Coffee vs Green Tea : కాపీ, గ్రీన్ టీ.. ఈ రెండెంటిలో ఆరోగ్యానికి ఏది బెటర్?.. నిపుణులు ఏం చెప్తున్నారంటే..

ప్రస్తుతం టీ, కాఫీ తాగే అలవాటు అత్యధిక మందికి ఉంటోంది. కాగా ఈ రెండు పానీయాల్లో ఆరోగ్యానికి ఏది మంచిది?

Update: 2024-08-16 06:19 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం టీ, కాఫీ తాగే అలవాటు అత్యధిక మందికి ఉంటోంది. ఉదయం లేచింది మొదలు సాయంత్రం దాకా కనీసం ఒకటి.. రెండుసార్లు ఈ పానీయాల్లో ఏదో ఒకటి తాగేవారు చాలా మందే ఉంటారు. తాగిన వెంటనే యాక్టివ్‌గా అనిపించడంవల్ల వర్కులో ఎక్కువ ఫోకస్ చేసేందుకు ఈ అలవాటు ఉపయోగపడుతుందని కూడా చెప్తుంటారు. అలాగే కాఫీ బాడీలో తక్షణ ఎనర్జీ లెవల్‌ను ప్రేరేపిస్తుందని, మెదడు పనితీరును మెరుగు పర్చడంలో సహాయపడుతుందని, గ్రీన్ టీ కూడా అలాంటి ప్రయోజనాలే కలిగి ఉంటుందని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. అయితే కాఫీ, గ్రీన్ టీ ఈ రెండింటిలో హెల్త్ పరంగా ఏది బెస్ట్, గుండెకు ఏది మేలు చేస్తుంది అనే అంశంపై ఓ తాజా అధ్యయనం ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆ వివరాలేంటో చూద్దాం.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా గుండె జబ్బుల బాధితులు పెరుగుతున్నారు. ఒక్క ఇండియాలోనే సుమారు 220 మిలియన్లమంది అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. వీరంతా గుండె జబ్బుల రిస్క్ కలిగి ఉన్నట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఆయా వ్యక్తుల జీవన శైలి, ఆహారపు అలవాట్లు కూడా ఈ సమస్యలను నివారించడంలో, పెంచడంలో దోహదపడుతన్న నేపథ్యంలో ఏ ఆహారాలు, పానీయాలు ఎలాంటి ప్రభావం చూపుతాయన్న అంశాలను తెలుసుకునేందుకు పరిశోధకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే జపాన్ కొలాబరేటివ్ కోహోర్ట్ స్టడీ ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ క్యాన్సర్ రిస్క్ (జేఏసీసీ)కి చెందిన నిపుణులు కాఫీ, గ్రీన్ టీ ఈ రెండు తాగేవారిలో మొత్తం ఆరోగ్యాన్ని, గుండె ఆరోగ్యాన్ని ఏది ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకునేందుకు ఓ అధ్యయనం నిర్వహించారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్లోనూ ఇది పబ్లిషైంది.

స్టడీలో భాగంగా పరిశోధకులు 18 వేలమంది కాఫీ, అలాగే గ్రీన్ టీ తాగే అలవాటు గలవారిని అబ్జర్వ్ చేశారు. అవి వారి గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేశాయో పరిశీలించారు. అయితే ఈ సందర్భంగా వారు రెండు కాఫీలో సుమారు 95 నుంచి 200 మి. గ్రా. కెఫిన్ ఉంటుందని, గ్రీన్ టీ లో 35 మి. గ్రా కెఫిన్ ఉంటుందని గుర్తించారు. కాగా గ్రీన్ టీ కంటే కాఫీలో సుమారు మూడు రెట్లు అధికంగా కెఫిన్ ఉంటున్నట్లు నిర్ధారించిన పరిశోధకులు అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు కాఫీని ఎక్కువగా తాగడం గుండె ఆరోగ్యంపై హానికర ప్రభావం చూపుతుందని, తక్కువగా తాగితే అలాంటి సమస్య ఉండదని వెల్లడించారు. అలాగే కాఫీతో పోలిస్తే గ్రీన్ టీ గుండె ఆరోగ్యానికి మంచిదని, ఇందులో పాలీఫెనాల్ అనే కంటెంట్ హానికరమైన కెఫిన్ ప్రభావాలను కూడా తొలగిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా అధిక బరువు, డయాబెటిస్ అదుపులో ఉండేందుకు గ్రీన్ టీ సహాయపడుతుందని పరిశోధకులు చెప్పారు. అయితే కాఫీ, గ్రీన్ టీ ఏవి కూడా పరిమితికి మించి తాగడం కూడా మంచిది కాదని కూడా పేర్కొన్నారు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ ఎలాంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.

Tags:    

Similar News