Curiosity : వింతగొలిపే అరుదైన పరిశోధనలు.. శాస్త్రవేత్తలు ఏం చేశారంటే..

Curiosity : వింతగొలిపే అరుదైన పరిశోధనలు.. శాస్త్రవేత్తలు ఏం చేశారంటే..

Update: 2024-12-19 12:57 GMT

దిశ, ఫీచర్స్ : కొత్త మెడికేషన్స్ కనుగొనడం మొదలుకొని పర్యావరణ మార్పులకు కారణాల వరకుశాస్త్రవేత్తలు నిరంతర పరిశోధనలు నిర్వహిస్తున్నారు. చాలా వాటిలో సక్సెస్ అయ్యారు. ఇంకా అంతుపట్టని రహస్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం చేసిన కొన్ని పరిశోధనలు తమకే ఆశ్చర్యాన్ని కలిగించాయని ఆయా సందర్భాల్లో పరిశోధకులు ప్రకటించారు. అవేమిటో చూద్దాం.

వేగంగా తిరిగే అంతరిక్ష వస్తువు

ఇప్పటి వరకు మనకు తెలిసిన నక్షత్రాలన్నీ పాలపుంత అంటే గెలాక్సీ చుట్టూ తిరుగుతుంటాయనే విషయం తెలిసిందే. అయితే గంటకు 10 లక్షల మైళ్ల వేగంతో అవి తిరిగితే? ఆశ్చర్యం కదూ! కానీ అలాంటి ఓ విచిత్ర అంతరిక్ష వస్తువును అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సిటిజన్ సైంటిస్టు ఒకరు గుర్తించారు. దీనికి సీడబ్ల్యుఐఎస్ఈ జే1249 అని పేరు పెట్టారు. ఇంత స్పీడ్‌గా తిరిగితే అది పాలపుంత పరిధిని దాటి దూసుకుపోగలరు. తక్కువ ద్రవ్యరాశిగల ఇది దేని కోవలోకి వస్తుందో పరిశోధకులకు సైతం అంతుపట్టలేదు. అల్ప ద్రవ్యరాశి నక్షత్రంగానో, మరగుజ్జు నక్షత్రంగానో భావించవచ్చునని అనుకుంటున్నారు. నిజానికి ఒక పెద్ద నక్షత్ర విస్ఫోటనంతో ఒక తార నుంచి పెద్ద ఎత్తున పదార్థం వెలువడటం కారణంగా ఈ సీడబ్ల్యుఐఎస్ఈజే 1249 వేగానికి కారణం కావచ్చు అనుకుంటున్నారు పరిశోధకులు.

రోబోలకూ మానవుల్లాంటి చర్మం

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తెచ్చిన అత్యద్భుత మార్పుల్లో రోబోట్ ఒకటి. అయితే రోబోలు మానవుల్లాంటి చర్మాన్ని కలిగి ఉంటే ఎలా ఉంటుంది? జపాన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టోక్యో పరిశోధకులకు ఈ సందేహమే తలెత్తింది. ఇంకేంటి రంగంలోకి దిగారు. రోబోకోసం మానవ కణాలతో సజీవ చర్మాన్ని రూపొందించారు. దీనిని రోబో ఫేస్‌కు అతికించి, సహజ కవళికలకు ప్రాణం పోశారు. అంటే ఇది కలిగి ఉన్న రోబో నవ్వితే సేమ్ టు సేమ్ మనిషి నవ్వినట్లే అనిపిస్తుంది. ఏడిస్తే అలాగే అనిపిస్తుంది. కాకపోతే ప్రస్తుతం ఇది వింతగా అనిపిస్తోంది. స్మూత్‌గా ఉండటమే కాకుండా రోబోకు ఉండే సజీవ చర్మం ఎక్కడైనా తెగితే మరమ్మతు చేసుకోగలదు. భవిష్యత్తులో కదిలే హ్యూమనాయిడ్ రోబోలకు ఎప్పటికీ చిరగని, అలాగే తమకు తామే నయమయ్యే చర్మానని తయారు చేయడానికి ఇది సహాయపడుతుందని పరిశోధకులు అంటున్నారు. అయితే దీనికి రక్తాన్ని పంప్ చేయడంపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయ్.

నీటి గుర్రం ఎగరవచ్చు !

గుర్రం ఎగరకపోవచ్చు.. కానీ నీటి గుర్రం కొంత వరకైనా ఎగిరే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. కొద్దిసేపే అయినప్పటికీ హిప్పోపాటమస్‌లు గాల్లో ఎగురుతాయని రాయల్ వెటర్నరీ కాలేజ్ స్టడీలో వెల్లడైంది. ఏకంగా 3, 6000 కిలోల బరువుండే ఇవి గాలిలో ఎలా ఎగురుతాయంటే నమ్మశక్యం కాదు. అయితే ఇంత బరువున్నప్పటికీ ఇతర జంతువులతో పోలిస్తే నీటి గుర్రాలు ఎక్కువసేపు ఎగరగలవని ముందుకు దూకే సమయంలో 0.3 సెకండ్లపాటు గాల్లో తేలి ఉంటాయని నిపుణులు గుర్తించారు. అయితే జంతువులు నేలమీద కదలడంలో వాటి సైజు ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి ఈ పరిశోధన చేశారు. 

Tags:    

Similar News