రాష్ట్రానికి సచివాలయమే లేదు

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పరిపాలనకు గుండెకాయగా ఉండే సచివాలయమే లేకుండా పోయిందని, అది ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడికి రానే రారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తూ ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం నెలకు పదిహేను రోజులు ఫామ్ హౌజ్‌లోనే ఉంటారని అన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమావేశానికి శుక్రవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన […]

Update: 2020-11-06 12:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పరిపాలనకు గుండెకాయగా ఉండే సచివాలయమే లేకుండా పోయిందని, అది ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడికి రానే రారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తూ ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం నెలకు పదిహేను రోజులు ఫామ్ హౌజ్‌లోనే ఉంటారని అన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమావేశానికి శుక్రవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు పొందిన టీఆర్ఎస్.. ఈసారి ఎన్నికల సమయంలో ప్రచారానికి వస్తే ఆ ఇంఢ్లు ఏవంటూ నిలదీయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని, దీనికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజలకు మంచి పాలన ఉంటుందని, ఆత్మగౌరవంతో బతకవచ్చని భావించి ఉద్యమంలోకి దూకారని అన్నారు. కానీ కేసీఆర్ కుటుంబ పాలన వస్తుందని ఊహించలేదన్నారు. హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదలు సంభవిస్తే ఒక్కరోజైనా రోడ్డు మీదకు వచ్చి వరద బాధితుల కుటుంబాలను సీఎం పరామర్శించలేదన్నారు. ప్రజలు కోరుకున్నది ఇది కాదన్నారు. ప్రగతి భవన్‌కు, ఫామ్ హౌజ్‌కు మధ్య తిరగడానికి సమయం దొరికిన ముఖ్యమంత్రికి వరద బాధిత ప్రాంతాలకు వెళ్ళడానికి తీరిక లేదా అని ఆయన ప్రశ్నించారు. సుమారు ఐదు లక్షల ఇళ్ళల్లోకి వరద నీరు వస్తే పర్యటించలేదని, చనిపోయినవారిని ఆదుకోలేదని అన్నారు.

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని, ఆ దిశగా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఇక్కడ ఉన్న ముస్లిం మైనారిటీ ఓటర్లు కూడా బీజేపీకి అనుకూలంగానే ఉన్నారని వ్యాఖ్యానించారు. కారు గుర్తుకు ఓటు వేస్తే డబుల్ బెడ్ రూమ్ వస్తుందని గత జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ హామీ ఇచ్చిందన్నారు. కానీ దాన్ని అమలుచేయడంలో విఫలమైందన్నారు. కరోనా కాలంలో సాయం అందించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రతీ పొదుపు సంఘానికి రూ. 20 లక్షల మేర రుణ సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని గుర్తుచేశారు. ఇచ్చిన హామీని మర్చిపోయే పార్టీ టీఆర్ఎస్ అయితే, పేదలను ఆదుకునే పార్టీ బీజేపీ అని కిషన్ రెడ్డి నొక్కిచెప్పారు. రానున్న ఎన్నికల్లో హైదరాబాద్ అభివృద్ధి కోసం బీజేపీని గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీలో అత్యధిక సంఖ్యలో కార్పొరేటర్లను గెలిపించుకోవాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.

Tags:    

Similar News