వరకట్నం పుట్టింది అప్పటి నుంచే... ఈ దురాచారాలకు చావు లేదా..?

ఆడపిల్ల ఎప్పటికీ ఆడపిల్లే ఈడ పిల్ల కాదు. పెండ్లి వయస్సు రాగానే ఓ ఆడపిల్ల తన జీవిత భాగస్వామి గురించి ఎన్నో కలలు కంటుంది.

Update: 2022-09-26 10:46 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఆడపిల్ల ఎప్పటికీ ఆడపిల్లే ఈడ పిల్ల కాదు. పెండ్లి వయస్సు రాగానే ఓ ఆడపిల్ల తన జీవిత భాగస్వామి గురించి ఎన్నో కలలు కంటుంది. 20 సంవత్సరాలు పుట్టింట్లో ఉంటే కట్టెకాలేంత వరకు గడిపేది మెట్టింట్లోనే. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగు పెట్టిన ఆడ పిల్లల కాళ్లకు పెట్టిన పారాని కూడా ఆరకముందే వరకట్న వేధింపులకు బలైపోతున్నారు.

ఇప్పుడున్న కాలంలో మనిషి తన తెలివితో ఎంతో టెక్నాలజీని పెంచుతూ దినదినాభివృద్ది చెందుతూ ముందుకు సాగిపోతున్నాడు. కానీ మానవీయ విలువలను మాత్రం మంటగలుపుతున్నారు. ఓ ఆడపిల్లని పెళ్లి పేరుతో మూడు ముళ్లు వేసి తనలో సగ భాగంగా చేసుకునే మగాడు, కట్నకానుకల కోసం తాళి కట్టిన ఆలిని చిత్రహింసలకు గురిచేసి ప్రాణాలు తీస్తున్నాడు.

పూర్వం మన దేశంలో వరదక్షిణ, కన్యాశుల్కం లాంటివి ఉండేవి. పూర్వం భర్త చనిపోతే భార్య సతీసహగమనం చేసేది. కానీ భార్యలు చనిపోయిన భర్తలు, వయసుడిగిన ముసలి వారు మాత్రం తమ అవసరాలు తీర్చుకోవడానికి కన్యాశుల్కం పేరుతో ఆడపిల్ల తల్లిదండ్రులకు ధనాశ చూపి పసిపిల్లలను పెళ్లి చేసుకునేవారు. కానీ కాలక్రమేనా కన్యాశుల్కం పోయి వరదక్షిణ తెరపైకి వచ్చింది.

ధనవంతులైన తల్లిదండ్రులు పెళ్లి సమయంలో తమ కూతురికి స్త్రీ ధనంగా భూమి, నగలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడది వరకట్న పిశాచిగా మారిపోయింది. కట్నం ఇవ్వకపోతే ఆడ పిల్లలకు పెండ్లి కావడమే కష్టంగా మారింది. ఆడపిల్లలకు తల్లిదండ్రులు కట్నం ఇవ్వకుండా పెళ్లిళ్లు చేయలేకపోతున్నారు. కొంత మంది స్టేటస్ కోసం కట్నాలు ఇస్తే మరికొంత మంది మాత్రం తమ ఆడపిల్ల సంతోషంగా ఉండాలని కట్నాలను ఇస్తున్నారు.

అందుకోసం లక్షలు, కోట్లలో అప్పులు చేయక తప్పడం లేదు. నూటికి నూరుశాతం కట్నం తీసుకోకుండా జరిగినటువంటి పెళ్లిళ్లు ఇప్పటికీ అత్యంత అరుదుగానే కనిపిస్తాయి. దీంతో ఈ కట్నాలే ప్రాణాలు తీస్తున్నాయి. ధనం మీద ఆశతో భర్త భార్యను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అదనపు కట్నం కోసం తెల్లవార్లు హింసలకు గురిచేస్తున్నారు.

ఆ బాధ భరించలేని ఆడపిల్లు అటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక, ఇటు బయటపడలేక బలైపోలున్నారు. కష్టాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నవారైతేనేమి, అత్తింటివారే నిర్ధాక్షిణ్యంగా ప్రాణాలు తీస్తుండమైతేనేమి. దేశంలో వరకట్న వేధింపుల సంఘటనలు గడియకొకటి వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుత సమాజంలో ఇలాంటివి చూస్తుంటే నాటి సతీసహగమనం కన్నా నేటి వరకట్న వేధింపులే దారుణమనిపిస్తోంది.

దేశంలో వరకట్న సంబంధిత నేరాల కట్టడికి చట్టాలను ఎన్ని తీసుకొచ్చినా, ఆ దురాచారాలకు వ్యతిరేకంగా ఎన్నో ప్రచారాలు జరుగుతున్నా అబలల ఆక్రందనలు మాత్రం ఆగడం లేదు. వరకట్నదాహానికి ఎందరో అతివలు బలైపోవడమే దానికి నిదర్శనం.

జాతీయ నేర గణాంకాల సంస్థ ఎన్.సి.ఆర్.బీ.టీ ఈ సంఘటనలపై సర్వే చేసి నివేదికలో ఓ చేదు నిజాన్ని చెప్పింది. గంటకో ప్రాణం చొప్పున దేశ వ్యాప్తంగా ఏటా కనీసం వేల మంది అబలలు వరకట్న పిశాచానికి బలైపోతున్నారని చెప్పింది. ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన మాజీ ప్రపంచ సుందరి యుక్తాముఖి నుంచి మధ్యప్రదేశ్ మురేనాలో ఫస్ట్ క్లాస్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ను కూడా ఈ వరకట్నవేధింపులు వదలలేదు.

ఎప్పటికప్పుడు కొత్తరూపు సంతరించుకుంటూ ఎంతో మందిని బలితీసుకుంటున్నాయి. ఇలా వరకట్న దాహానికి బలవుతున్న వారి కోసం 1961లో న్వాయవ్యవస్థలో వరకట్న నిషేధ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. అమల్లోకి తేవడంతోనే ప్రభుత్వం బరువు, బాధ్యత తీర్చేసుకుంది. అమ్మాయిలకు కట్నకానుకలు ఇస్తున్నారు. అదే ఇంట్లో అబ్బాయిలకు కట్నకానుకలు తీసుకుంటున్నారు. అత్తవారింట్లో తమ అమ్మాయి ఎదురుకొన్న సమస్యలు వీరింట్లో కూడా ఎదురవుతున్నాయి. అంటే తప్పు ఒక్కరిదో, ఇద్దరిదో కాదు సమాజం మొత్తానిది.

అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న యువత ఎందుకు వరకట్నం విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేక పోతుంది. హోదా, ప్రతిష్ట, డామినేషన్ ఇవన్నీ వదిలేసి యువత ఇప్పటికైనా మేల్కొంటే వరకట్న దురాచారాన్ని పూర్తిగా అరికట్టొచ్చు. ఏనాడైతే ప్రతీ అత్త తన కోడలిని కూతురిలా చూసుకుంటుందో, ఆనాడే ఈ దురాచాలకు స్వస్తి చెప్పొచ్చు. మన ఇంటి ఆడపిల్ల సంతోషంగా ఉండాలని ఎలాగైతే అనుకుంటామో, మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని కూడా అంతే సంతోషంగా ఉంచాలి అప్పుడే ఈ దురాచారం అంతమవుతుంది.

ఇవి కూడా చ‌ద‌వండి: 

'బ్రా'లెస్ గౌనులో పిచ్చెక్కించిన సెక్సీ బ్యూటీ.. 'పాజిటివ్ వైబ్స్ ఓన్లీ' అంటూ.

Tags:    

Similar News