నెల ముందే గుడ్లు పెడుతున్న పక్షులు! ఇది దేనికి సంకేతం..?!
ఎన్నో దారుణాలను చవిచూస్తున్న జీవావరణం మరో షాక్‌కు గురయ్యింది. Birds are laying their eggs a month before.
దిశ, వెబ్‌డెస్క్ః అక్కడ వసంతకాల గాలి హాయిగా వీస్తోంది. ప్రకృతి పరవశించే ఈ వాతావరణంలో పక్షులు పాడుతూ తమ గూళ్లు కట్టుకోవడం ప్రారంభించాయి. ఇది ప్రకృతిలో ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియే. కానీ, జర్నల్ ఆఫ్ యానిమల్ ఎకాలజీలో ఒక కొత్త అధ్యయనం అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే, పర్యావరణ మార్పుతో ఎన్నో దారుణాలను చవిచూస్తున్న జీవావరణం మరో షాక్‌కు గురయ్యింది. పక్షుల పునరుత్పిత్తిని క్లైమేట్ ఛేంజ్ ప్రభావితం చేసింది. వందల సంవత్సరాల నుండి కొనసాగుతున్న అనేక జాతుల పక్షుల సహజమైన పునరుత్పత్తి వ్యవస్థలో మార్పులు చోటుచేసుకున్నాయి.
అంతకుముందు కంటే, దాదాపు ఒక నెల ముందుగానే గూడు కట్టుకుని గుడ్లు పెడుతున్నాయి పక్షులు. చికాగో మ్యూజియంలో సేకరించి, భద్రపరచిన శతాబ్దాల నాటి గుడ్లతో ఇటీవలి పరిశీలనలను పోల్చడం ద్వారా ఈ విషయం వెల్లడయ్యింది. చికాగోలో గూడు కట్టుకున్న పక్షి జాతులలో మూడింట ఒక వంతు సగటున 25 రోజులు తమ గుడ్లు పెట్టడాన్ని మార్చుకున్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించుకున్నారు. అలాగే, ఈ మార్పుకు కారణం వాతావరణ మార్పేనని పరిశోధకులు వెల్లడించారు. "కాలక్రమంలో పక్షుల జీవావరణ శాస్త్రం గురించి తెలుసుకోవడానికి గుడ్డు సేకరణ చాలా ముఖ్యమైన సాధనం" అని ఫీల్డ్ మ్యూజియంలో పక్షుల క్యూరేటర్, తాజా అధ్యయన ప్రధాన రచయిత జాన్ బేట్స్ పేర్కొన్నారు. "ఈ పరిశోధనా పత్రం గత, ఆధునిక డేటాలను కలిపి సుమారు 120 సంవత్సరాల మార్పులను చూడడానికి, వాతావరణ మార్పు పక్షులను ఎలా ప్రభావితం చేస్తుందనే దాని గురించి నిజంగా క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో సహాయపడుతుందని" ఆయన అన్నారు.