మున్సిపాలిటీపై సార్ పెత్తనం.. మాట ఎత్తొద్దు.. గీత దాటొద్దు..!
దిశ ప్రతినిధి, వరంగల్: జనగామ మున్సిపాలిటీ పై ఓ కీలక ప్రజాప్రతినిధి పెత్తనం కొనసాగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తున్నాయి. చెప్పింది చేయాలని, చేయని అధికారులను టార్గెట్ చేస్తూ వేధిస్తున్నారన్న ఆరోపణ లున్నాయి. గడిచిన ఆరున్నర ఏళ్ల కాలంలో మున్సిపాలిటీలో జరిగిన అధికారుల బదిలీలను గమనిస్తే కూడా ఈ విషయం స్పష్టమవుతోంది. జనగామ మున్సిపాలిటీలో ఒకరిద్దరు కమిషనర్లు మినహా మిగతా వారు మూడు నుంచి ఆరు నెలల కాలంలోనే ఇక్కడి నుంచి బదిలీ కావడమో… స్వీయ బదిలీలపై వెళ్లడమో జరిగినట్లుగా […]
దిశ ప్రతినిధి, వరంగల్: జనగామ మున్సిపాలిటీ పై ఓ కీలక ప్రజాప్రతినిధి పెత్తనం కొనసాగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తున్నాయి. చెప్పింది చేయాలని, చేయని అధికారులను టార్గెట్ చేస్తూ వేధిస్తున్నారన్న ఆరోపణ లున్నాయి. గడిచిన ఆరున్నర ఏళ్ల కాలంలో మున్సిపాలిటీలో జరిగిన అధికారుల బదిలీలను గమనిస్తే కూడా ఈ విషయం స్పష్టమవుతోంది. జనగామ మున్సిపాలిటీలో ఒకరిద్దరు కమిషనర్లు మినహా మిగతా వారు మూడు నుంచి ఆరు నెలల కాలంలోనే ఇక్కడి నుంచి బదిలీ కావడమో… స్వీయ బదిలీలపై వెళ్లడమో జరిగినట్లుగా తెలుస్తోంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న జనగామ మున్సిపాలిటీపై పట్టు బిగించకముందే కమిషనర్లు బదిలీ కావడం వెనుక సదరు నేత రాజకీయ, అధికార బలాలే కారణమని తెలుస్తోంది. ఏడాది కాలంలో ముగ్గురు కమిషనర్లు మారడం వెనుక ఆ నేత ప్రమేయం ఉందని సమాచారం.
పర్మిషన్లు ఇవ్వాలని ఒత్తిళ్లు…
జనగామ నియోజకవర్గానికి పట్టణం గుండెకాయలాంటింది. పట్టణంపై రాజకీయంగా పట్టు జారకుండా ఉండేందుకు సదరు నేత అధికార బలాన్ని యంత్రాంగంపై చూపుతున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. తన అనుచరగణం పైరవీలకు పెద్దపీట వేస్తూ అధికారులకు హుకుం జారీ చేస్తారన్న విమర్శలూ ఉన్నాయి. సదరు నేతకు భయపడి అక్రమంగా పర్మిషన్లు ఇవ్వలేక.. ఇవ్వకుండా రాజకీయ ఒత్తిడిని తట్టుకోలేక అధికారులు సతమతమవుతున్నట్లు సమాచారం. కడుపు చించుకుంటే కాళ్ల మీదపడ్డట్లు.. ఈ విషయం బయటకు చెప్పుకున్న తర్వాతి కాలంలో ఉద్యోగపరమైన ఇబ్బందులు తప్పవన భావనతో అధికారులు మిన్నకుంటున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రజాప్రతినిధి చేస్తున్న ఒత్తిడి మూలంగానే అధికారులు స్వీయ బదిలీలకు శాఖపరంగా రిక్వెస్ట్ పెట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సార్ మాట వినకుంటే.. పరిమితుల గీత దాటితే ఇబ్బంది తప్పదన్న అభిప్రాయాన్ని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. మున్సిపాలిటీలో పనిచేయాలంటే ఏ స్థాయి అధికారి అయినా సరే ముందు ఆ నేతకు విధేయుడిగా ఉండటం నేర్చుకోవాలన్నది ప్రాథమిక సూత్రమంటూ పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో పనిలేదు.. నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు.. సార్ చెప్పింది చేయడం చేస్తే చాలు.. అంతా సారే చూసుకుంటారు… మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదరు.. కాదు కూడదని అధికారి తన సొంత పనితనం చూపితే… బదిలీ కావడమా..? బదిలీ చేసుకునేలా చేయడమో..! సార్ తనదైన శైలిలో చేసి చూపెడతారంటూ పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి దిశకు వివరించారు.
అధికారులతో.. రాజకీయ క్రీడ
ఏడాది కాలంలోనే జనగామ మున్సిపాలిటీ కమిషనర్ మూడో అధికారి రావడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రా ష్ట్రం ఏర్పడ్డాక జనగామ మున్సిపాలిటీలో కమిషనర్లుగా సత్యనారాయణ, రవీందర్ ఇద్దరే ఎక్కువ కాలం పని చేశారు. సత్యనారాయణ తర్వాత వచ్చిన బలరాం, ఈశ్వరయ్య, రవీందర్ తర్వాత వచ్చిన సమ్మయ్య ఐదారు నెలలకు మించకపోవడం గమనార్హం. తాజాగా సోమవారం నరసింహ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. జనగామ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న రవీందర్ కొద్ది రోజుల క్రితం మహబూబా బాద్‌కు బదిలీ అయ్యారు. ఆ తర్వాత కమిషనర్‌గా వచ్చిన సమ్మయ్య బాధ్యతలు స్వీకరించారన్న మాటే గాని.. విధుల్లో ఉన్న పని దినాలు చాలా తక్కువ. వ్యక్తిగత పనుల అంటూ లాంగ్ లీవ్ పెట్టారు. అయితే ఆయన లాంగ్ లీవ్ పెట్టడానికి ప్రధానకారణం ఇక్కడి రాజకీయ తలనొ ప్పులేనని తెలుస్తోంది. సదరు ప్రజాప్రతినిధి అనుచరులు, చోటా మోటా లీడర్ల నుంచి కూడా పైరవీలు మొదలవడం, పత్రాల్లేకుండానే ఇళ్లకు పర్మిషన్లు ఇవ్వాలంటూ ఒత్తిడి పెరగడంతో అధికారి మన స్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇక్కడ పనిచేయడం ఇష్టం లేకే లాంగ్ లీవ్ పెట్టినట్లుగా సమాచారం.