AI : ఏఐ వల్ల లాభమా.. నష్టమా..? 2025లో ఏం జరగనుంది?

AI : ఏఐ వల్ల లాభమా.. నష్టమా..? 2025లో ఏం జరగనుంది?

Update: 2024-12-31 07:43 GMT

దిశ, ఫీచర్స్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI).. 2024లో అత్యధికమందిలో ఆసక్తి రేకెత్తించిన అధునాతన టెక్నాలజీ ఇదే. అనేక రంగాల్లో ప్రస్తుతం దీని ప్రాధాన్యత పెరుగుతోంది. ముఖ్యంగా వైద్య రంగంలో ఏఐ టూల్స్ అందుబాటులోకి రావడంతో ఆయా సేవల్లో క్వాలిటీ అండ్ స్పీడప్ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఏఐ ఆధారిత రోబోలు, చాట్ బాట్స్ ఈతరం యువతకు అనేక అంశాల్లో నైపుణ్యాలు పెంచుకోవడానికి ఎంతో సహాయపడుతున్నాయి. కాగా ఈ సాంకేతిక పరిజ్ఞానంపై ఈ ఏడాది సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ అండ్ నెగెటివ్ చర్చలు కూడా జరిగాయి. అలాంటి కొన్ని అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

ఏఐ వల్ల నష్టాలు?

ఏఐ వల్ల నష్టాలు తప్ప లాభం లేదని పలువురు సోషల్ మీడియా వేదికల్లో వాదించగా.. మార్పును స్వాగతించాల్సిందే. భవిష్యత్తులో మనకు ఎంతో మేలు చేస్తుందని ఇంకొందరు వాదించారు. ఏదైనా సరే మంచీ చెడూ రెండూ ఉంటాయని, మనం ఉపయోగించుకునే తీరునుబట్టి ఫలితం ఉంటుందని, ఏఐ కూడా అంతేనని నిపుణులు పేర్కొన్నారు. ఇక నష్టాల విషయానికి వస్తే.. సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల డీప్‌ఫేక్ వీడియోల క్రియేషన్, తప్పుడు ప్రచారం వంటివి 2024లో ఆందోళన కలిగించాయి. మన దేశంలోనూ పలు వివాదాలకు కారణమైంది. ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో లీక్ కాగా, ఆ తర్వాత వరుసగా కత్రినా కైఫ్, సారా టెండూల్కర్‌కు కూడా చేదు అనుభవం ఎదురైంది. మహిళల ప్రైవసీకి భంగం కలిగించేలా ఈ టెక్నాలజీని కొందరు మిస్ యూజ్ చేశారు. అలాగే సైబర్ నేరగాళ్లు కూడా దీనిని యూజ్ చేసుకొని పలువురి ఖాతాలను ఖాళీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. సౌత్ కొరియాలోని ఓ ప్లాంట్‌లో మనిషిని, కూరగాయల బుట్టను వేరు చేసి గుర్తించడంలో విఫలమైన రోబో సదరు వ్యక్తి మరణానికి కారణమైంది. ఇలా ఒకటో రెండో కాదు.. ప్రపంచ వ్యాప్తంగా చాలా సంఘటనలు జరిగాయి. అంతేకాకుండా కృత్రి మేధ కారణంగా భవిష్యత్తులో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన సైతం వ్యక్తం అయ్యాయి.

ఏఐ వల్ల లాభాలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో  వల్ల లాభాల విషయానికి వస్తే.. వైద్య రంగంలో రోగ నిర్ధారణలు, డయాగ్నస్టిక్ సేవల్లో వేగం, నాణ్యత వంటివి పెరిగాయి. అనేక రంగాల్లో ఏఐ టూల్స్ ద్వారా సేవలు సులభతరం అయ్యాయి. అదే సందర్భంలో ఈ టెక్నాలజీ కారణంగా ఏదైనా నష్టం వాటిల్లే అవకాశం ఉంటే దానిని నివారించేందుకు ఆయా టెక్నాలజీ సంస్థలు, నిపుణులు, ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. కాలిఫోర్నియా ప్రభుత్వం ఏఐని సెలబ్రిటీల డీప్‌ఫేక్ వీడియోలు, మానవాళికి ముప్పు కలిగించేలా తప్పుడు కంటెంట్ క్రియేట్ చేయడం వంటి వాటికి వినియోగించకుండా గట్టి నియంత్రణ చర్యలను చేపట్టింది. ఈ నియంత్రణ చట్టం ముసాయిదాపై ఆ దేశ గవర్నర్ సంతకం కూడా చేశారు. బ్రిటిన్‌లో మొదటిసారిగా ఏఐ సేఫ్టీ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆ దేశ ప్రధాని కూడా ప్రకటించారు. ఆ మధ్య ఇండియాలో కూడా ఏఐ సమ్మిట్ జరిగింది. ఇక్కడ కూడా లాభ నష్టాలపై చర్చలు జరిగాయి.

భవిష్యత్ అంతా ఏఐదే!

కొన్ని నష్టాలు ఉన్నప్పటికీ అవి తాత్కాలికమని, వాటిని అధిగమించడం ద్వారా ఏఐ మానవాళికి మేలు చేస్తుందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. 2024లోనే ఇది సంచలనం సృష్టించింది. 2025లో మరింత విస్తృతం కానుందని, భవిష్యత్ జాబ్ మార్కెట్ అంతా దీనిపై ఆధారపడి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలంటే ఏఐ ఆధారిత స్కిల్స్ తప్పక అవసరం అవుతాయని అంటున్నారు. ఐటీ నుంచి డిఫెన్స్ వరకు, హాస్పిటాలిటీ నుంచి ఏవియేషన్ వరకు.. ఇప్పటికే ఏఐ హవా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ మరింత పెరుగుతుంది. కాగా ఏఐ టెక్నాలజీతో ఉద్యోగాలు ఊడుతాయన్న సందేహాలు, ఆందోళనలు కూడా ఉన్నప్పటికీ అలాంటిదేం జరగకపోవచ్చు.. అంటున్నారు నిపుణులు. ఎందుకంటే టెక్నాలజీని నియంత్రించేది మనుషులే కాబట్టి మానవ వనరుల స్థానాన్ని పూర్తిగా టెక్నాలజీ ఆక్రమిస్తుందన్నది కరెక్ట్ కాదు, ఏదో కొంత నష్టం ఉంటే ఉండవచ్చు తప్ప లాభాలే అధికంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఒక విధంగా చూస్తే ఏఐ బేస్డ్ స్కిల్స్ ఆధారంగానే భవిష్యత్తులో ఎంప్లాయిమెంట్ జనరేషన్ అధికంగా క్రియేట్ అయ్యే అవకాశం ఉందనే అంచనాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు.

వీటికి డిమాండ్ పెరగొచ్చు

ఏఐ వినియోగం మరింత పెరగడం ద్వారా 2025లో టెక్నాలజీ రంగం కొత్త పుంతలు తొక్కనుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 2029 నాటికి మనదేశంలో డేటా సైన్స్ వృద్ధిరేటు 3.38 బిలియన్ డాలర్లకు పెరగనుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిన్న స్టార్టప్ మొదలు కొని పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల వరకు ఏఐ వంటి టూల్స్ వినియోగం పెరగనుంది. దీంతోపాటు డేటా సైన్స్ అనలిస్టుల అవసరం పెరగడంతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో సరికొత్త మోడల్స్, టెక్నిక్స్ క్రియేట్ చేసేందుకు అలాగే ఏఐ పరిశోధక శాస్త్రవేత్తల అవసరం ఏర్పడుతుంది. కాబట్టి జాబ్ మార్కెట్లో ఏఐ స్కిల్స్ ఉన్నవారికి ఉద్యోగాలు దొరుకుతాయి.

అల్గారిథమ్‌లను అభివృద్ధి చేయడం, డెవలప్ అవుతున్న సాంకేతికతపై మరింత రీసెర్చ్ చేయడం, ప్రోటోటైప్‌లను డెవలప్ చేయడం వంటి యాక్టివిటీస్‌తో ఏఐ టెక్నాలజీని అవసరాలకు అనుగుణంగా మల్చుకోవడం వంటి సేవలు 2025లో పెరగనున్నట్లు అంచనాలు ఉన్నాయి. ఇందుకోసం ఏఐ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అలాగే ఏఐ రీసెర్చ్ సైంటిస్టులకు, పలు సెక్టార్లలో ఏఐ స్పెషలిస్టులకు డిమాండ్ పెరగనుంది. ముఖ్యంగా ఏఐ మోడల్స్ డిజైనింగ్ అండ్ టెస్టింగ్, టూల్స్‌ను, సిస్టమ్‌లను సక్రమంగా, సమర్థవంతంగా ఉపయోగించడం, ఇతరులకు ట్రైనింగ్ ఇవ్వడం వంటి నైపుణ్యాలు గలవారికి భవిష్యత్ జాబ్ మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉండవచ్చు. అలాగే మెషిన్ లెర్నింగ్ ఇంజినీరింగ్, బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్టుల వంటి ఉద్యోగాలు 2025లో క్రియేట్ కానున్నాయి. 

Tags:    

Similar News