ఫస్ట్ భర్తీ చేసేది ఆ ఉద్యోగ ఖాళీలనే..!

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కసరత్తు తుది దశకు చేరుతోంది. మంగళవారం జరిగే కేబినెట్​ భేటీలో ఇదే అంశం ప్రధాన ఎజెండాగా తయారవుతోంది. త్వరలో హుజురాబాద్​ ఉప ఎన్నికకు షెడ్యూల్​ రానుందనే ఊహాగానాల నేపథ్యంలో కొలువుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ప్రకటించిన విధంగా 50వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఒకేసారి 50 వేల వరకు ఉద్యోగాలకు కాకుండా… వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశమున్నట్లు సమాచారం. […]

Update: 2021-07-12 19:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కసరత్తు తుది దశకు చేరుతోంది. మంగళవారం జరిగే కేబినెట్​ భేటీలో ఇదే అంశం ప్రధాన ఎజెండాగా తయారవుతోంది. త్వరలో హుజురాబాద్​ ఉప ఎన్నికకు షెడ్యూల్​ రానుందనే ఊహాగానాల నేపథ్యంలో కొలువుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ప్రకటించిన విధంగా 50వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఒకేసారి 50 వేల వరకు ఉద్యోగాలకు కాకుండా… వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశమున్నట్లు సమాచారం.

వివాదాలు లేని వాటికే ప్రియార్టీ

ఉద్యోగాల నోటిఫికేషన్లలో ముందుగా వివాదాలు లేని వాటికే ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. అన్ని శాఖల నుంచి వచ్చిన నివేదికల అనంతరం సోమవారం సీఎస్​తో పాటు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు మరోసారి భేటీ అయ్యారు. అన్ని విభాగాల నుంచి వచ్చిన ఖాళీలపై చర్చించారు. సీఎం కేసీఆర్​ ప్రకటించిన విధంగా 50 వేల ఉద్యోగాలు కాకుండా… అంతే తక్కువ సంఖ్యలో ఖాళీలు ఉన్నట్లు నివేదికల్లో గుర్తించారు. వీటిన్నింటిని ఆయా శాఖల వారీగా తీసుకుని తుది నివేదికను సిద్ధం చేశారు.

అయితే ముందుగా ఎలాంటి వివాదాలు రాకుండా ఉండే పోస్టులకే నోటిఫికేషన్లు జారీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎందుకంటే ఇప్పటికే చాలా శాఖల్లో పలు అంశాలపై కోర్టు వివాదాలున్నాయి. టీఎస్​పీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్లలో వేల సంఖ్యలో కోర్టు కేసులు దాఖలయ్యాయి. ఈ వివాదాలపై ఇంకా కోర్టులో వాదనలు నడుస్తుండటంతో వాటిని భర్తీ చేయడం లేదు. ఇలాంటి వాటిని కాకుండా సులువుగా అయ్యే పోస్టులకు ముందుగా నోటిఫికేషన్లు జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. కానీ అలాంటి పోస్టులు తక్కువేనంటున్నారు.

క్లాస్​ –4పై నో క్లారిటీ

ఇక ఆయా విభాగాల్లో నాల్గో తరగతి ఉద్యోగుల నియామకంపై ఎలాంటి వివరాలు తీసుకోలేదని స్పష్టమవుతోంది. ఈ పోస్టులు వేల సంఖ్యలో ఖాళీలున్నా… వాటన్నింటినీ కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ పద్దతిలో నియమించిన వారితోనే వెళ్లదీస్తున్నారు. ఇప్పుడు ఖాళీల జాబితాలో కూడా నాలుగో తరగతి ఉద్యోగ ఖాళీల వివరాలు తీసుకోలేదంటున్నారు. దీంతో డ్రైవర్లు, అటెండర్ల లాంటి పోస్టులను ఈసారి భర్తీ చేయరని సమాచారం.

అయితే నాల్గో తరగతి ఉద్యోగుల స్థానంలో కాంట్రాక్ట్​ ఉద్యోగులు పని చేస్తుండగా… కొన్ని శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్న పోస్టులను ఖాళీగా చూపించలేదని సమాచారం. డేటా ఎంట్రీ ఆపరేటర్లు, స్టెనోలు, లెక్చరర్లు ఉన్న చోట్ల, చాలా కాలం నుంచి కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్నారని, కానీ ఆ పోస్టులను ఖాళీలుగా చూపలేదని స్పష్టమవుతోంది.

డిప్యూటేషన్​ పోస్టులపై తర్వాత నిర్ణయం

ఇక వేల సంఖ్యలో డిప్యూటేషన్​తో భర్తీ చేసిన పోస్టుల వివరాలను ప్రభుత్వం సేకరించింది. పాత జోన్ల ప్రకారం ఆరో జోన్​లోనే దాదాపు 8వేలకు పైగా పోస్టులు డిప్యూటేషన్లతోనే భర్తీ అయినట్లు తెలుస్తోంది. కానీ ఈ పోస్టులపై ఖాళీలను చూపించడానికి ప్రస్తుతం పెండింగ్​ పెట్టారు. ఎందుకంటే దీనిపై ఉద్యోగులకు ఇంకా ఆఫ్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత ఎక్కడెక్కడ ఉద్యోగులు ఉంటారు, స్వస్థలాలకు వెళ్తారనే వివరాలు సమగ్రంగా రావాలంటే డిప్యూటేషన్లను రద్దు చేయడం, లేకుంటే బదిలీలు చేసిన తర్వాతే స్పష్టత రానుంది. అనంతరం వాటిని ఖాళీలుగా చూపించే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి మాత్రం డిప్యూటేషన్లు చేస్తున్న పోస్టులను ఖాళీలుగా చూపించలేదని స్పష్టమవుతోంది.

హుజురాబాద్​ అంశంతోనే స్పీడ్​..?

త్వరలోనే హుజురాబాద్​ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు రావడం అనివార్యం కాగా… ఈలోగా కొన్ని పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. దీనిలో ఎలాంటి వివాదాలు రాని పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేస్తే నిరుద్యోగుల నుంచి కొంత వ్యతిరేకత తగ్గుతుందని, ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న హుజురాబాద్​ ఉప ఎన్నికల్లో లాభిస్తుందని భావిస్తున్నారు. అందుకే ఉద్యోగాల భర్తీపై స్పీడ్​ పెంచినట్లు తెలుస్తోంది. ఏండ్ల నుంచి నోటిఫికేషన్లు రాకపోవడంతో లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వ్యతిరేకత ఎక్కువవుతుందనే నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరుగుతోంది.

నేడు స్పష్టత

సీఎం కేసీఆర్​ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం కేబినెట్​ భేటీ జరుగుతోంది. కేబినెట్​ భేటీలో ప్రధానాంశం ఉద్యోగుల భర్తీ. దీనిపై సీఎస్​ ఇచ్చే నివేదిక ఆధారంగానే సీఎం కేసీఆర్​ నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్​ భేటీలో ప్రధానమైన అంశం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుందని ఇప్పటికే తెలుస్తోంది. కేబినెట్​లో దీనిపై చర్చించి, నోటిఫికేషన్ల జారీకి అనుమతి ఇవ్వనున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నేడు జరిగే మంత్రివర్గ సమావేశంపై ఆసక్తి నెలకొంది. అయితే సీఎస్​ నివేదిక ప్రకారం ఉద్యోగ ఖాళీలు తక్కువే చూపించినా… సీఎం కేసీఆర్​ ప్రకటించిన విధంగా 50 వేలకుపైగా భర్తీ చేసేందుకు ప్రకటన చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

కాగా సోమవారం రాత్రి వరకు సీఎస్​ ఆధ్వర్యంలో కొలువుల ఖాళీల నివేదికను పూర్తి చేసినట్లు అధికారవర్గాల సమాచారం. సీఎస్​ నివేదిక ప్రకారం విద్య, పోలీస్, పురపాలక, రెవెన్యూ, వైద్య, విద్యుత్‌ శాఖల్లో ఎక్కువ పోస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. గురుకుల విద్యా సంస్థలతో పాటుగా గిరిజన సంక్షేమ గురుకులాల్లో కూడా పెద్ద సంఖ్యలోనే పోస్టులను చూపించే అవకాశం ఉంది.

Tags:    

Similar News