పుచ్చకాయ… పుచ్చుకునేవారేరి?
దిశ, నల్లగొండ: అది ఒకప్పుడు కాసులు కురిపించింది. కానీ, ఇప్పుడది కళ్ల ముందే పాడవుతూ కన్నీరు తెప్పిస్తున్నది. చేసేదేమీక లబోదిబోమని మొత్తకుంటున్నారు. ఇంత జరుగుతున్నా వీరి వంక ఎవరూ చూస్తలేరు. దానిని పట్టిచ్చుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. అదేంటో మీరే చూడండి.. పుచ్చసాగు చేసిన రైతులు సైతం కరోనా కారణంగా కుదేల్ అవుతున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఎక్కడికక్కడ బంద్ నెలకొనడంతో పుచ్చకాయలు కొనడానికి తోటల వద్దకు వ్యాపారులు రావడంలేదు. దీంతో కోతకు […]
దిశ, నల్లగొండ: అది ఒకప్పుడు కాసులు కురిపించింది. కానీ, ఇప్పుడది కళ్ల ముందే పాడవుతూ కన్నీరు తెప్పిస్తున్నది. చేసేదేమీక లబోదిబోమని మొత్తకుంటున్నారు. ఇంత జరుగుతున్నా వీరి వంక ఎవరూ చూస్తలేరు. దానిని పట్టిచ్చుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. అదేంటో మీరే చూడండి..
పుచ్చసాగు చేసిన రైతులు సైతం కరోనా కారణంగా కుదేల్ అవుతున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఎక్కడికక్కడ బంద్ నెలకొనడంతో పుచ్చకాయలు కొనడానికి తోటల వద్దకు వ్యాపారులు రావడంలేదు. దీంతో కోతకు వచ్చిన కాయలపై మచ్చలు రావడంతోపాటు కోత దశ దాటి అవి ఎండకు పగిలిపోయి తోటల మీదనే రైతుల కళ్లెదుటే పాడవుతున్నాయి. శివరాత్రి పండుగకు ముందు పుచ్చకాయ కిలో రూ.10 లు ఉండగా ఇప్పడు అది రూ. 4.50 పైసలకు ఢమాల్ అంటూ పడిపోవడంతో రైతులు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. కాసులు కురిపించే పంటగా పేరొందిన పుచ్చసాగు ఈ సీజన్‌లో రైతుల కంట కన్నీరు తెప్పిస్తోన్నది. గత 10 రోజులుగా రవాణా నిలిచిపోవడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగు చేసిన 5,600 ఎకరాల్లో లక్ష మెట్రిక్ టన్నులకు పైగా వచ్చే దిగుబడిలో 50 వేల మెట్రిక్ టన్నుల కాయాలు పాడైపోయాయి. సుమారు రూ.40 కోట్ల మేర రైతులు తీవ్రంగా నష్టపోయారు.
రోగ నిరోధక శక్తితోపాటు వేసవిలో చలువనిచ్చే ఆరోగ్య ప్రధాయినిగా పుచ్చకాయకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు డిసెంబర్ రెండోవారం నుంచి ఈ పంటను సాగు చేస్తారు. పంట ఆరంభం నుంచి కాయ కోసేంతవరకు అన్ని ఖర్చులు కలిపి ఎకరాకు రూ. 40 నుంచి 50 వేల వరకు పెట్టుబడి అవుతుంది. అయితే పంటకు ఎలాంటి తెగులు రాకుండా సాగు నీరు సమృద్ధిగా అందించగలిగితే ఎకరాకు 20 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. కిలోకు కనిష్ట ధర రూ. 7 నుంచి గరిష్టంగా రూ.10 వరకు రైతులు తోటల వద్దనే వ్యాపారులకు అమ్ముకుంటారు. దీంతో ఎకరాకు పెట్టిన పెట్టుబడి పోనూ రైతు కష్టం కలిసివచ్చి మరో రూ.50 వేల వరకు ఆదాయం వస్తది. ఇలా 90 రోజుల్లో వచ్చే పంటను సాగు చేయడానికి రైతులు ముందుకు వస్తోన్నారు. ఇలా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 29 మండలాల్లో 1,345 మంది రైతులు 5,600 ఎకరాల్లో పుచ్చ సాగు చేశారు. ఇందుకుగాను లక్ష మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడి వస్తోందని ఉద్యానశాఖ అధికారలు అంచనా వేశారు.
కిలో రూ.10 చొప్పున విక్రయం
శివరాత్రికి ముందు నల్లగొండ, తిప్పర్తి, త్రిపురారం, గుర్రంపోడు, వేములపల్లి, పీఏపల్లి, దేవరకొండ, మునుగోడు, నార్కెట్‌పల్లి, తుర్కపల్లి, బొమ్మలరామారం తదితర చోట్ల తోటల వద్ద రైతులు శివరాత్రి పండుగకు ముందు కిలో రూ.10 చొప్పున వ్యాపారులకు విక్రయించారు. ఆ తరువాత పది రోజులకు ఈ ధర రూ. 7కు పడిపోయింది. ఢిల్లీ, హైదరబాద్‌లో సీఏఏకు వ్యతిరేఖంగా ఆందోళనలు జరగడం తరచూ బంద్‌లు జరగడంతో వ్యాపారులు ఎగుమతులను నిలిపివేశారు. దీంతో ధర పడిపోయింది. ఆ తరువాత ఇప్పుడు కరోనా సంక్రమణ జరుగకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. అంతరాష్ట్ర సరిహద్దులు మూసివేయడంతో ఈ సమస్య మరితం జఠిలంగా మారింది. పట్టణాల్లో ఎక్కడ కూడా బంద్ వాతావరణమే నెలకొంది. ఇళ్ల నుంచి జనాలు రోడ్డుపైకి రావడం వల్ల పోలీసులు బాదుతున్నారు. పోలీసుల భయానికి జనాలు అత్యవసరం ఉంటే తప్ప రోడ్లపైకి వచ్చేందకు జంకుతున్నారు. దీంతో పండ్ల మార్కెట్లల్లో విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో ఇప్పుడు తోటల వద్ద పుచ్చకాయ ధర రూ.4.50పైసలకు పడిపోయింది. ఈ ధరకు సైతం గత వారం రోజులుగా వ్యాపారులు కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడంతో వేల ఎకరాల్లో ఉన్న తోటల్లో 50 వేల మెట్రిక్ టన్నలు కాయాలు పాడైపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది వాస్తవం
నల్లగొండ ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పుచ్చకాయ, బత్తాయి, నిమ్మ రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. అంతరాష్ట్ర ఎగుమతులు నిలిచిపోవడంతోపాటు ట్రేడర్స్ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పట్టణాలు, ముఖ్యమైన ప్రాంతాల్లో పండ్ల స్టాల్స్ ఏర్పాటు చేయించడంలో ఏలికలు విఫలమయ్యారు. కేసీఆర్ మాటే శిలశాసనంగా భావించే ఉమ్మడి జిల్లా గులాబీ ప్రజా ప్రతినిధులు పండ్ల రైతుల బాధాలను పట్టించుకోని కారణంగానే 50 వేల మెట్రిక్ టన్నలు కాయాలు పాడయ్యి సుమారు రూ.40 కోట్ల వరకు నష్టం రైతులకు వాటిల్లింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు అప్రమత్తంగా ఉంటే ఈ నష్టం జరిగేదికాదన్నది వాస్తవం.
వేచి చూడాల్సిందే!
ఇప్పటికైనా రవాణా సౌకర్యం కల్పిస్తేనే మిగతా పంటను అమ్ముకునే వీలుంది. ఆ దిశగా ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిదులు, అధికారులు చర్యలు తీసుకొని ఆదుకోవాలని పుచ్చ, నిమ్మ, బత్తాయి సాగు చేసిన రైతులు వేడుకొంటున్నారు. రైతుల మొరను వీరు ఎంత మేరకు పట్టించుకుంటారనేదీ వేచి చూడాల్సిందే!
Tags: nalgonda, Farmers, watermelon growers, are seriously demanding damage, transportation, and pleading.