ఇల్లు ఫ్రీ.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మరో హామీ
దిశ, తెలంగాణ బ్యూరో: దళితబంధు, 80 వేల ఉద్యోగాల హామీలకు తోడు అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన శుక్రవారం ముఖ్యమంత్రి మరో హామీ ఇచ్చారు. స్వంత జాగా ఉండి ఇల్లు కట్టుకోడానికి డబ్బులు లేకపోతే ప్రభుత్వమే ఉచితంగా కట్టి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని చేయనున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేస్తామని, త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. 2018 ఎన్నికల సందర్భంగానే ఈ హామీ ఇచ్చామని, ఈ […]
దిశ, తెలంగాణ బ్యూరో: దళితబంధు, 80 వేల ఉద్యోగాల హామీలకు తోడు అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన శుక్రవారం ముఖ్యమంత్రి మరో హామీ ఇచ్చారు. స్వంత జాగా ఉండి ఇల్లు కట్టుకోడానికి డబ్బులు లేకపోతే ప్రభుత్వమే ఉచితంగా కట్టి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని చేయనున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేస్తామని, త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. 2018 ఎన్నికల సందర్భంగానే ఈ హామీ ఇచ్చామని, ఈ ఏడాది బడ్జెట్‌లో నిధులను కూడా పెట్టినట్లు తెలిపారు. కరోనా కారణంగా గతేడాది దీన్ని ప్రారంభించలేకపోయామని గుర్తుచేశారు.
గత ప్రభుత్వాలు గ్రామాల్లోని పేదలకు ఇళ్ళ నిర్మాణానికి స్థలాలు ఇచ్చిందని, వంద కుటుంబాలు ఉంటే 140 మంది లబ్ధిదారులను ఎంపిక చేసిందని, తమ ప్రభుత్వం పారదర్శకంగా ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపారు. ఇళ్ళులేని పేదలకు డబుల్ ఇళ్ళు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో లక్ష ఇండ్లు, అన్ని జిల్లాల్లో కలిపి మరో లక్ష ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. చాలా చోట్ల ఇళ్ళు పూర్తయినా లబ్ధిదారులకు కేటాయించలేదు. కొన్నిచోట్ల ఇంకా తుది మెరుగులు దిద్దే పనులు కొనసాగుతున్నాయి. స్వంత స్థలం ఉండి ఇళ్ళు కట్టుకోలేకపోయిన పేదలకు ఒక్కో ఇంటికి ఐదారు లక్షల రూపాయలను అందిస్తామని గత ఎన్నికల సందర్భంగా కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ ఏడాది బడ్జెట్‌లో గృహ నిర్మాణానికి రూ. 11 వేల కోట్లను కూడా కేటాయించారు. ఇప్పటికింకా ఇది గాడిలో పడలేదు. దీంతో అసెంబ్లీ వేదికగా ఇప్పుడు ఈ హామీని గుర్తుచేశారు.
ఫసల్ బీమా పథకం బోగస్
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా పథకం బోగస్ అని, అలాంటివే ఇంకా చాలా స్కీమ్‌లు ఉన్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఫసల్ బీమా యోజన శాస్త్రీయంగా రూపొందించలేదన్నారు. ఈ పథకంతో రైతులకు పెద్దగా లాభం లేదన్నారు. ఈ స్కీమ్ రూపకల్పనలోనే లోపముందన్నారు. పంటల నష్టం స్కీమ్ కూడా యూనిట్‌ను పరిగణనలోకి తీసుకునే ప్రాధాన్యతల్లోనే తేడాలున్నాయన్నారు. గత ప్రభుత్వాలు రూపొందించిన పథకాల తరహాలోనే ఎన్డీఏ ప్రభుత్వం సైతం రూపొందించిందన్నారు. పైగా దీన్ని ఆప్షనల్‌గా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని, కచ్చితంగా అమలు చేయాల్సిందేననే నిబంధన రాష్ట్రాలకు లేదన్నారు. రాష్ట్రాల ఇష్టానికే వదిలేసిందన్నారు.
పంజాబ్, హర్యానా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ లాంటి పలు రాష్ట్రాలు దీన్ని అమలు చేయడం లేదన్నారు. తెలంగాణ సైతం దీన్ని ఆప్షనల్‌గానే పరిగణిస్తున్నదన్నారు. రైతులకు ఉపయోగపడేలా ఈ పథకం ఎలా ఉండాలో కేంద్రానికి సూచనలు చేస్తామన్నారు. వ్యవసాయ నిపుణులు ఎమ్మెస్ స్వామినాధన్, అశోక్ గులాటి లాంటివారు చాలా ప్రతిపాదనలు చేశారని, కానీ కేంద్రం పట్టించుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో రైతుల్లో నిరాశ వచ్చిందని, అప్పు కోసం బ్యాంకులకు వెళ్తే ప్రీమియం పేరుతో కట్ చేస్తున్నారని అన్నారు. గ్రామాన్ని యూనిట్ గా తీసుకునే విధానం మారాలని వ్యాఖ్యానించారు.
ఫీల్డ్ అసిస్టెంట్లు లేకుంటేనే బాగున్నది
గ్రామాల అభివృద్ధి, పథకాల అమలు స్థానిక సంస్థల పరిధిలోని అంశమని, వాటిని అమలు చేయడానికి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లాంటి అనేక స్థానిక సంస్థల వ్యవస్థ ఉన్నదని, వారు చేయాల్సిన పనే అది అని పేర్కొన్న సీఎం కేసీఆర్ ఫీల్డ్ అసిస్టెంట్లు వేలు పెట్టకపోతేనే పనులు వేగంగా, సంతృప్తికరంగా జరుగుతున్నాయన్నారు. వారు ఉన్నప్పటికీ అనేక రకాల ఇబ్బందులు ఉండేవని, ఇప్పుడు ఆ సమస్య లేదన్నారు. పైగా వారిని వారు ప్రభుత్వ ఉద్యోగులుగా భ్రమలు పెట్టుకున్నారని, వారు స్ట్రైక్ చేసిన తర్వాత కొంతకాలానికి స్వచ్ఛంధంగా వెళ్ళిపోయారని, వారిని ప్రభుత్వం తీసేయలేదన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు లేకపోవడంతోనే పనులు అనుకున్నట్లుగా జరుగుతున్నాయన్నారు.
కౌలు రైతుల్ని గుర్తించం
కౌలు రైతుల్ని చట్టబద్ధంగా గుర్తించే ప్రసక్తే లేదని మరోసారి నొక్కిచెప్పిన కేసీఆర్, మానవీయ కోణంలో కష్టాలు వచ్చినప్పుడు మానవీయ కోణంలో ప్రభుత్వం ఆదుకుంటుందే తప్ప రైతుబంధు, రైతుబీమా లాంటివి ఇవ్వబోమని స్పష్టం చేశారు. గతంలో రైతుల భూములపై పటేల్, పట్వారి వేధింపులు ఉండేవని, ఆ తర్వాత వీఆర్వోలు అరాచకాలు చేశారని, ఇప్పుడు వాటికి కూడా మంగళం పలికామన్నారు. భూమిని కాపాడుకునే రైతుల్ని కౌలురైతుల రూపంలో బలి చేయదల్చుకోలేదని, అందుకే పట్టాదారు పాసుబుక్‌లో కౌలు కాలమ్ తీసేసినట్లు వివరించారు.
కౌలుకు తీసుకోవడం అనేది అసలు రైతుకు, కౌలు రైతుకు సంబంధించిన వ్యవహారమే తప్ప ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ లేదన్నారు. కౌలుదారులు ప్రతీ సంవత్సరం మారుతూ ఉంటే ఆ వివరాలన్నింటినీ నమోదు చేసుకునే తలనొప్పి ప్రభుత్వానికి ఎందుకని ప్రశ్నించారు. ఇది కౌలు రైతులు, రైతులు చూసుకోవాల్సిన అంశమన్నారు. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని పట్టించుకోదని, దానిపై స్పష్టత ఉందన్నారు. అసలు రైతులు నష్టపోవద్దనేది ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ఈ విధానాన్ని పాటిస్తున్నట్లు తెలిపారు. పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం తన బాధ్యతగా కౌలు రైతుల్ని ఆదుకుంటుందిగానీ, అఫీషియలైజ్ చేయడం కుదరదన్నారు.
అనాథ పిల్లలకు బీసీ సర్టిఫికేట్లు
రాష్ట్రంలోని అనాథ పిల్లలకు బీసీ సర్టిఫికేట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కస్తూర్బా విద్యాలయాల్లో చదువుతున్న కొద్దిమంది పిల్లలతో ఈ మధ్య మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు తన దృష్టికి వచ్చాయని, వారికి ఎదురవుతున్న వివక్షకు తోడు భవిష్యత్తులో కూడా ఇబ్బందుల్లో పడొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ తీరులో ఆలోచిస్తున్నదన్నారు. ఇప్పటికే కేబినెట్‌లో చర్చించామని, బీసీ సర్టిఫికేట్లు ఇచ్చే అంశంపై త్వరలోనే నిర్ణయం వెలువడుతుందన్నారు. కరోనా కారణంగా అనాథలైన పిల్లల భవిష్యత్తు కోసం ఇటీవల కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేస్తున్న సంగతి తెలిసిందే.
పోడు భూములకు రెండు నెలల్లో పరిష్కారం
రాష్ట్రంలోని పోడు భూముల సమస్యపై సీఎం అసెంబ్లీలో వివరణ ఇస్తూ, రెండు నెలల్లో దీన్ని పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు వారివారి నియోజకవర్గాల్లో ఆదివాసీ, గిరిజన రైతుల నుంచి దరఖాస్తులను తీసుకోవాలని సూచించిన సీఎం ఈ సమస్య ఉన్న జిల్లాల ఎమ్మెల్యేలతో కమిటీ వేస్తామని, వివిధ శాఖల అధికారులతో దీనిపై చర్చించిన తర్వాత చట్టపరిధిలో ఏమేం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం ఖరారు చేస్తుందని తెలిపారు. వన్ టైమ్ సొల్యూషన్‌గా దీన్ని శాశ్వత పద్ధతిలో పరిష్కరించాలనే ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఈ రైతులకు పట్టాలు, రైతుబంధు, రైతుభీమా లాంటివన్నీ వస్తాయన్నారు.