పిల్లలు అడిగిందల్లా ఇస్తున్నారా..? పేరెంట్స్ ఇది తెలుసుకోండి..!
ఈ తరం పిల్లలు చాలా స్మార్ట్ వ్యవహరిస్తుంటారు. పిల్లలు ఎప్పుడూ కూడా ఉద్దేశపూర్వకంగా ఫలానాది కావాలని అడగరు.
దిశ, ఫీచర్స్: ఈ తరం పిల్లలు చాలా స్మార్ట్ వ్యవహరిస్తుంటారు. పిల్లలు ఎప్పుడూ కూడా ఉద్దేశపూర్వకంగా ఫలానాది కావాలని అడగరు. కంటికి నచ్చినది ఏదైనా సరే పిల్లలు కోరుకుంటారు. ఆ వస్తువును కొని ఇవ్వకపోతే అలుగుతుంటారు. అలిగారు కదా అని వాళ్లు అడిగిందల్లా క్షణాల్లో తెచ్చి ఇవ్వడం మంచి పద్ధతి కాదంటున్నారు నిపుణులు. వాటిని కొనిచ్చేముందు ఆలోంచిచాలని, లేదంటే భవిష్యత్లో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు.
పిల్లలు ఎప్పుడూ కూడా తమకు బొమ్మలు, తినుబండారాలు, దుస్తులు వంటివి కావాలని మారాం చేస్తుంటారు. స్నేహితుల వద్ద లేదా ఇతరుల వద్ద చూసిన ఆటవస్తువులు కొనివ్వాలని అడుగుతుంటారు. కాదంటే అలగడం, ఏడవడం చేస్తారు. అలా వాళ్లు అడిగిన ప్రతీదీ పేరెంట్స్ వాళ్లకి ఇవ్వడం అలవాటు చేస్తే, ఆ పద్ధతికే పిల్లలు అలవాటైపోతారని నిపుణులు చెబుతున్నారు. తాము అలిగినా, ఏడ్చినా కోరిందల్లా ఇస్తున్నారనే ఆలోచన వాళ్ల మెదడులో అలాగే ఉండిపోతుంది. ఇది భవిష్యత్తులో సమస్యగా మారుతుంది.
* అనుకున్న ప్రతీ వస్తువు చేతికి అందకపోతే పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ఏదైనా కావాలని పిల్లలు అడిగినప్పుడు అది వారికి అవసరమా.. కాదా అని ముందుగా పెద్దవాళ్లు ఆలోచించాలి. దాని వల్ల ఏదైనా ఉపయోగం ఉంటే కొవ్వడం మంచిది.
* కొందరు తల్లిదండ్రులు పిల్లలు అడిగిందల్లా తెచ్చి ఇవ్వడం చాలా గొప్పతనంగా ఫీల్ అవుతుంటారు. అలా చేయడం వల్ల వారికి ఆ వస్తువు విలువ ఎప్పటికీ తెలియదు.
* తప్పని సరి ఏదైనా వస్తువును వారు కావాలనుకుంటే.. పాకెట్ మనీ దాచుకుని దాన్ని కొనుక్కోమని చెప్పాలి. దాని కోసం వాళ్లతో ఇంట్లో చిన్న చిన్న పనులు చేయించి, వారికి అప్పుడప్పుడు కొంత మనీ ఇవ్వాలి.
* పిల్లలు అడిగిందల్లా ఇస్తూ వారిని గారాబం చేయకూడదు. దీని వల్ల వారు భవిష్యత్లో మొండిగా ప్రవర్తిస్తారు. తల్లిదండ్రుల మాటలను పెడచెవిన పెట్టేస్తారు.
* పిల్లలు ఏదైనా అడుగుతున్నప్పుడు ఆ విషయాన్ని పేరెంట్స్ పూర్తిగా వినాలి. దానికి కొంత సమయం తీసుకోవాలి. పిల్లలు అడిగినవన్నీ అత్యవసరం కాదని అనిపించినప్పుడు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేయాలి కానీ, వారిని కోపడకూడదు. తరువాత కొని ఇస్తానని మృదువుగా చెప్పాలి.
* కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల ఆర్థికపరిస్థిపై అవగాహన లేకుండా.. మొండిగా వారికి కావల్సిన వస్తువులను కొనివ్వాలని చెబుతారు. వారి వయస్సుకు మించి ఫోన్, ల్యాప్టాప్ వంటివి అడుగుతుంటారు. ఆ సమయంలో పెద్దవాళ్లు కచ్చితంగా పిల్లలకు కుదరదనే చెప్పాలి. ఆ వస్తువు అవసరమైనప్పుడు కొనిస్తానని చెప్పాలి.