హవాయి

రకరకాల ఆకారాల్లో దర్శనమిచ్చే హలేకాలా (Haleakala Crater) అగ్ని పర్వతాలు యునైటెడ్ స్టేట్స్‌లోని హవాయి (Hawaii) నేషనల్ పార్క్‌లో ఉన్నాయి. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే ఈ ప్రాంతం ఏటా ఎంతోమంది పర్యాటకులను ఆకట్టుకుంటోంది. కాగా దాని చుట్టు పక్కల పచ్చటి మైదానాలు, అడవులు కూడా ఉన్నాయి. వాటిలోపల వన్య ప్రాణులు విహరిస్తుంటాయి. కాకపోతే ఇక్కడి బంజరు రాతి భూభాగం మాత్రం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది. అంటే అక్కడికి వెళ్లిన పర్యాటకులు తప్ప మిగతా హడావిడి ఏదీ కనిపించదు. ఈ నిశ్శబ్దమే మానసిక ప్రశాంతతను కలిగిస్తుందని అక్కడికి వెళ్లే టూరిస్టులు చెప్తుంటారు.

అంటార్కిటికా..

అంటార్కిటికా (Antarctica) గురించి చాలా మందికి తెలిసినా.. అది అత్యంత నిశ్శబ్ద వాతావరణానికి ప్రసిద్ధి అనే విషయం తెలియకపోవచ్చు. ఇక్కడి మారుమూల కొండ ప్రాంతాలన్నీ తెల్లటి దుప్పటి కప్పుకున్న విధంగా ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటాయి. వాటి తీరం వెంబడి శాశ్వత నివాసాలు గానీ, జన సంచారం గానీ ఉండదు. కేవలం వాటిని చూడటానికి వెళ్లిన పర్యాటకులు తప్ప ఇంకెవరూ కనిపించరు. పగుళ్లు తేలిన మంచు, పాయలుగా పారుతూ.. నీటిపై తేలుతున్న నురగలు చూడముచ్చటగా ఉంటాయి. అంటార్కి‌టికాలో ఉండే భిన్న వాతావరణ పరిస్థితి కారణంగా శాస్త్రవేత్తలు అక్కడి చల్లటి వెదర్ మొదలుకొని వన్య ప్రాణుల వరకు పరిశోధనలు, అధ్యయనాలు కొనసాగిస్తుంటారు. అత్యంత నిశ్శబ్ద వాతావరణం కలిగిన మనసుకు హాయినిచ్చే అంటార్కిటికాను సందర్శించడానికి చాలామంది ఆసక్తి చూపుతారు.

కెల్సో డ్యూన్స్, కాలిఫోర్నియా

కాలిఫోర్నియాలోని మొజావే ఎడారిలో గల కెల్సో డ్యూన్స్ (Kelso Dunes) వాటి భిన్నమైన వాతావరణం కారణంగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ 600 అడుగులకు పైగా ఎత్తైన భారీ ఇసుక దిబ్బలు ఆకట్టుకుంటాయి. ఉత్తర అమెరికాలోని ఎత్తైన ప్రదేశాల్లో ఒకటిగా పేర్కొనే ఈ కెల్సో డ్యూన్స్ ఏకాంతాన్ని, ప్రకృతి సిద్ధమైన సహజ సౌందర్యాన్ని కోరుకునే పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడ ట్రెక్కింగ్ చాలా సాహసోపేతమైన చర్యగా పేర్కొంటారు. ఈ ప్రాంతంలోని ఇసుక దిబ్బల్లో గాలి వీచినప్పుడు వచ్చే ఒక విధమైన వేడివాతావరణం సువాసనలను వెదజల్లుతుంది. సందర్శకులు ఈ దీనిని మనసారా ఆస్వాదిస్తూ ఆనందిస్తారు. జన సంచారంలేని అత్యంత నిశ్శబ్ద ప్రాంతమే అయినా మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందని చెప్తారు.

తక్ బీ హా సెనోట్, మెక్సికో

మెక్సికో దేశంలోని యుకాటాన్ ద్వీప కల్పంలో అందమైన ప్రాంతమే తక్ బీ హా సెనోట్ (Tak Be Ha Cenote) దాని నిశ్శబ్ద వాతావరణం కారణంగా పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది. ఇక్కడ విహరిస్తుంటే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుందని చెప్తారు. అంతేకాకుండా దీనిని ఎల్లప్పుడూ మంచినీటితో నిండి ఉండే సహజ సిద్ధమైన జలాశయంగా పేర్కొంటారు. ఇందులోకి దిగడం, అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించడం చాలా ఆనంద దాయకంగా ఉంటుంది. పర్యాటకులు ఇక్కడి చల్లటి నిశ్శబ్ద వాతావరణంలో మధురానుభూతిని పొందుతారు.

ల్యాండ్‌మన్న లౌగర్, ఐస్లాండ్

ఐస్ ల్యాండ్‌లో(Iceland) గల, ల్యాండ్ మన్నలౌగర్ (Landmannalaugar), ఇక్కడి ఫ్జల్లాబాక్ (Fjallabak) నేచర్ రిజర్వ్‌లోని ఒక అందమైన ప్రదేశం. ఇది లౌగర్‌హాన్ అగ్ని పర్వత లావా క్షేత్రం అంచున ఉంది. సహజసిద్ధమైన ప్రకృతి దృశ్యాలకు నిలయంగా ఉన్న ఈ ప్రదేశం పర్యాటకులను బాగా ఆకట్టుకుంటుంది. అనేక శతాబ్దాలుగా అగ్ని పర్వత విస్ఫోటనాల ద్వారా రూపుదిద్దుకున్నదని చెప్తారు. కాగా ఏరియా రియోలైట్‌తో కూడిన రంగు రంగు పర్వతాలకు ప్రసిద్ధి. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, బూడిద రంగులతో కూడిన నీటి ఆవిరి బ్యాక్ డ్రాప్స్ ఆకట్టుకుంటాయి. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతితో కనెక్ట్ కాగల అత్యంత నిశ్శబ్ద పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. 

Tags:    

Similar News