Childhood Cancer : పిల్లల్లో క్యాన్సర్.. ఇలా గుర్తించండి!!
మానవ శరీరంలో క్యాన్సర్.. క్రమరహిత కణ విభజన లేదా మ్యుటేషన్‌తో ప్రారంభమవుతుంది.
దిశ, ఫీచర్స్: మానవ శరీరంలో క్యాన్సర్.. క్రమరహిత కణ విభజన లేదా మ్యుటేషన్‌తో ప్రారంభమవుతుంది. బాడీలోని దాదాపు ప్రతి ప్రాంతం ఈ క్యాన్సర్ కణాలను ఉత్పత్తి చేయగలదు. అలా చేస్తే అవి శరీరంలోని ఇతర భాగాలకు ప్రయాణించగలవు. ఏ వయస్సులోనైనా, క్యాన్సర్ నిర్ధారణను అంగీకరించడం కష్టం. కానీ బాల్యంలో వచ్చే క్యాన్సర్లు పూర్తిగా భిన్నమైన పరిస్థితిని కలిగి ఉంటాయి. పిల్లలతోపాటు తల్లిదండ్రులు మానసిక క్షోభను అనుభవిస్తారు.
14 ఏళ్లలోపు వచ్చే క్యాన్సర్‌లను చైల్డ్‌హుడ్ క్యాన్సర్స్‌గా, పీడియాట్రిక్ క్యాన్సర్స్‌గా పిలుస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో క్యాన్సర్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరణాల రేటు పెరుగుదలకు ప్రధానమైన కారణాల్లో ఒకటిగా ఉద్భవించింది. సాధారణంగా పెద్దల్లో క్యాన్సర్‌కు మద్యపానం, ధూమపానం, తీసుకునే ఆహారం, జీవనశైలి కారణమవుతాయి కానీ చిన్నపిల్లల్లో వంశపారంపర్య కారణాల వల్ల వస్తుంది. ఇక చిన్ననాటి క్యాన్సర్ కణజాలంలో మొదలైతే.. వయోజన క్యాన్సర్ అవయవాలలో ప్రారంభమవుతుంది.
చైల్డ్‌హుడ్ క్యాన్సర్ లక్షణాలు
* కీళ్ళు, కాళ్ళు లేదా ఎముకలలో వాపు
* తీవ్రమైన తలనొప్పి
* ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం
* దృష్టిలో మార్పులు లేదా కంటిలో తెలుపు రంగు కనిపించడం
* లేత చర్మం, విపరీతమైన అలసట
నివారణ చిట్కాలు
* గర్భధారణ సమయంలో మద్యపానం, ధూమపానం, వాయు కాలుష్యంతో సహా ప్రమాదకరమైన క్యాన్సర్ కారక రసాయనాలకు ఎక్కువ కాలం బహిర్గతం కాకుండా పరిమితం కావడం.
* రేడియేషన్‌కు గురికావడం వల్ల పిల్లలలో క్యాన్సర్ వస్తుంది. అందుకే రేడియేషన్ ఎక్స్‌పోజర్‌ను కనిష్టంగా ఉంచడం మంచిది.
పీడియాట్రిక్ క్యాన్సర్లకు చికిత్స
* శస్త్రచికిత్స: శరీరంలోని క్యాన్సర్ కణాలు, కణితులను తొలగించడానికి శస్త్రచికిత్సా విధానాలు ఉపయోగించబడతాయి.
* కీమోథెరపీ: ఇది డ్రగ్ ట్రీట్‌మెంట్. శరీరంలో వేగంగా పెరుగుతున్న కణాలను చంపడానికి మందులు వాడతారు.
* ఇమ్యునోథెరపీ: ఇది క్యాన్సర్ కణాలతో పోరాడటానికి రోగనిరోధక వ్యవస్థకు సహాయపడుతుంది.
* రేడియేషన్ థెరపీ: క్యాన్సర్ కణాలను చంపడానికి, శరీరంలోని కణితులను తగ్గించడానికి అధిక మోతాదులో రేడియేషన్ ఉపయోగించబడుతుంది.