పంట లెక్కలు తీయండి: కేసీఆర్

దిశ, న్యూస్ బ్యూరో: రానున్న వర్షాకాలం నుంచే రాష్ట్రంలో ఏ గుంటలో ఏ పంట వేస్తున్నారనే లెక్కలు తీయాలని, స్థానిక వ్యవసాయ విస్తరణాధికారులు ఖచ్చితమైన వివరాలు సేకరించి పూర్తి స్థాయిలో క్రాప్ ఎన్యూమరేషన్ జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. జిల్లా కేంద్రం నుంచి గ్రామం వరకు అందుబాటులో ఉన్న హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, కల్టివేటర్లు, ప్లాంటేషన్ యంత్రాలు… ఇలా అన్ని రకాల వ్యవసాయ పరికరాల లెక్కలు పక్కాగా ఉండాలని, భవిష్యత్తులో చేయ తలపెట్టిన యాంత్రికీరణకు ఈ వివరాలు దోహదపడలాని […]

Update: 2020-05-21 11:42 GMT

దిశ, న్యూస్ బ్యూరో: రానున్న వర్షాకాలం నుంచే రాష్ట్రంలో ఏ గుంటలో ఏ పంట వేస్తున్నారనే లెక్కలు తీయాలని, స్థానిక వ్యవసాయ విస్తరణాధికారులు ఖచ్చితమైన వివరాలు సేకరించి పూర్తి స్థాయిలో క్రాప్ ఎన్యూమరేషన్ జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. జిల్లా కేంద్రం నుంచి గ్రామం వరకు అందుబాటులో ఉన్న హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, కల్టివేటర్లు, ప్లాంటేషన్ యంత్రాలు… ఇలా అన్ని రకాల వ్యవసాయ పరికరాల లెక్కలు పక్కాగా ఉండాలని, భవిష్యత్తులో చేయ తలపెట్టిన యాంత్రికీరణకు ఈ వివరాలు దోహదపడలాని స్పష్టం చేశారు. ఏ పొలంలో ఏ పంట వేయాలో నియంత్రిత పంటల సాగు విధానం స్పష్టం చేస్తుంది కాబట్టి ప్రతీ జిల్లాలో భూసార పరీక్షా కేంద్రాలు ఉండాలని అన్నారు. జిల్లాలవారీగా అగ్రికల్చర్ కార్డును రూపొందించి ప్రతీ ఏటా దాన్ని అప్‌డేట్ చేస్తూ ఉండాలని, దాని ప్రకారమే పంటల సాగు జరగాలని అన్నారు. ప్రభుత్వం చెప్పిన ప్రకారం పంటలు వేస్తే రైతులు నష్టపోయే అవకాశమే ఉండదన్నారు. నాణ్యమైన ఉత్పత్తులను అందించడం ద్వారా రైతులు లాభాలు గడించాలన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నారు.

వ్యవసాయ శాఖ పూర్తిగా ఈ పనిమీదనే నిమగ్నమై ఉంటుంది కాబట్టి సిబ్బందికి ఇతర పనులు అప్పగించవద్దని సంబంధిత శాఖలకు సీఎం స్పష్టం చేశారు. కల్తీ విత్తన వ్యాపారులు రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నారని, వారు రైతు హంతకులని సీఎం వ్యాఖ్యానించారు. అలాంటివారిపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, పీడీ యాక్టు కింద అరెస్టు చేసి జైల్లో పెట్టాలని స్పష్టం చేశారు. కల్తీ విత్తన వ్యాపారం నూటికి నూరు శాతం అరికట్టబడాలని, ప్రజా ప్రతినిధులెవ్వరూ వీరిని కాపాడే ప్రయత్నం చేయరాదని స్పష్టం చేశారు. గోదావరి ప్రాజెక్టుల కింత నీటికి ఇబ్బంది లేనందువల్ల దీర్ఘకాలిక వరి పంటలను, కృష్ణా నదిలో స్వల్పకాలిక వరి రకాలను సాగుచేయాలని సూచించారు. నియంత్రిత పంటల సాగు విధానం వల్ల రైతులకే మేలు కలుగుతుందని, ప్రభుత్వం ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా కల్పించారు. నూతన పంటల సాగు విధానంపై ప్రగతి భవన్‌లో గురువారం జరిపిన సుదీర్ఘ సమావేశం సందర్భంగా సీఎం పై వ్యాఖ్యలు చేశారు.

ఏ ప్రాంతంలో ఎంత విస్తీర్ణంలో ఏ పంటను సాగుచేయాలనేది వ్యవసాయ శాఖ ముందే నిర్ణయిస్తుంది కాబట్టి ఆ అవసరాలకు సరిపడా విత్తనాలను ముందే గ్రామాలకు చేరుస్తామని, ఇందుకోసం వ్యవసాయ శాఖ సంబంధిత విత్తన సంస్థలతో మాట్లాడి సమన్వయం చేయాలని సీఎం సూచించారు. విత్తనం వేసిన దగ్గరి నుంచి పంట అమ్ముడుపోయేవరకు రైతులకు నిత్యం రైతుబంధు సమన్వయ సమితి సమన్వయకర్తగా వ్యవహరిస్తుందని, రాబోయే నెల రోజుల పాటు రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించి యజ్ఞంలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. డిమాండ్ కలిగిన పంటలను పండించడం, దానితో పాటే నాణ్యతను కూడా పరిగణనలోకి తీసుకోవడం రైతులకు ఎప్పుడూ శ్రేయస్కరమని, మార్కెట్‌లో మంచి ధర వస్తుందని సీఎం అన్నారు. మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖలో రెండు కమిటీలను ప్రభుత్వం త్వరలోనే నియమిస్తుందని తెలిపారు. రైతులకు నియంత్రిత పంటల సాగు విధానంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకురానున్న నాలుగైదు రోజుల్లోనే క్లస్టర్లవారీ రైతు సదస్సులను ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు.

రైతు వేదికల నిర్మాణం

రైతులకు ఎల్లవేళలా రైతు సమన్వయ సమితులు అందుబాటులో ఉంటాయి కాబట్టి రైతు వేదికల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన జరగాలని సీఎం ఆదేశించారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్లస్టర్‌లో తానే స్వంత ఖర్చుతో రైతు వేదిక నిర్మిస్తానని హామీ ఇచ్చారు. జిల్లా మంత్రులంతా తలా ఒక రైతు వేదికను స్వంత ఖర్చుతో నిర్మించడానికి ముందుకు వచ్చారని తెలిపారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి తదితర కొద్దిమంది ఎమ్మెల్సీలు, పౌర సరఫరాల శాఖ చైర్మన్ శ్రీనివాసరెడ్డి కూడా రైతు వేదికలను నిర్మించనున్నట్లు హామీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 2602 క్లస్టర్లలో నాలుగైదు నెలల్లోనే రైతు వేదికల నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఎప్పటికప్పుడు సమావేశాలు జరగాల్సి ఉన్నందున రైతు వేదిక కార్యాలయాల్లో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించుకునే సౌకర్యంతో పాటు సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మించినందున పంటలు మంచిగా పండుతాయని, అదే సమయంలో రైతుకు లాభం చేకూరేలా ఈ నూతన విధానాన్ని రూపొందించాల్సి వచ్చిందన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా నిలిచి లాభసాటి వ్యవసాయంగా తీర్చిదిద్దేందుకే ఈ తపన అంతా అని అన్నారు.

రైతుల పంటలకు వ్యాల్యూ ఎడిషన్ చేయడం కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రత్యేకంగా సెజ్‌లు కూడా వస్తాయన్నారు. ఇందుకు అవసరమైన స్థలాలను జిల్లా అధికారులు ఎంపిక చేయాలని, దీనికి అనుసంధానంగా గోదాముల నిర్మాణం, కోల్డ్ స్టోరేజీ ప్లాంట్లను కూడా ప్లాన్ చేయాలని సూచించారు. గోదాములకు దగ్గరగా ఇండ్ల లే అవుట్‌కు అనుమతి ఇవ్వవద్దని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటైన 125 మండలాల్లో గోదాములు వస్తాయని తెలిపారు.

మక్కలు వద్దు… పత్తి ముద్దు

ఈ వర్షాకాలంలో మక్కల సాగు ఏ మాత్రం మంచిది కాదని, ఒక్క ఎకరంలో కూడా ఈ పంట వేయవద్దని రైతులకు సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ కాలంలో మక్కల దిగుబడి పాతిక క్వింటాళ్ళు కూడా దాటదని, యాసంగిలో కనీసంగా 35 క్వింటాళ్ళు వస్తుందన్నారు. ఈ పంటతో రైతులకు రూ. 25 వేల ఆదాయం మాత్రమే వస్తుందని పత్తి వల్ల రూ. 50 వేలు వస్తుందన్నారు. తెలంగాణ అవసరాలకు పాతిక లక్షల టన్నుల మక్కలు సరిపోతాయని, యాసంగిలో పండిస్తే సరిపోతుందన్నారు. మక్కలకు అలవాటుపడిన రైతులు ఈసారి పత్తి, కందివైపు చూడాలన్నారు. గతేడాది రాష్ట్రంలో సుమారు 53 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైందని, ఈసారి దాన్ని 70 లక్షల ఎకరాల వరకు పెంచాలని, వరి సాగును మాత్రం గతేడాది ఉన్నట్లుగానే 40 లక్షల ఎకరాల్లో సరిపెట్టవచ్చన్నారు. కందిసాగు గతేడాది కేవలం ఏడు లక్షల ఎకరాల్లో మాత్రమే ఉందని, ఈసారి దాన్ని రెట్టింపు చేసి 15 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని సూచించారు. ఈ పంటను ప్రభుత్వమే మొత్తంగా కొంటుందన్నారు. సోయాబీన్, పసుపు, మిర్చి, కూరగాయలు తదితరాలను గతేడాది తరహాలోనే సాగుచేయవచ్చన్నారు. వరిపంట వేయాల్సిన రైతులు సన్న రకాలతో పాటు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న రకానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

కొత్తగా జిన్నింగ్ మిల్లులు

రాష్ట్రంలో కోటి బెయిళ్ళ సామర్థ్యం కలిగిన 320 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయని, 70 లక్షల ఎకరాల వరకు సాగు చేసినా మద్దతు ధరకు ఢోకా ఉండదని సీఎం వ్యాఖ్యానించారు. జిన్నింగ్ మిల్లులు లేని ప్రాంతాలను గుర్తించి కొత్త మిల్లులు వచ్చేలా పరిశ్రమల శాఖ చొరవ తీసుకోవాలన్నారు. ఇదే సమయంలో అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, పోలీసు అధికారులు సమన్వయంతో కల్తీ విత్తనాలను విక్రయించేవారిని, విత్తనాల కల్తీకి పాల్పడేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విత్తనాలను కల్తీచేసేవారి సమాచారం ప్రభుత్వం దగ్గర ఉందన్నారు.

Tags:    

Similar News