స్నేహితుల ముందు మీ భర్తను ఎగతాళి చేసి మాట్లాడుతున్నారా? ఏమౌతుందో తెలుసా?
భార్యాభర్తల మధ్య అందమైన బంధం ఉండాలంటే.. దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే.. కొన్ని ముఖ్యమైన సూత్రాలు పాటించాలి.
దిశ, ఫీచర్స్: భార్యాభర్తల మధ్య అందమైన బంధం ఉండాలంటే.. దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే.. కొన్ని ముఖ్యమైన సూత్రాలు పాటించాలి. అప్పుడే వారి జీవితం ప్రేమానురాగాలతో నిండిపోతుంది. దంపతుల మధ్య కొట్లాటలు, గొడవలు, అలకలు, ప్రేమ, బుజ్జగింపులు చాలా సహజం. వైవాహిక జీవితంలో ఇవన్నీ భాగమే. కానీ నలుగురిలో మాత్రం ఒకరిపై మరొకరు ఎగతాళి చేసుకోవడం మానుకోవాలి. దీని వల్ల మీ బంధానికి చాలా నష్టం వాటిల్లుతుంది. మరి ఎలా ఉండాలి అంటే..
భర్త అలవాట్లు నలుగురిలో పెట్టడం :
* భార్యాభర్తల మధ్య అనుబంధం బలంగా ఉండాలంటే ఒకరిపై ఒకరు గౌరవాన్ని కలిగి ఉండాలి. ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గౌరవించాలి. తమ ఇష్టాలు, అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉండాలి.
* కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల వద్ద భర్తను కించపరిచేలా భార్య, భార్యను కించపరిచేలా భర్త ప్రవర్తించకూడదు. భార్యాభర్తలు ఇరువురు తమ భాగస్వామి వ్యక్తిత్వాన్ని అగౌరవపరిచేలా ప్రవర్తించకూడదు. దంపతులు ఇద్దరి మధ్య సంపూర్ణ గౌరవం ఉంటే వారి మధ్య బంధం మరింత బలంగా ఉంటుంది.
* ముఖ్యంగా ఆడవాళ్లు మీ భర్తకు ఎన్నో అలవాట్లు ఉండొచ్చు. కానీ వాటిని వారి స్నేహితుల ముందు చెప్పడం, అలాగే వాటిని ఎత్తి చూపిస్తూ తిట్టడం మంచిది కాదు. ఎందుకంటే తన ఫ్రెండ్స్ తర్వాత ఆ విషయాల్లోనే మీ భర్తను హేళన చేయవచ్చు. దీనివల్ల వారు గొడవ పడే అవకాశం కూడా ఉంది. అందుకే తన స్నేహితుల ముందు మీ భర్తకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడకపోవడం మంచిది.
బెదిరించడం మానుకోండి :
* మీ భర్త వాళ్ల ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు పదే పదే బెదిరించకండి. ఇది కూడా ఒక రకమైన చెడు ప్రవర్తనే. ఇది మీ ఇద్దరిని స్నేహితుల మందు తక్కువ చేస్తుంది. అందుకే ఏదైనా సమస్య ఉంటే మీ భర్తను పక్కకు పిలిచి చెప్పండి. అంతేకానీ నలుగురిలో వారిని బెదిరించకండి.
* అలాగే భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించడానికి ట్రై చేయకూడదు. సమయానుసారం.. ఆ సందర్భంలో ఏమనిపిస్తే అదే చేయాలి. ఒకరినొకరు అర్థం చేసుకుని గౌరవించుకోవాలి. పరిమితులు అందరికీ తెలుసు కానీ ఆంక్షలు పెట్టవద్దు. తను చెప్పిందే వినాలని కండిషన్స్ అస్సలు వద్దు. అది ఇద్దరికీ మంచిది కాదు.
* అలాగే కొంతమంది భర్తలు వారి స్నేహితుల ముందు.. తమ భార్య గృహిణి అని, ఆమె చేసే పని గురించి తక్కువ చేసి మాట్లాడకూడదు. వాళ్లు ఏం చేసినా భాగస్వామి కోసమే అనేది గుర్తుంచుకోవాలి. మీ పనిని ఎలా గౌరవిస్తారో వాళ్ల పనిని కూడా గౌరవించాలి. లేదంటే ఇలాంటి తప్పులే విడాకుల వరకు తీసుకెళ్లొచ్చు.
డబ్బు పొదుపు చేయడం (పిసినారి) :
* బంధువులు, స్నేహితుల ముందు మీ భర్తను పిసినారి అనకండి. ఎందుకంటే మీ భర్త ఖర్చు చేయనంత మాత్రాన నాలుగురిలో అలా అనడం సరికాదు. అతను అవమానంగా ఫీల్ కావచ్చు.
* అలాగే కుటుంబంలో ఎవరు సంపాదించినా అది కుటుంబ సంపాదనగానే చూడాలి. భర్త, భార్య, పిల్లల సంపాదన అని వేరువేరుగా లెక్కించకూడదు. మద్యం, విహారయాత్రలు వెళ్లడానికి మగవాళ్లు పెట్టినంత ఖర్చు ఆడవాళ్లు చేయరు.
* ఆడవాళ్లు పొదుపుకు ప్రాధాన్యత ఇస్తారు కనుక అలా మాట్లాడతారు. కానీ స్నేహితుల ముందు కాకుండా ఎవరు లేని సమయం చూసుకుని మీ భర్తని మందలించడం మంచిది. ఆర్థిక విషయాల్లో కూడా ఒకరికి ఒకరు బాసటగా ఉంటే ఇంకా మంచిది.
కోపగించుకోకండి :
* ఒకరికి ఒకరు అన్నట్టుగా ఉండటం, ఒకరి కష్టాన్ని ఇంకొకరు అర్థం చేసుకోవడం, ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం భార్యాభర్తల మధ్య ప్రేమ బలపడడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
* కానీ మీకు ఇప్పటికే ఏ విషయంలోనైనా మీ భర్తపై కోపం ఉంటే.. స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు వారి ముందు మీ భర్తపై కోపాన్ని చూపించకండి. ఇలాంటి సమయంలోనే కోపం ఎక్కువగా వస్తుంటుంది. చాలా మంది జంటలు ఇలా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడే కోప్పడుతుంటారు. ఒకరి గురించి ఒకరు చాడీలు చెప్పుకుంటారు. తప్పొప్పులను ఎత్తిచూపుతుంటారు. కానీ ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. ఇది ఇతరుల ముందు మీ గౌరవాన్ని తగ్గిస్తుంది. కనుక ఏదైనా ఉంటే నలుగురిలో కాకుండా.. నాలుగు గోడల మధ్య ఉంటే ఎలాంటి బంధమైనా పచ్చగా ఉంటుంది.