అందమైన సరస్సులు.. ఎత్తైన పర్వతాలు.. మనదేశంలో అలరించే పర్యాటక ప్రాంతాలివే..

ప్రకృతి అందాలకు పుట్టినిల్లు మన ఇండియా. ఇక్కడ అన్ని సీజన్లలలోనూ చూడముచ్చటైన పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.

Update: 2024-06-05 07:44 GMT

దిశ, ఫీచర్స్ : ప్రకృతి అందాలకు పుట్టినిల్లు మన ఇండియా. ఇక్కడ అన్ని సీజన్లలలోనూ చూడముచ్చటైన పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అయితే కొన్నింటిని ఆయా సీజన్ల వారీగా చూస్తేనే బాగుంటాయని నిపుణులు చెప్తుంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో మాత్రమే చూడటానికి ప్రజలు ఇష్టపడే అందమైన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తమిళనాడులోని కొడై కెనాల్

ప్రకృతి అందాలకు నిలయంగా ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాల్లో కొడై కెనాల్ ఒకటి. ఇది తమిళనాడులోని పళని కొండలలో నెలవై ఉన్న మనోహరమైన హిల్ స్టేషన్ ఇది. పచ్చటి మైదానాలు, దట్టమైన అడవులు, వంపులు తిరిగి పారుతున్న నదులు, పొగమంచు కప్పేసినట్లు ఉండే లోయలు చూడముచ్చటగా ఉంటాయి. వర్షాకాలంలో వాటిని చూస్తుంటే మనసుకు హాయిగా అనిపిస్తుందట. అలాగే కొడై కెనాల్ పిల్లర్ రాక్స్, కోకర్స్ వాక్ వంటి సుందరమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. మరింత ఆనందాన్ని కలిగించే కొడై కెనాల్ సరస్సు కూడా చాలా ఫేమస్. ఇందులో బోటింగ్ చేస్తూ చాలామంది ఎంజాయ్ చేస్తుంటారు.

మహారాష్ట్రలోని లోనావాలా..

మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వత శ్రేణులలో గల అందమైన పట్టణం లోనావాలా.. వర్షాకాలంలో ఇక్కడికి పర్యాటకులు పోటెత్తుతుంటారు. పచ్చటి చెట్లు, గడ్డి మైదానాలతో కనిపించే ఈ కొండ ప్రాంతం సహజమైన పకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ఇది ముంబై నుంచి 83.1 కి.మీ. అలాగే పుణె నుంచి అయితే 66 కి. మీ. దూరంలో ఉంటుంది. రైళ్లు, ఫ్లైట్లల్లో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక పశ్చిమ కనుమల్లో నివసించే ప్రజలు వారాంతాల్లో అత్యధికంగా సందర్శించే అందమైన ప్రదేశం కూడా లోనావాలానే. ఇక్కడ ట్రెక్కింగ్, సైట్ సీయింగ్, క్యాంపింగ్, గుర్రపు స్వారీ వంటివి బాగా ఆకట్టుకుంటాయి.

కేరళలోని మున్నార్

కేరళ ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. ఈ రాష్ట్రంలోని ఏ గ్రామీణ ప్రాంతానికి వెళ్లినా అందమైన సరస్సులు, పచ్చటి కొబ్బరి తోటలు, కొండ ప్రాంతాలు దర్శనమిస్తుంటాయి. వర్షాకాలంలో అయితే మరింత అందంగా అలరారుతుంటాయి. అలాంటి వాటిలో ఇక్కడి మున్నార్ చాలా ఫేమస్. చుట్టూ పర్వతాలు, వాటిని సగానికిపైగా కప్పేసినట్లు ఉండే పొగ మంచు, ప్రశాంతమైన వాతావరణం చూడముచ్చటగా ఉంటుంది. ఇక వర్షాకాలంలో చిరు జల్లులు కురుస్తున్నప్పుడు ఈ ప్రాంతాన్ని చూడటానికి చాలామంది ఇష్టపడతారు. పలువురు మున్నార్‌ను భూలోక స్వర్గంగా పేర్కొంటారు.

మేఘాలయలోని చిరపుంజీ

చిరపుంజి గురించి చిన్నప్పుడు చదువుకునే ఉంటారు. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతమిది. వర్షాకాలంలో ఇక్కడ పర్యటించడం ఓ అడ్వెంచర్‌గా భావిస్తారు. చుట్టూ అందమైన పచ్చటి మైదనాలు, అటవీ ప్రాంతాలు, ఎత్తైన కొండల నుంచి కిందికి జాలువారే జలపాతాలు ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. వర్షాకాలంలో ఈ ప్రకృతి దృశ్యాలను చూసిన ఎవరైనా సరే ఆనంద పారవశ్యంలో మునిగిపోవాల్సిందే. ప్రపంచ నలు మూలల నుంచి ఎంతోమంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్

ఇండియాలోనే మోస్ట్ రొమాంటిక్ డెస్టినేషన్‌‌గా ఉదయ్ పూర్‌ను పేర్కొంటారు. రాజస్థాన్‌లోని ఈ పర్యాటక ప్రదేశం ఎల్లప్పుడూ సందడిగా కనిపిస్తుంది. ఇక్కడ వర్షం పడటం కాస్త తక్కువే. కానీ ఈ ప్రాంతంతోపాటు దాని చుట్టు పక్కల గల పిచోళా, ఫతేనగర్ సరస్సు వర్షాకాలంలో కనువిందు చేస్తుంటాయి. చాలామంది జంటలుగా ఇక్కడ హనీమూన్ టూర్ కోసం వస్తుంటారు.

డార్జిలింగ్ పర్వతాలు

డార్జిలింగ్ పర్వతాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎగుడూ దిగుడు లోయలతో కూడిన ఈ కొండ ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో నెలవైన ఫేమస్ టూరిస్టు ప్లేస్‌గా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడి తేయాకు తోటలు అందమైన ప్రకృతి దృశ్యంగా తోస్తాయి. అంతేకాకుండా డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేలకు కూడా ప్రసిద్ధి చెందింది. మంచుతో కప్పబడి ఉండే పర్వతాలు, పచ్చని లోయలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. మరో విషయం ఏంటంటే.. ఇక్కడి టైగర్ హిల్ నుంచి సూర్యోదయ వేళను వీక్షించడానికి అందరూ ఇష్టపడతారు.

ఇసుక బీచ్‌లకు ప్రసిద్ధి.. గోవా

అందమైన ఇసుక బీచ్‌లకు ప్రదేశానికి ప్రసిద్ధి చెందిన గోవా ప్రపంచంలోనే ఫేమస్. ఇది భారతదేశంలో పశ్చిమతీరాన అరేబియా సముద్రం అంచున ఉంది. ఈ ప్రాంతాన్ని కొంకణ తీరమని కూడా అంటారు. గోవాకు ఉత్తరాన మహారాష్ట్ర, తూర్పు, దక్షిణాన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. జనాభా పరంగా నాలుగవ అతిచిన్న రాష్ట్రం. సీజన్లతో సంబంధం లేకుండా గోవా బీచ్‌ను సందర్శించడానికి చాలామంది ఇష్టపడతారు. ప్రపంచం నలుమూలల నుంచి టూరిస్టులు వస్తుంటారు. ఇక్కడి ఓల్డ్ గోవాలోని కలోనియల్ ఆర్కిటెక్చర్‌ కూడా చూడముచ్చటగా ఉంటుంది.


Similar News