అడవిలో గంట నడిస్తే.. మెదడులో జరిగే అద్భుతం?
గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాలు కొత్త రకమైన ఆవాసాలను సూచిస్తాయి. విలాసవంతమైన వసతులను అందిస్తాయి.
దిశ, ఫీచర్స్ : గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాలు కొత్త రకమైన ఆవాసాలను సూచిస్తాయి. విలాసవంతమైన వసతులను అందిస్తాయి. కానీ ఇవి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని.. పట్టణ పరిసరాలతో ఆందోళన, డిప్రెషన్ సహా ఇతరత్రా మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదంతో అనుసంధానించబడ్డాయని తాజా పరిశోధన వెల్లడించింది. అంతేకాదు ప్రకృతిలో కొద్దిసమయం గడపడం మానసిక, శారీరక ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉంటుందని తేల్చింది. రక్తపోటు, ఆందోళన, నిరాశను తగ్గించి మానసిక స్థితి, దృష్టి, నిద్రతోపాటు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందని తెలిపింది.
అయితే అడవిలో నడవడం నిజంగా మెదడులో ఇన్ని ప్రయోజనకర మార్పులను ప్రేరేపించగలదా? లేదా? అనేది 'అమిగ్డాలా(మెదుడులో భావోద్వేగ ప్రక్రియలతో సంబంధం కలిగిన భాగం) ద్వారా తెలుసుకోవచ్చు. ఒత్తిడి సమయంలో నగరవాసులతో పోలిస్తే గ్రామీణుల్లో అమిగ్డాలా తక్కువగా యాక్టివేట్ చేయబడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే గ్రామీణ జీవనం వల్లే ఈ ప్రభావం ఉంటుందని కాదు కానీ సహజంగా ఈ లక్షణాన్ని కలిగిన వ్యక్తులు పట్టణంలో నివసించే అవకాశం ఉంది. కాగా ఇదే అంశంపై మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్‌మెంట్ రీసెర్చర్స్.. ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్(fMRI) సాయంతో కొత్త అధ్యయనం చేపట్టారు.
63 మంది ఆరోగ్యవంతమైన అడల్ట్ వలంటీర్స్‌పైన 'వర్కింగ్ మెమొరీ టాస్క్' నిర్వహించిన పరిశోధకులు.. తాము అడిగిన ప్రశ్నలకు పార్టిసిపెంట్స్ ఆన్సర్ చేసేటపుడు fMRI స్కాన్ చేశారు. ఇది MRI, నడకకు సంబంధించిన ప్రయోగమని పాల్గొన్నవారికి చెప్పారే గానీ పరిశోధన లక్ష్యం గురించి వారికి తెలియదు. ఈ మేరకు వారిని పట్టణ వాతావరణంలో లేదా సహజమైన ఫారెస్ట్ ఏరియాలో ఒక గంట నడిపించారు. ఈ సందర్భంగా మొబైల్స్ ఫోన్స్ ఉపయోగించనివ్వలేదు. ఆ తర్వాత MRI స్కాన్స్‌లో.. అడవుల్లో నడిచిన తర్వాత అమిగ్డాలాలో యాక్టివిటీ తగ్గినట్లు పరిశోధకులు కనుగొన్నారు. కాగా ఒత్తిడితో కూడిన మెదడు ప్రాంతాల్లో ప్రకృతి ప్రయోజనకరమైన ప్రభావాలను ప్రేరేపిస్తుందనే ఆలోచనకు ఇది మద్దతు ఇస్తుంది. అంతేకాదు కేవలం 60 నిమిషాల్లోనే ఇది స్పష్టంగా జరగవచ్చు.
ఇవి కూడా చదవండి: