వాటిపై జీఎస్టీ పెంపు విరమించుకోవాలి.. కేంద్రమంత్రికి మంత్రి కేటీఆర్ లేఖ
దిశ, తెలంగాణ బ్యూరో: చేనేత, వస్త్ర పరిశ్రమపై వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రతిపాదించిన జీఎస్టీ పన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కు ఆదివారం ఒక లేఖ రాశారు. ఇప్పటికే టెక్స్టైల్ రంగం ముఖ్యంగా చేనేత రంగం గత రెండేళ్లుగా కరోనా సంక్షోభంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందని, ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న జీఎస్టీ […]
దిశ, తెలంగాణ బ్యూరో: చేనేత, వస్త్ర పరిశ్రమపై వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రతిపాదించిన జీఎస్టీ పన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కు ఆదివారం ఒక లేఖ రాశారు. ఇప్పటికే టెక్స్టైల్ రంగం ముఖ్యంగా చేనేత రంగం గత రెండేళ్లుగా కరోనా సంక్షోభంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందని, ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న జీఎస్టీ పన్ను 5 శాతం నుంచి 12శాతానికి పెంచడం ఆ పరిశ్రమను ఆర్థికంగా కుంగదీస్తుందని లేఖలో పేర్కొన్నారు. దేశంలోనే వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధిని కల్పించే టెక్స్టైల్ , చేనేత రంగానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అదనపు ప్రయోజనాలు, ప్రోత్సాహకాలు కల్పించి ఆదుకోవాల్సిన సందర్భంలో ఇలాంటి నిర్ణయం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.
దేశ చరిత్రలో ఏనాడు కూడా చేనేత ఉత్పత్తులపై పన్ను లేదని, అయితే కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ ద్వారా తొలిసారి 5 శాతం పన్ను విధించిందని, అప్పుడే చేనేత రంగం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైందని కేటీఆర్ గుర్తు చేశారు. తాజాగా మరో 7 శాతం అదనపు జీఎస్టీని వేయడం వలన చేనేత రంగం పూర్తిగా కుదేలై పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ అద్భుతమైన చేనేత సాంప్రదాయం ఉందని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చీరలకు తెలంగాణ ప్రసిద్ధి చెందిందని ఈ రంగంలో ఉన్న నేతన్నలు జీఎస్టీ పెంపు పైన తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు.
ఇప్పటికే పరిమితమైన మార్కెట్ ఉన్న చేనేత రంగంపై మరో 7 శాతం అదనపు భారాన్ని వినియోగదారులపై మోపడం వలన చేనేత ఉత్పత్తులకు మరింత డిమాండ్ తగ్గే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే గత సంవత్సర కాలంగా పరిశ్రమకు అవసరమైన కాటన్ మరియు యార్న్ వంటి ముడి సరుకుల ధరలు 30 నుంచి 40 శాతం పెరిగాయని కరోనా సంక్షోభం వలన చైనా వంటి దేశాల నుంచి వచ్చే దిగుమతులు తగ్గి పరిశ్రమకు అవసరమైన రసాయనాల ధరలు సైతం భారీగా పెరిగాయన్నారు. గత సంవత్సర కాలంలో భారీగా పెరిగిన ఇంధన ధరల వలన రవాణా ఖర్చులు సైతం భారీగా పెరిగాయన్నారు. ఇలాంటి నేపథ్యంలో పెరిగిన ముడి సరుకు ధరల ప్రభావంతో పాటు ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న అదనపు 7 శాతం పెంపు వలన అనేక చిన్న తరహా టెక్స్టైల్ మరియు హ్యాండ్ యూనిట్లు పూర్తిగా మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.