Pet dogs : తోడుగా ఓ కుక్క ఉంటే.. మీ గుండె పదిలమే!!
Pet dogs : తోడుగా ఓ కుక్క ఉంటే.. మీ గుండె పదిలమే!!
దిశ, ఫీచర్స్ : ఇంటిలో కుక్కను పెంచుకుంటే కొండంత ధైర్యం అంటారు కొందరు. అది ఇంటికి కాపలా కాయడమే కాకుండా మనుషులకు అన్ని వేళలా తోడుగానూ ఉంటుంది. ఒంటరి తనంతో బాధపడేవారు డాగ్స్‌తో ఆడుకోవడం, కలిసి వాకింగ్ చేయడం వంటివి చేయడంవల్ల వారి మానసిక స్థితి కూడా మెరుగు పడుతుందని చెప్తారు. అందుకే చాలా మంది పెట్ డాగ్స్(Pet dogs )కు ప్రయారిటీ ఇస్తున్నారు. గతంతో పోలిస్తే ప్రపంచ వ్యాప్తంగా పెంపుడు కుక్కలు కలిగి ఉన్నవారి సంఖ్య పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. అయితే రీసెంట్ స్టడీ మరో కొత్త విషయాన్ని వెల్లడించింది. ఏంటంటే.. కుక్కలను పెంచుకున్నవారే కాకుండా, గుండె శస్త్ర చేయించుకున్నవారు కూడా కుక్కను కలిగి ఉండటం వల్ల ఎక్కువకాలం జీవించే అవకాశం ఉంటుంది!
ఇటీవల స్వీడన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు గుండె ఆపరేషన్ చేయించుకున్న వారి జీవిత కాలంపై అధ్యయనాలు నిర్వహించారు. అందుకోసం 20 ఏండ్ల కిందట గుండె జబ్బుల బారిన పడిన వారిని ఎంపిక చేసుకొని విశ్లేషించారు. అలాగే వీరిలో పెట్ డాగ్స్ కలిగి ఉన్నవారిని, కుక్కలు పెంచుకోని వారిని వేర్వేరు గ్రూపులుగా విభజించి, ఎవరు ఎంత కాలం జీవించారనేది ఎనలైజ్ చేశారు. కాగా గుండె జబ్బులు కలిగి, అందుకోసం శస్త్ర చికిత్స చేయించుకున్న వారిలో మరణాల సంఖ్య, కుక్కలు పెంచుకోని వారితో పోలిస్తే 33 శాతం తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.
అయితే గుండె జబ్బుల బాధితులే కాకుండా ఒంటరిగా జీవిస్తూ కుక్కలను పెంచుకున్నవారిలో కూడా, పెంచుకోని వారితో పోలిస్తే మరణాల రేటు 15 శాతం తక్కువగా ఉందట. పెంపుడు కుక్కలు హృద్రోగుల్లో ఆనందానికి కారణం కావడం, తద్వారా శారీరక ఆరోగ్యం మెరుగు పడటం వంటివి ఇందుకు సహాయపడుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే మీ గుండె పదిలంగా ఉండాలంటే మీరూ ఓ కుక్కను పెంచుకొని చూడండి అంటున్నారు పెట్ లవర్స్.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.