Working Women: ‘వర్కింగ్ ఉమెన్‌’ని పెళ్లి చేసుకోవడం లింగ సమానత్వానికి నిదర్శనమా?

ఇది మహిళలను గౌరవించే విషయంలో గొప్ప మార్పు అని కూడా తాజా సర్వే పేర్కొన్నది.

Update: 2023-02-28 07:12 GMT

దిశ, ఫీచర్స్: పెళ్లంటూ చేసుకుంటే ఇంటి పట్టునే ఉండి, రుచికరమైన వంటకాలు చేస్తూ కుటుంబానికి సేవ చేసే మహిళనే చేసుకోవాలనే పాతకాలపు ధోరణి క్రమంగా మారుతోంది. ఒకప్పుడు ఉద్యోగం చేసే మహిళను చేసుకోవడానికి అంతగా ఇష్టపడని పురుషులు ప్రస్తుతం ఉద్యోగం చేసే అమ్మాయి అయితేనే ఇష్టపడుతున్నారని ఒక మ్యాచ్ మేకింగ్ వెబ్‌సైట్ నిర్వహించిన సర్వేలో తేలింది. పైగా హై సాలరీ ఉన్న అమ్మాయిని చేసుకోవడానికి యువకులు ఇంకా ఆసక్తి చూపుతున్నారట. ఇది మహిళలను గౌరవించే విషయంలో గొప్ప మార్పు అని కూడా తాజా సర్వే పేర్కొన్నది. నిజంగా గొప్ప సామాజిక మార్పా? ఇది లింగ సమానత్వానికి నిదర్శనమా? అనేదే ఇక్కడి చర్చనీయాంశమని నిపుణులు చెప్తున్నారు.

సర్వే చెప్తున్నదేమిటి?

వధూవరులు తమకు ఎటువంటి జోడీ కావాలని కోరుకుంటున్నారో తెలుసుకునే ఉద్దేశంతో ఒక మ్యాచ్ మేకింగ్ వెబ్‌సైట్ జరిపిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. డిసెంబర్ 1, 2021 నుంచి, డిసెంబర్ 31, 2022 వరకు 1.6 మిలియన్ల మంది పురుషులు, 0.9 మిలియన్ల మంది స్త్రీలు షాదీ డాట్‌ కామ్ (Shaadi.Com) వేదికగా 2.5 మిలియన్ల మంది వినియోగదారుల అభిరుచులను అధ్యయనకర్తలు పరిశీలించారు. సర్వే ఫలితాల ప్రకారం.. పురుషులు వర్కింగ్ ఉమెన్స్‌ను పెళ్లి చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందులోనూ హయ్యర్ ఇన్‌కం ఉన్నవారిపై మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. మరో విషయం ఏంటంటే నాన్ వర్కింగ్ ఉమెన్స్‌‌‌గా ఉన్నవారిలో కేవలం 31 శాతం మంది మాత్రమే తాము వర్కింగ్ ఉమెన్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి. వర్కింగ్ ఉమెన్‌ను ఇష్టపడుతున్నారంటే.. వివాహ బంధాల్లో లింగ అసమానతలు తొలిగిపోతున్నాయని భావించవచ్చా? సర్వే మాత్రం దేశం లింగ సమానత్వం దిశగా కదులుతున్నట్లు చెప్తోంది. ఇది నిజమేనా? వాస్తవ పరిస్థితులు అందుకు అడ్డు పడుతున్నాయా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఎందుకు ఇష్టపడుతున్నారు?

ఉద్యోగాల్లో, పని ప్రదేశాల్లో మహిళలు నమ్మకస్తులని తాజా సర్వే గుర్తు చేసింది. వర్కు ఫోర్సులలో ఎక్కువ మంది మహిళలను నిలుపుకోవడానికి ఇది దోహద పడుతుందని పేర్కొన్నది. అయితే పురుషులు వర్కింగ్ ఉమెన్‌ను మాత్రమే ఎందుకు ఇష్టపడుతున్నారనే విషయంలో సామాజిక వేత్తలు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా అధిక ఆదాయం ఉన్న శ్రామిక మహిళలను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం దేనికి సంకేతం? ఇది లింగ సమానత్వానికి ఒక అడుగు ముందుపడినట్లే అని సర్వేలో చెప్పింది ఎంత వరకు వాస్తవం అని ప్రశ్నిస్తున్నారు. సమానత్వం కోసమే వర్కింగ్ ఉమెన్‌ను ఇష్టపడుతున్నట్లయితే మరి వారి జీతం ఎంత? అని ఎందుకు లెక్కిస్తున్నారు? పైగా హై‌సాలరీ మహిళలనే ఎందుకు ఇష్టపడుతున్నారు? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సాలరీకోసం తప్ప సమానత్వం కోసం కాదని ఇక్కడ స్పష్టమవుతోందని కొందరు సామాజిక నిపుణులు, మహిళా వాదులు అభిప్రాయ పడుతున్నారు. ఒక మహిళకు కెరీర్‌ విషయంలో సపోర్టు అవసరమే. ఎందుకంటే ఉద్యోగం లేదా చేసే పని ఆమె డ్రీమ్ కావచ్చు. అభిరుచి కావచ్చు. ఆర్థిక స్వాతంత్ర్యం కోరుకునే మార్గం కావచ్చు. కానీ అధిక ఆధాయం ఉన్నవారికి మాత్రమే సపోర్టు చేస్తున్నట్లు పురుషులు బిల్డప్ ఇవ్వడం అనేది స్వార్థం తప్ప మరొకటి కాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మూస ధోరణులు మారుతున్నాయా?

తాజా అధ్యయనం లేవనెత్తుతున్న మరో ప్రశ్న ఏమిటంటే.. సమాజం మూస పద్ధతులను విడనాడి, మహిళల ఆర్థిక స్వాతంత్య్రాన్ని కోరుకుంటోంది. అలా అయితే మరి మన దేశంలో పెళ్లయిన మహిళల్లో కేవలం 32 శాతం మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఎందుకు వెల్లడించింది? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మహిళలు ఎంత గొప్ప కెరీర్‌లో రాణిస్తున్నప్పటికీ, ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఇంటికి తిరిగి వచ్చాక ఇంట్లో పనులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేయాలని భర్త, కుటుంబం భావిస్తుంది కూడా. అలాంటప్పుడు పురుషులు వర్కింగ్ ఉమెన్‌ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం మాత్రమే గొప్ప సమానత్వమని, మార్పు భావించలేమని కొందరు స్త్రీ వాదులు పేర్కొంటున్నారు.

తప్పని అదనపు బాధ్యతలు

సైన్స్ డైరెక్ట్ జర్నల్ ‘‘ట్రావెల్ బిహేవియర్ అండ్ సొసైటీ’’లో పబ్లిషైన ఒక కొత్త సర్వేలో ప్రకారం 52 శాతం మంది మహిళలు వర్కింగ్ ఉమెన్‌గా ఉంటూ కూడా రోజుకూ ఐదు గంటల కంటే ఎక్కువసేపు వరకు తమ తమ ఇంటి పనులు చేస్తున్నారు. కుటుంబాలను చూసుకుంటున్నారు. అలాగే పెళ్లికాకముందు వర్కింగ్ ఉమెన్‌గా ఉన్నవారు పెళ్లయిన తర్వాత మానేయడానికి కారణం వారు ఆఫీసులో, ఇంట్లో పనులవల్ల తీవ్ర ఒత్తిడికి గురికావడమే. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే పనిచేసే స్త్రీని మాత్రమే వివాహం చేసుకోవాలన్న పురుషుల స్వార్థపరమైన కోరిక ఎన్నటికీ లింగ సమానత్వానికి ప్రతిరూపంగా భావించలేం. అలా చేయడంవల్ల సమానత్వం ఏర్పడదు కూడా అంటున్నారు స్త్రీ వాదులు. పెళ్లితో సంబంధం లేకుండా పురుషుల మాదిరిగానే మహిళలు ఎటువంటి ఆటంకాలు, సమస్యలు లేకుండా తమ వృత్తిని కొనసాగించగలగాలి. అంతే తప్ప ఆదాయం ఉన్నవారిని పెళ్లి చేసుకోవడం స్త్రీలను ఉద్దరిస్తున్నట్లుగానో, వారికి మేలు చేస్తున్నట్లుగానో భావించలేం. మరోవైపు భారతదేశంలో వివాహం అనేది స్త్రీ జీవితంలో పూర్తిగా మార్చేస్తుంది. వివాహం అయ్యాక వర్కింగ్ ఉమెన్ అయినా సరే వివక్షకు, పని ఒత్తిడికి గురవుతుంది. ఆధిపత్యభావ జాలానికి బందీ అవుతుంది. ఇది కదా మారాల్సింది. అలా జరగాలంటే.. ఇంటి పనుల్లోను, పిల్లలు, కుటుంబ బాధ్యతల్లోను స్త్రీ, పురుషులు సమాన బాధ్యతలు స్వీకరించాలని సామాజిక వేత్తలు చెప్తున్నారు. కనీసం స్వీకరించే విషయంపై ఆసక్తి కూడా కనబర్చని పురుషులు వర్కింగ్ ఉమెన్‌ను, పైగా హై సాలరీ వర్కింగ్ ఉమెన్‌ను ఇష్టపడటం అంటే పక్కా స్వార్థమేనని, ఇది ఎన్నటికీ లింగ సమానత్వానికి నిదర్శనం కాదని పేర్కొంటున్నారు. 

Tags:    

Similar News