బీజేపీకి షాక్… టీఆర్‌ఎస్‌లోకి సింగరేణి కీలక నేత
దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి బొగ్గుగనుల బీఎంఎస్ నేత కెంగర్ల మల్లయ్య గురువారం తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. కేటీఆర్ గులాబీ కండువా కప్పి ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. స్వల్ప విరామం తర్వాత సొంత గూటికి చేరుకున్న మల్లయ్యకు స్వాగతం పలుకుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎక్కడ పనిచేసినా మల్లయ్యకు మనస్సు ఒప్పలేదని, ఇతర సంఘాల్లో చేరిన వారు తిరిగి సొంత గూటికి చేరుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో […]
దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి బొగ్గుగనుల బీఎంఎస్ నేత కెంగర్ల మల్లయ్య గురువారం తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. కేటీఆర్ గులాబీ కండువా కప్పి ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. స్వల్ప విరామం తర్వాత సొంత గూటికి చేరుకున్న మల్లయ్యకు స్వాగతం పలుకుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎక్కడ పనిచేసినా మల్లయ్యకు మనస్సు ఒప్పలేదని, ఇతర సంఘాల్లో చేరిన వారు తిరిగి సొంత గూటికి చేరుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో సింగరేణి కార్మికులకు మేలు జరిగిందే తప్ప అన్యాయం జరగలేదన్నారు.
కేసీఆర్ నాయకత్వంలోనే సింగరేణి కార్మికులకు న్యాయం జరుగుతుందని, ప్రతి హామీని నెరవేర్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. ఏడేళ్లుగా కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. న్యాయపరమైన చిక్కులు ఉన్నా.. వాటిని పరిష్కరిస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. సింగరేణి కార్మికుల్లో చైతన్యం ఎక్కువ అని కేటీఆర్ అన్నారు. 13 నుంచి 14 నియోజకవర్గాల్లో వారి పాత్ర ఉంటుందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 25 నుంచి 30 నియోజకవర్గాల్లో ఉంటుందన్నారు. సంఘాలకు మాతృ సంస్థలు పార్టీలేనని, పార్టీలతో కలిసి కార్మికసంఘాలు పనిచేయాలని సూచించారు.
మల్లయ్య బొగ్గుగని నాయకుడే కాదని, కార్మిక విభాగంలో క్రీయాశీలక నాయకుడన్నారు. అభిప్రాయబేధాలు మాని కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. గతంలో ఉన్న విభేదాలను పక్కకు పెట్టాలన్నారు. ఇతర సంఘాలకు నూకలు చెల్లాయని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ,ఎంపీ వెంకటేష్ నేత,పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధు, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఏం .శ్రీనివాస్ రెడ్డి, సింగరేణి కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాగా సింగరేణి సంఘాల్లో బీజేపీ అనుబంధ శాఖలో మల్లయ్య పనిచేశారు.