హుజురాబాద్‌లో నేతల సవాళ్ల పర్వం.. ఆలోచనలో ఓటర్లు

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ బై పోల్స్‌లో నాయకుల మధ్య సవాళ్లు, ఛాలెంజ్‌ల పర్వం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు పోటీ పడి మరీ సవాల్ విసురుకుంటున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు ఒకరిని మించి మరొకరు ఛాలెంజ్‌లు చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో తమ ప్రాభవం కోల్పోకుండా, పట్టు సడలకుండా ఉండాలని చేస్తున్న ప్రయత్నాల్లో ప్రధాన పార్టీల నాయకులు మునిగి తేలుతున్నారు. ఒకరిపై ఒకరు విసురుకుంటున్న ఈ సవాళ్లకు ప్రత్యర్థి పార్టీలు మాత్రం స్పందించడం లేదు. కానీ, పోలింగ్ […]

Update: 2021-10-20 09:48 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ బై పోల్స్‌లో నాయకుల మధ్య సవాళ్లు, ఛాలెంజ్‌ల పర్వం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు పోటీ పడి మరీ సవాల్ విసురుకుంటున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు ఒకరిని మించి మరొకరు ఛాలెంజ్‌లు చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో తమ ప్రాభవం కోల్పోకుండా, పట్టు సడలకుండా ఉండాలని చేస్తున్న ప్రయత్నాల్లో ప్రధాన పార్టీల నాయకులు మునిగి తేలుతున్నారు.

ఒకరిపై ఒకరు విసురుకుంటున్న ఈ సవాళ్లకు ప్రత్యర్థి పార్టీలు మాత్రం స్పందించడం లేదు. కానీ, పోలింగ్ తేదీ సమీపిస్తున్నా కొద్దీ వీరి సవాళ్ల పర్వం పెరిగిపోతోంది. ఓటర్లను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు వారి అభ్యున్నతి కోసం ఏం చేస్తారో చెప్పడం లేదు కానీ.. ఒక పార్టీ నాయకులు చేసిన కామెంట్లకు మరో పార్టీ నాయకులు స్పందిస్తూ సవాల్ చేస్తున్నారు.

సవాళ్లు.. ప్రతి సవాళ్లు

బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో పాటు, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పలువురు నాయకులు సవాళ్లు విసిరి బహిరంగ చర్చకు రావాలని టీఆర్ఎస్ ముఖ్య నాయకులకు సవాల్ విసిరారు. హుజురాబాద్‌లో తనతో పాటు పోటీ చేసేందుకు దమ్ముంటే సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులు రావాలని ఈటల పిలుపునిచ్చారు. డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్లు కంప్లీట్ చేయలేకపోయారని మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ఈటల.. బహిరంగ చర్చకు రావాలన్నారు. హుజురాబాద్ అభివృద్ధి విషయంలో కూడా అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు రావాలని డిమాండ్ చేశారు.

దళిత బంధు పథకాన్ని నిలిపివేయాలని బీజేపీ ఈసీకి లేఖ రాయలేదని ఇందుకు తడిగుడ్డలు కట్టుకొని తాను చెల్పూర్ పోచమ్మ గుడికి వస్తానని, సీఎం కేసీఆర్ వస్తాడా అంటూ ఈటల సవాల్ విసిరారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సమయంలో దళిత బంధు ప్రోగ్రాం నిలిపివేయాలంటూ ఈటల రాసినట్టుగా వైరల్ అయిన లేఖపై స్పందించిన రాజేందర్ తాను ఆ లేఖ రాయలేదని ఫేక్ లెటర్ సృష్టించారని మండిపడ్డారు. ఈ లేఖ తాను రాసినట్టు నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమేనని ఈటల ప్రకటించారు.

మరోవైపు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి దళిత బంధు పథకాన్ని ఆపాలని తాను లేఖ రాసినట్టుగా టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారమంతా అబద్దమని స్పష్టం చేశారు. హుజురాబాద్ అంబేద్కర్ సెంటర్‌లో బహిరంగ చర్చకు వచ్చి నిరూపించాలని డిమాండ్ చేశారు. నిరూపిస్తే తాను అక్కడే ఉరేసుకుంటానని ప్రేమేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు హుజురాబాద్ అంబేద్కర్ సెంటర్‌లో వేచి చూసి టీఆర్ఎస్ నాయకులు రాకపోవడంతో వెళ్లిపోయారు.

అలాగే, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కూడా దళిత బంధు స్కీం ఆపాలని రాసిన లేఖలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సవాల్ విసిరారు. యాదాద్రి నర్సన్న గుడికి రావాలని డిమాండ్ చేశారు. తనను చంపేందుకు ఓ మంత్రి కుట్ర పన్నారని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఓ మాజీ నక్సల్ తనకు ఈ విషయం చెప్పారన్నారు.

దీనికి స్పందించిన జిల్లా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఈటలను చంపేందుకు కుట్ర పన్నిన విషయంపై కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థలతో దర్యాప్తు చేయించాలన్నారు. లేనట్టయితే తానే డీజీపీకి లేఖ రాయమంటే రాస్తానని సవాల్ విసిరారు. గ్యాస్ సిలిండర్ ట్యాక్స్ రూ. 291 రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలోనే జమ అవుతున్నాయని ఈటల అన్నారు. దీనిపై మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్ ట్యాక్స్ కేంద్రం ఖజానాలో జమ అవుతున్నాయా.? లేక రాష్ట్ర ఖజానాలో జమ అవుతున్నాయో తేల్చుకునేందుకు జమ్మికుంట గాంధీ సెంటర్‌కు, హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాకు వస్తావా అంటూ సవాల్ విసిరారు.

ఈ డబ్బు రాష్ట్ర ఖాతాలో చేరిందని నిరూపిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని, ముక్కు నేలకు రాస్తానని అన్నారు. దళిత బంధు ఆపింది బీజేపీ అని, ఈనెల 7న ప్రేమేందర్ రెడ్డి లేఖ రాసింది నిజమని హరీష్ రావు తెలిపారు. దీన్ని రుజువు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఏ బీజేపీ నాయకుడు వస్తాడో రావాలన్నారు. టీఆర్ఎస్, బీజేపీ నాయకులు సవాళ్లు, ప్రతి సవాళ్లు వేసుకుంటూ ప్రకటనల వార్ మొదలుపెట్టారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక సవాళ్లకు వేదికగా మారింది.

Tags:    

Similar News