కృష్ణా జలాల వివాదం.. కేంద్రానికి ఫిర్యాదు చేసిన కేసీఆర్

దిశ, తెలంగాణ బ్యూరో: కృష్ణా జలాల వివాదం హీటెక్కుతోంది. రాయలసీమ ఎత్తిపోతల పనులపై సీఎం కేసీఆర్​ కేంద్రానికి మరోసారి ఫిర్యాదు చేశారు. జల వివాదాల నేపథ్యంలో కేంద్రమంత్రి షెకావత్, సీఎం కేసీఆర్​ ఫోన్‌లో చర్చించుకున్నారు. మరోవైపు చెన్నై ఎన్జీటీ కూడా ఏపీ తీరుపై మండిపడింది. ఏపీ సీఎస్‌ను జైలుకు పంపుతామంటూ హెచ్చరించింది. ఈ రెండు అంశాలు శుక్రవారం చోటు చేసుకున్నాయి. పరిశీలనకు కమిటీ రాయలసీమ ఎత్తిపోతల పనులపై సీఎం కేసీఆర్​… కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ […]

Update: 2021-06-25 11:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కృష్ణా జలాల వివాదం హీటెక్కుతోంది. రాయలసీమ ఎత్తిపోతల పనులపై సీఎం కేసీఆర్​ కేంద్రానికి మరోసారి ఫిర్యాదు చేశారు. జల వివాదాల నేపథ్యంలో కేంద్రమంత్రి షెకావత్, సీఎం కేసీఆర్​ ఫోన్‌లో చర్చించుకున్నారు. మరోవైపు చెన్నై ఎన్జీటీ కూడా ఏపీ తీరుపై మండిపడింది. ఏపీ సీఎస్‌ను జైలుకు పంపుతామంటూ హెచ్చరించింది. ఈ రెండు అంశాలు శుక్రవారం చోటు చేసుకున్నాయి.

పరిశీలనకు కమిటీ

రాయలసీమ ఎత్తిపోతల పనులపై సీఎం కేసీఆర్​… కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఫోన్‌లో చర్చించారు. ఈ సందర్భంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు, ఎస్టీటీ ఆదేశాలపై సీఎం కేసీఆర్‌ వివరించారు. ఏపీ పనులు ఆపడం లేదంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలంటూ కోరారు. దీనిపై గజేంద్ర షెకావత్… సీఎం కేసీఆర్‌కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతానికి కృష్ణాబోర్డు బృందాన్ని పంపుతామని, పనులు జరుగుతున్నాయో.? లేదో.? కమిటీ పరిశీలిస్తుందని సీఎంతో కేంద్ర మంత్రి షెకావత్‌ అన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య పలు అంశాలపైనా చర్చించారు. ఎలాంటి అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం కృష్ణానదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం జల్‌శక్తి మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రం ఈ పనులపై ఆరా తీస్తున్నట్లు చెప్పుతున్నారు.

ఏపీ సీఎస్‌ను జైలుకు పంపుతాం : ఎన్జీటీ

ఇక రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులపై ఎన్జీటీ చెన్నై బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపట్టినట్లు తేలితే ఏపీ సీఎస్‌ను జైలుకు పంపిస్తామంటూ హెచ్చరించారు. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు జరపొద్దని గతంలో ఆదేశాలు జారీ చేసినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్జీటీ ఆదేశాలు ఉల్లంఘిస్తూ రాయలసీమ ఎత్తిపోతల పనులు చేస్తున్నారని గవినోళ్ల శ్రీనివాస్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం కోర్టు ధిక్కరణ పిటిషన్​ను విచారించిన జస్టిస్ రామకృష్ణన్ , ఎక్స్ పర్ట్ మెంబర్ సత్యగోపాల్​తో కూడిన ఎన్జీటీ చెన్నై ధర్మాసనం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఎన్జీటీ ఆదేశాలను ధిక్కరించి ఏపీ ప్రభుత్వం పనులు చేస్తుందని, కరోనా సెకండ్​వేవ్​ లాక్​డౌన్​ సందర్భంగా పనులు నిరాటకంగా కొనసాగిస్తున్నారని పిటిషనర్​ తరుపు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదించారు. అక్కడ తనిఖీలు జరపాలన్న ఎన్జీటీ ఆదేశాల మేరకు తనిఖీలు చేస్తామని కేఆర్​ఎంబీ ప్రయత్నాలు చేస్తున్నా ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదని ధర్మాసనానికి విన్నవించారు.

ఒకవైపు రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి పర్యావరణ అనుమతులు తప్పనిసరి అంటూ ఎన్జీటీ తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఎలాంటి అనుమతులు అవసరం లేదని కేంద్ర పర్యావరణ శాఖకు ఏపీ ప్రభుత్వం లేఖలు రాస్తోందని వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరుపున అదనపు అడ్వకేట్​ జనరల్​ రాంచందర్​రావు వాదనలు వినిపించారు. ఎన్జీటీ తీర్పు అమలు కావడం లేదని వాదించారు. ఇక ఏపీ తరుపు న్యాయవాది దొంతి మాధురిరెడ్డి వాదనలు వినిపిస్తూ రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద నిర్మాణం పనులు చేయడం లేదని, రెండు వారాల సమయం ఇస్తే కౌంటర్​ దాఖలు చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా ప్రాజెక్టులు అనుమతులు లేకుండా చేపడుతుందంటూ వివరించారు. ఈ సందర్భంగా ఎన్జీటీ ధర్మాసనం పలు ఆదేశాలిచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు, చెన్నైలోని కేంద్ర పర్యావరణ శాఖ ప్రాంతీయ కార్యాలయానికి ఆదేశాలిచ్చింది. ఒకవేళ తీర్పును ఉల్లంఘించినట్లు తేలితే ఏపీ సీఎస్​పై చర్యలు తీసుకుంటామని, ధిక్కరణ నేరం కింద జైలుకు పంపుతామని హెచ్చరించింది. విచారణను వచ్చేనెల 12కు వాయిదా వేసింది.

శ్రీశైలంలో తెలంగాణ విద్యుదుత్పత్తిని ఆపండి

శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ జెన్‌కో చేస్తున్న విద్యుదుత్పత్తిని తక్షణం నిలుపుదల చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి లేఖ రాసింది. ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి.. కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శికి లేఖ రాశారు. నీటి విడుదల ఆదేశాలను కేఆర్‌ఎంబీ జారీచేయకపోయినప్పటకీ ఈ నెల 1వ తేదీ నుంచే తెలంగాణ జెన్‌కో ఏకపక్షంగా శ్రీశైలం ఎడమ హైడ్రో ఎలక్ట్రిక్‌ స్టేషన్‌ నుంచి విద్యుదుత్పత్తికి నీటిని వినియోగిస్తోందని లేఖలో పేర్కొన్నారు. కనీస డ్రాయింగ్‌ లెవల్‌ 834 అడుగులు అయితే.. అంతకన్నా తక్కువ 808.40 అడుగులు నుంచే తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తికి నీటిని వినియోగిస్తోందని, ఇప్పటివరకు 8.89 టీఎంసీలు శ్రీశైలం జలాశయంలోకి రాగా.. అందులో 3 టీఎంసీలు అంటే 34 శాతం నీటిని తెలంగాణ జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తికి వాడేసిందని వివరించారు. నీటి అవసరం లేకున్నప్పటికీ తెలంగాణ జెన్‌కో ఇలా నీటిని వినియోగించడంవల్ల జలాశయంలో నీటి మట్టం అడుగంటిపోతోందని, జలాశయం నీటి మట్టం పెరగడానికి చాలా సమయం పడుతుందని నారాయణరెడ్డి పేర్కొన్నారు. దీనివల్ల పోతిరెడ్డిపాడు, చెన్నైకు తాగునీరు, ఎస్‌ఆర్‌బీసీ, కేసీ కెనాల్, జీఎన్‌ఎస్‌ఎస్‌కు నీటి సరఫరాకు తీవ్ర జాప్యం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. జలాశయంలో కనీసం 854 అడుగులు ఉంటేనే ఏడు వేల క్యూసెక్కులు డ్రా చేయగలమని ఆయన పేర్కొన్నారు. కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ ఆదేశాలు లేకుండా కనీసం సమాచారం ఇవ్వకుండా ఆపరేషన్‌ ప్రొటోకాల్‌కు విరుద్ధంగా శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ జెన్‌కో ఏకపక్షంగా చేస్తున్న విద్యుదుత్పత్తిని తక్షణం నిలుపుదల చేయాలని కోరారు.

Tags:    

Similar News