పాము విషంతో రూ. కోట్లలో బిజినెస్
తమిళనాడులోని కాంచీపురం సమీపంలో ఉన్న వడ నెమ్మెలి అనే గ్రామంలో ఇరుల తెగ ప్రజలు పాములను పట్టడంలో అసాధారణమైన నైపుణ్యం కలిగి ఉన్నారు

దిశ, ఫీచర్స్: తమిళనాడులోని కాంచీపురం సమీపంలో ఉన్న వడ నెమ్మెలి అనే గ్రామంలో ఇరుల తెగ ప్రజలు పాములను పట్టడంలో అసాధారణమైన నైపుణ్యం కలిగి ఉన్నారు. తాతల కాలం నుంచి ఈ వృత్తి వారసత్వముగా వస్తుండగా.. అడవుల్లోకి వెళ్లి కోబ్రా, కట్లపాము, రస్సెల్ వైపర్ వంటి విషపూరిత పాములను పట్టడంలో వారు నేర్పరులు. ఒకప్పుడు ఇరుల తెగ పాము చర్మాల కోసం పాములను వేటాడేది. కానీ 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టం వచ్చిన తర్వాత.. వారి జీవనోపాధి కష్టమైంది. ఆకలితో అలమటించే రోజులను ఎదుర్కొంది. ఆ సమయంలో హెర్పటాలజిస్ట్ రోములస్ విటేకర్ అనే వ్యక్తి ఇరుల తెగ నైపుణ్యాన్ని గుర్తించి.. 1978లో ఇరుల స్నేక్ క్యాచర్స్ ఇండస్ట్రియల్ కో ఆపరేటివ్ సొసైటీ (ISCICS)ని స్థాపించారు. ఈ సొసైటీ ద్వారా ఇరుల తెగ వారు పాము విషాన్ని సేకరించి, దానిని యాంటీ-వీనమ్ తయారీకి ఉపయోగించేలా చేశారు.
పాముతో 21 రోజులు..
ఈ సొసైటీలో చేరిన ఈ తెగ ప్రజలు కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాల నుంచి పాములను పట్టడం మొదలుపెట్టారు. అలా పట్టిన పాములను మట్టి కుండల్లో ఉంచి ఆరోగ్య పరీక్షలు చేసిన తర్వాత ఒక్కో పాము నుంచి మూడు నుంచి నాలుగు సార్లు విషాన్ని సేకరించేవారు. 21 రోజుల తర్వాత ఆ పాములను తిరిగి అడవిలో వదిలేసేవారు. ఈ విషం భారతదేశంలో యాంటీ-వీనమ్ తయారీకి 80% వరకు ఉపయోగపడుతుంది. ఈ పని ద్వారా స్థిరమైన ఆదాయం లభించడం మొదలైంది. సొసైటీ ద్వారా వారు సంవత్సరానికి 5,000 పాములను పట్టే అనుమతి పొందారు. గత మూడు సంవత్సరాల్లో సొసైటీ 1800 గ్రాముల విషాన్ని సేకరించి.. రూ. 2.36 కోట్ల లాభం ఆర్జించింది.