డెంగ్యూ.. అపోహలు..!

వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమలు వీరవిహారం చేస్తుంటాయి.

Update: 2023-07-25 14:44 GMT

దిశ, ఫీచర్స్ : వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమలు వీరవిహారం చేస్తుంటాయి. ప్రాణాంతకమైన డెంగ్యూ వ్యాప్తిని పెంచేస్తాయి. ఇప్పటికే తెలంగాణలో పలు కేసులు నమోదు కాగా.. వెక్టర్ ద్వారా సంక్రిమించే వ్యాధి గురించి సమాజంలో అపోహలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. ఈ మూఢనమ్మకాలను మానేసి సరైన సమాచారాన్ని తెలుసుకోవాలని.. అప్పుడే సరైన చికిత్స సాధ్యమవుతుందని చెప్తున్నారు. ఇంతకీ డెంగ్యూ అంటే ఏమిటి? ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి? అనే అంశాల గురించి కూడా తెలుసుకుందాం.

డెంగ్యూ అంటే ఏమిటి?

వర్షం కురిస్తే చాలా దోమలు బయటకు వచ్చి ఆడుకుంటాయి. ఇప్పుడే మిమ్మల్ని లేదా మీ కుటుంబాన్ని కుట్టగలిగే, డెంగ్యూ జ్వరాన్ని కలిగించే ఏడిస్ మస్కిటోస్ కూడా టైం కోసం వేచిచూస్తుంటాయి. నిలకడగా ఉన్న నీటిలో సంతానోత్పత్తి చేసే ఇవి.. కుట్టాయంటే అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం, తలనొప్పి, బాడీ పెయిన్స్, కళ్ల వెనుక నొప్పి, కడుపు నొప్పి, చిగుళ్ళు లేదా ముక్కు నుంచి రక్తస్రావం, వాంతులు, నీరసం, గందరగోళం వంటి డెంగ్యూ లక్షణాలతో సతమతం అవుతారు. అందుకే పరిసరాలను శుభ్రం చేసుకోవడం ద్వారా దోమల పెరుగుదల ఉండదని, దీంతో వ్యాధి సంక్రమణకు అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్తున్నారు నిపుణులు.

డెంగ్యూ చుట్టు అపోహలు

1. ఏడిస్ దోమలు కుట్టడం వల్ల ఒకరి నుంచి మరొకరికి డెంగ్యూ వ్యాపిస్తుందనేది అసత్యం.

2. ఏడిస్ దోమలు మాత్రమే డెంగ్యూను వ్యాపిస్తాయి అనేది కూడా అవాస్తవం. ఇవి ప్రధాన కారకాలుగా ఉన్నప్పటికీ.. ఏడిస్ ఆల్బోపిక్టస్ వంటి ఇతర జాతులు కూడా డెంగ్యూ వైరస్‌ను వ్యాప్తి చేయగలవు.

3. డెంగ్యూ వచ్చిన ప్రతిసారీ ప్లేట్‌లెట్ మార్పిడి అవసరమనేది ఒక అపోహ. వాస్తవానికి సాధారణ ప్లేట్‌లెట్ గణనలు 150000 నుంచి 410000 వరకు ఉంటాయి. కానీ డెంగ్యూ కారణంగా నాలుగు లేదా ఐదవ రోజుకు 50000 నుంచి 150000 స్థాయికి పడిపోవచ్చు. ప్లేట్‌లెట్ స్థాయి 10000 కంటే తక్కువగా ఉంటే లేదా రక్తస్రావం జరిగినట్లు ఏదైనా రుజువు ఉంటే మాత్రమే ప్లేట్‌లెట్ మార్పిడి చేయబడుతుంది.

4. ప్లేట్‌లెట్ మార్పిడి ద్వారా మాత్రమే ప్లేట్‌లెట్లలో పెరుగుదుల ఉంటుందనేది కూడా ఒక అపోహ. వీటిని సహజంగా కూడా పెంచుకోవచ్చు.

• ALOX-12 అనే ఎంజైమ్‌ని కలిగి ఉండే బొప్పాయి ఆకు సారం నేచురల్‌గా ప్లేట్‌లెట్ ఏర్పడటాన్ని ప్రేరేపిస్తుంది.

• ORS, కొబ్బరి నీరు, దానిమ్మ రసంతో డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి.

• ఫోలేట్‌లు అధికంగా ఉండే ఆహారం అవసరం. కాబట్టి నారింజ, కివీస్, క్రాన్‌బెర్రీ, బొప్పాయి, టమోటా, డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవాలి.

• తృణధాన్యాలు, ఆస్పరాగస్ వంటి ఆహారాలు కూడా సహాయపడతాయి.

5. అనారోగ్యం సమయంలో పరిమితి లేకుండా తినవచ్చనేది కరెక్ట్ కాదు. మీకు లేదా మీ కుటుంబసభ్యులకు డెంగ్యూ ఉన్నట్లయితే.. నిర్దిష్ట ఆహారాన్ని తీసుకోవడం, కొన్ని ఫుడ్స్‌కు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఉదాహరణకు పేషెంట్స్ ఆయిల్ ఫుడ్ తీసుకోకూడదు. వేయించిన లేదా జిడ్డుగల ఆహారాలలో చాలా కొవ్వు ఉంటుంది. ఇది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది.

డెంగ్యూ నివారణ చిట్కాలు

• ఇంటి చుట్టుపక్కల నీరు నిలచిపోతే శుభ్రపరచండి.

• క్రిమిసంహారక మందు ఉపయోగించడం ద్వారా దోమల నివాసాలను ధ్వంసం చేయొచ్చు.

• కాళ్లు, చేతులు కప్పి ఉంచే దుస్తులను ధరించండి.

• దోమతెర, రిపెల్లెంట్లను ఉపయోగించండి.

• విటమిన్ సి, ఫోలేట్ సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తినండి.

Tags:    

Similar News