ప్రస్తుతం పరిస్థితులు మారాయి
దిశ ప్రతినిధి, హైదరాబాద్: ప్రభుత్వం చెప్పినట్లు గానే కరోనాతో రోగులు సహవాసం చేస్తున్నారు. అదేమిటీ పాజిటివ్ వచ్చిన వారు హాస్పిటల్ లో కదా ఉండవలసింది అనుకుంటున్నారా ? మీ అనుమానం నిజమే. మొదట్లో కరోనా బారిన పడిన వారు ఆస్పత్రికి వెళ్లి వైద్య సేవలు పొందేవారు. తగ్గిన తర్వాత ఇంటికి వచ్చేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఒకవైపు రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడం, మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రులలో పడకల కొరత ఉందని, రోగులను పట్టించుకోవడం […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్: ప్రభుత్వం చెప్పినట్లు గానే కరోనాతో రోగులు సహవాసం చేస్తున్నారు. అదేమిటీ పాజిటివ్ వచ్చిన వారు హాస్పిటల్ లో కదా ఉండవలసింది అనుకుంటున్నారా ? మీ అనుమానం నిజమే. మొదట్లో కరోనా బారిన పడిన వారు ఆస్పత్రికి వెళ్లి వైద్య సేవలు పొందేవారు. తగ్గిన తర్వాత ఇంటికి వచ్చేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఒకవైపు రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడం, మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రులలో పడకల కొరత ఉందని, రోగులను పట్టించుకోవడం లేదని సామాజిక మాద్యమాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతుండడంతో పాజిటివ్ వచ్చిన వారు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ప్రైవేట్ హాస్సటల్స్ లో లక్షలాధి రూపాయలు వెచ్చించ లేక ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్ వచ్చిన రోగులు తమ పక్కవారికి కూడా తెలియకుండా గుట్టుగా హోం క్వారంటైన్ లో ఉంటుడడం నగర ప్రజలను కలవర పరుస్తోంది.
మొదట్లో పాజిటివ్ అంటే పరిగెత్తేవారు
కరోనా వైరస్ మొదలైన రోజులలో ఎవరికైనా పాజిటివ్ వచ్చిందంటే సమీపంలో ఉన్న వారు ఆమడ దూరం పరిగెత్తేవారు. రోగి ఉంటున్న ఇంటి పరిసరాలకు వెళ్లేందుకు కూడా భయపడేవారు. దీనికి తోడు అధికారులు కూడా ఆయా ప్రాంతాలను మూసి వేసి కట్టడి చేసేవారు. ఐతే రోజులు గడుస్తున్నా కొద్ది ప్రభుత్వం చెప్పినట్లుగానే కరోనాతో సహజీవనం చేస్తున్నారు. మొదట్లో కరోనా బారిన పడిన వారికి జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కన్పించేవి. రోజులు గడుస్తున్నా కొద్ది డాక్టర్లు చెబుతున్నట్లుగా వ్యాధి కూడా దారి మార్చినట్లు కనబడుతోంది. ఎలాంటి లక్షణాలు లేని వారికి కరోనా పాజిటివ్ వస్తోంది. దీంతో వారు వైద్యుల సలహాలు తీసుకుని హోం క్వారెంటైన్ కు పరిమితం అవుతున్నారు.
అపార్టుమెంట్లలో అధికం
కరోనా పాజిటివ్ రోగులు కొంత మంది పక్కవారికి తెలియకుండా తమ ఫ్లాట్ లో ఉంటున్నారు. ముఖ్యంగా అపార్టుమెంట్లలో ఇలాంటి పరిస్థితులు అధికంగా ఉంటున్నాయి. హైదరాబాద్ వంటి మహా నగరంలో బహుళ అంతస్తుల అపార్టుమెంట్లు చాలా ఉన్నాయి. వీటిల్లో నివాసం ఉంటున్న వారిలో కొంత మంది పాజిటివ్ రాగానే పక్క ఫ్లాట్ వారికి కూడా తెలియకుండా హోం క్వారెంటైన్ లో ఉంటున్నారు. ఇలాంటి వారు తమ కుటుంబ సభ్యులను ముందుగానే ప్రత్యామ్నాయంగా బంధువుల ఇండ్లకు, గ్రామాలకు పంపిస్తుండగా ఇలాంటి అవకాశం లేని వారు ఫ్లాట్ లోనే ఓ గదిలో కరోనా తగ్గేంత వరకు ఉంటున్నారు. సుమారు రెండు వారాల క్వారంటైన్ తర్వాత బయటకు వచ్చి తమకు కరోనా పాజిటివ్ వచ్చందని, హోం క్వారెంటైన్ లో ఉన్నానని పక్క వారికి చెప్తుండడంతో వారు బెదిరిపోతున్నారు.
భయమేసింది: కె యాదగిరి, కర్మన్ ఘాట్
మా పక్క ఫ్లాట్ లో నివాసముండే వ్యక్తికి కరోనా లక్షణాలు లేకున్నా పరీక్షలు చేయించుకోవడంతో పాజిటివ్ అని తేలింది. దీంతో అతను కుటుంబ సభ్యులను ఊరికి పంపించి ఒక్కడే ఫ్లాట్ లో రెండు వారాలు ఉండి కరోనా బారి నుండి బయటపడ్డాడు. ఐతే అతను కరోనా సోకక ముందు విధి నిర్వహణలో భాగంగా ప్రతి రోజు ఉదయమే లేచి వెళ్లే వాడు కావడంతో రెండు వారాలు ఎవరికీ కన్పించకున్నా అనుమానం రాలేదు. డ్యూటీకి వెళ్లాడని అనుకున్నాం. తీరా అతనికి కరోనా వచ్చి ఇంట్లోనే ఉన్నాడని తెలిసి చాలా భయమేసింది.
ఇలాంటి సంఘటనలే నగరంలోని చాలా అపార్ట్ మెంట్లలో చోటు చేసుకుంటుండగా ప్రజలు ప్రభుత్వం చెప్పినట్లుగానే వారికి తెలియకుండానే కరోనాతో సహవాసం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.