ఏడిస్తే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. అవేంటో తెలుసా
ఎవరైనా ఏడ్చినప్పుడు ప్రజలు వెంటనే ఆ వ్యక్తి ఏడుపు ఆపేయడానికి ప్రయత్నాలు చేస్తారు.
దిశ, ఫీచర్స్ : ఎవరైనా ఏడ్చినప్పుడు ప్రజలు వెంటనే ఆ వ్యక్తి ఏడుపు ఆపేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఏడుస్తుంటే మనుషుల గుండె తరుక్కుపోతుంది. అయితే పెద్దయ్యాక ఏడిస్తే బలహీనులని, ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలని చెబుతుంటారు. ముఖ్యంగా బాలికలు ఏడిస్తే వారిని బలహీనులుగా పరిగణిస్తారు. ఎందుకంటే వారు ఏదైనా సమస్య వస్తే వెంటనే భావోద్వేగానికి గురవుతారు. అయితే ఏడుపు ఆరోగ్యానికి మంచిదని, కన్నీళ్లు పెట్టుకోకపోతే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏడుపు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలా అధ్యయనాల్లో తేలిందని తెలిపారు. బహిరంగంగా కన్నీళ్లు పెట్టడం ద్వారా మానసికంగా ధృఢంగా ఉంటారని వైద్యనిపుణులు చెబుతున్నారు. మరి ఏడుపు ఏ విధంగా ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మెంటల్లీ ఫిట్..
మనుషులు ఏడ్చినప్పుడు వారి భావోద్వేగాలు అదుపులో ఉంటాయని, మానసిక ప్రశాంతత కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మాత్రమే కాదు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏడ్చినట్లయితే అది మీ మనస్సును రిలాక్స్ చేస్తుందని చెబుతున్నారు. ఏడుపు పారా సింథటిక్ నాడీ వ్యవస్థను సక్రియం చేస్తుందట. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మానసిక స్థితి కలత చెందినప్పుడు లేదా విచారంగా ఉన్నప్పుడు, మనం కొంత సమయం పాటు ఏడవాలి. ఇలా ఏడవడం ద్వారా బాధ కాస్తంత పోయి మనస్సు ప్రశాంతంగా ఉండే అనుభూతిని కలిగిస్తుంది.
2. మానసిక బాధ నుంచి ఉపశమనం..
ఏడ్చినప్పుడు శరీరంలో ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. దీని వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మానసిక బాధ నుంచి ఉపశమనం పొందుతారు. ఎప్పుడైనా గాయాలైనప్పుడు మెదడు వెంటనే ఈ హార్మోన్లను విడుదల చేస్తుంది. తద్వారా నొప్పి నుండి త్వరగా ఉపశమనం పొందుతారు.
3. బాక్టీరియా నిర్మూలన
కన్నీళ్లు కారడం వల్ల కళ్లు సహజంగా శుభ్రమవుతాయి. కళ్లలో పడిన దుమ్ముతో పెరిగే బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది. వాస్తవానికి, కన్నీళ్లలో లైసోజైమ్ అనే ద్రవం ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీమైక్రోబయల్ లక్షణాలతో నిండి ఉంది. ఇది కళ్ళను బ్యాక్టీరియా నుంచి రక్షించగలదు.