ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు పుట్టార‌ని ఆ మ‌హిళ‌ను న‌డిరోడ్డుపైన ఇలా.. (వీడియో)

ఇప్ప‌టికీ మ‌హిళల్నే నిందిస్తున్న ఘ‌ట‌న‌లు వెలుగుచూస్తున్నాయి. Woman in UP Beaten By In-Laws For Having Daughters.

Update: 2022-06-04 08:00 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః ప్ర‌భుత్వం ప‌థ‌కాలు, నేత‌ల ప‌ర్య‌ట‌న‌ల‌కు ఇచ్చినంత ప్ర‌చారం అత్య‌వ‌స‌ర‌మైన సామాజిక అంశాల‌ప‌ట్ల స‌రిగ్గా ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే కొన్ని స‌మ‌స్య‌లు త‌ర‌త‌రాలుగా స‌లుపుతూనే ఉన్నాయి. ముఖ్యంగా, ఆడ‌, మ‌గ బిడ్డ‌లు పుట్టుడం అనే అంశంలో ఇప్ప‌టికీ మ‌హిళల్నే నిందిస్తూ, హింసిస్తున్న ఘ‌ట‌న‌లు వెలుగుచూస్తున్నాయి. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో పెద్ద‌మ‌నుషులుగా చెలామ‌ణి అయ్యే ప్ర‌ఖ్యాత వ్యాప‌రాస్థుని ఇంట్లో కుమార్తె పుట్టింద‌నే నెపంతో, కోడ‌లికి న‌ర‌కం చూపించారు. చ‌దువు, జ్ఞానం, ప‌లుకుబ‌డి, సంప‌ద ఉన్న ఇళ్ల‌ల్లోనే ఇంత దుర్మార్గంగా, బుద్ధిహీనులుగా త‌యార‌వుతుంటే, అజ్ఞానంతో ఉన్న కొంద‌రు పేద‌లు మ‌రింత మూఢంగా ఆలోచించ‌డంలో ఆశ్చ‌ర్యం అవ‌స‌రంలేదు. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింద‌ని ఓ మహిళను ఆమె భర్త, అతని కుటుంబ సభ్యులు న‌డిరోడ్డుపై దారుణంగా కొట్టినట్లు పోలీసులు శ‌నివారం బ‌య‌ట‌పెట్టారు.

తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, మగబిడ్డ కావాలంటూ భర్త, అత్తమామలు తనను పదే పదే వేధింపులకు గురిచేస్తున్నారని ఆ మ‌హిళ ఆరోపించింది. కొడుకు పుట్టలేదని నా భర్త, అత్తమామలు నన్ను చిత్రహింసలకు గురిచేశారని, రెండో కూతురు పుట్టిన తర్వాత వేధింపులు ఎక్కువయ్యాయని, తన అత్తమామలు తిండి కూడా పెట్ట‌ట్లేద‌ని మహిళ వాపోయింది. కాగా, తర్వాత ఆమె కూలి పని చేస్తూ త‌న‌తో పాటు ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌ల‌కు తిండిపెడుతుంది ఆమె తెలిపింది. అయితే, ఇటీవ‌ల ఆమెను రోడ్డుపైన విప‌రీతంగా కొట్ట‌డంతో ఈ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. చుట్టూ జ‌నం చూస్తూ ఒక్క‌రు కూడా బాధితురాలికి స‌హాయం చేయ‌క‌పోవ‌డం విశేషం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో ఇద్దరు మహిళలు ఆమెను దుర్భాషలాడుతూ, తన్నడం, కొట్టడం చేస్తుంటే, ఆమె ఏడుస్తూ వారిని ఆపమని వేడుకుంటుంది. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చిన‌ట్లు, మహోబా పోలీసు సూపరింటెండెంట్ సుధా సింగ్ మీడియాకు తెలిపారు. ఇక‌, ఆడ‌బిడ్డ‌, మ‌గ బిడ్డ పుట్ట‌డంలో కేవ‌లం పురుషుడి వీర్య‌క‌ణాల పాత్రే ఉంటుంద‌ని, స్త్రీ నిమిత్త‌మాత్రురాల‌ని స‌మాజం ఇప్ప‌టికైన తెలుసుకొని, క‌ళ్లు తెర‌వాల‌ని మ‌హిళా సంఘాలు వేడుకొంటున్నాయి. 


Similar News