Bird attacks on planes : పక్షులు విమానాన్ని ఎందుకు ఢీకొడతాయి?
Bird attacks on planes : పక్షులు విమానాన్ని ఎందుకు ఢీకొడతాయి?
దిశ, ఫీచర్స్ : విమానం ఆకాశంలో వెళ్తుండగా పక్షులు ఢీకొనడంతో జరిగిన ప్రమాద ఘటనల గురించి మనం అప్పుడప్పుడూ వింటుంటాం. రీసెంట్‌గా (డిసెంబర్ 25) కజకిస్థాన్‌లో అదే జరిగింది. అజర్ బైజన్ ఎయిర్ లైన్స్ (Azerbaijan Airlines) చెందిన ఫ్లైట్ బాకు నుంచి రష్యాలోని చెచెన్ ప్రాంతంలోని గ్రోజ్నికి ప్రయాణికులతో వెళ్తుండగా అక్టౌ ఏరియాలో పక్షి ఢీకొనడంతో కుప్పకూలినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు మరణించారు. కాగా ఈ నేపథ్యంలో అసలు విమానాలను పక్షులు ఎందుకు ఢీ కొడతాయి? అంత చిన్న పక్షులు ఇంత పెద్ద విమానాన్ని ఢీకొడితే ఎందుకని కుప్పకూలుతుంది? తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
*పక్షులు విమానాలను ఉద్దేశ పూర్వకంగా క్రాష్ చేయవు. కానీ అనుకోకుండా జరుగుతుంటాయి. ఆకాశంలో విమానం వెళ్తూ ఉండగా పక్షులు ఎదురైతే.. అప్పుడు అవి రెండూ ఢీ కొట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే అలాంటప్పుడు చిన్నగా ఉంటుంది కాబట్టి పక్షి వెంటనే చనిపోతుందని, విమానం సేఫ్‌గా ఉంటుందని అనుకుంటే పొరపాటే..! ఎందుకంటే పక్షి వచ్చి విమానాన్ని ఢీ కొట్టినా, విమానం వెళ్లి పక్షిని ఢీ కొట్టినా ప్రమాదం మాత్రం విమానానికే అంటున్నారు ఏవియేషన్ నిపుణులు.
*పక్షులు సింగిల్‌గా వచ్చినా, గుంపులు గుంపులుగా వచ్చి విమానాన్ని ఢీకొన్నా.. అది కూలిపోయే ప్రమాదం ఉంది. అందుకే విమానాలను పక్షులు ఎగరగలిగే ప్రాంతంకంటే ఎత్తైన ఆకాశ మార్గంలో నడుపుతుంటారు. తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు ఒకవేళ ఏదైనా పక్షి వచ్చి ఢీకొడితే ఆ పరిస్థితి పైలట్ సామర్థ్యాన్ని, విమానం ఇంజిన్ సామర్థ్యాన్ని కంట్రోల్ తప్పేందుకు కారణం అవుతుంది. అట్లనే ఫ్యూయల్ ట్యాంకును పక్షులు ఢీకొన్నా లీక్ అవడం, మంటలు చెలరేగడం వంటివి జరుగుతాయి.
* విమానం ఇంజిన్ భాగాన్ని పక్షులు తాకితే దానిలోపల ఉన్న బ్లేడ్లు, అలాగే ఫ్లైట్ ఎలక్ట్రానిక్ సిస్టం దెబ్బతింటాయి. ఈ పరిస్థితి విమానం ఎగిరే సామర్థ్యాన్ని వెంటనే తగ్గించడంవల్ల కుప్పకూలవచ్చు. అందుకే ఈ మధ్య పక్షులు ఢీకొట్టినా ఏమీ కాకుండా విమానాలను బలంగా నిర్మిస్తున్నారు. అయినా జాగ్రత్త అవసరం అంటున్నారు నిపుణులు.
*పక్షులు ఫ్లైట్‌ను గానీ, ఫ్లైట్ పక్షులను గానీ తాకినప్పుడు విమానం ఇంజిన్‌లో ఏదైనా చిన్న సమస్య ఉన్నా.. అది మరింత పెరిగిపోయి పెద్దది అవుతుంది. ఫ్యూయల్ ట్యాంక్‌ను లేదా దాని పైపును పక్షి తాకితే విమానంలోని ఇంధనం వెంటనే బయటకు వస్తుంది. ఆ సమయంలో ఎండగా ఉన్నా, వాతావరణం కాస్త వేడిగా ఉన్నా వెంటనే మంటలు చెలరేగుతాయి. విమానం కాలిపోయి అందులోని ప్రయాణికుల ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది.
* ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్రకారం.. 1990 నుంచి 2015 మధ్య కాలంలో పౌర విమానాలపై 1,77, 269 బర్డ్ స్ట్రైక్స్ జరిగినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇక యునైటెడ్ స్టేట్స్‌లో మాత్రమే ఏడాదికి 13,000 పైగా పక్షి దాడులు జరిగాయి. దీనికారణంగా 400 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. అయితే ఏటా ప్రపంచ వ్యాప్తంగా విమానాలపై బర్డ్స్ స్ట్రైక్స్ కారణంగా 1.2 బిలియన్ డాలర్ల నష్టం జరుగుతున్నట్లు నిపుణులు నివేదికలు పేర్కొంటున్నాయి.