కేంద్ర మంత్రిగా జ్యోతిరాదిత్య! సీఎంగా శివరాజ్?
దిశ, వెబ్‌డెస్క్: గత వారం రోజులుగా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేయడంతో అవి మరింత హీటెక్కాయి. మంగళవారం ఉదయం సింధియా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అనంతరం కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం, ఆ పార్టీ ఆయన్ని బహిష్కరించడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామాలతో మంగళవారం సాయంత్రం సింధియా బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో మధ్యప్రదేశ్ నుంచి […]
దిశ, వెబ్‌డెస్క్: గత వారం రోజులుగా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేయడంతో అవి మరింత హీటెక్కాయి. మంగళవారం ఉదయం సింధియా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అనంతరం కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం, ఆ పార్టీ ఆయన్ని బహిష్కరించడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామాలతో మంగళవారం సాయంత్రం సింధియా బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో మధ్యప్రదేశ్ నుంచి జ్యోతిరాదిత్యను పెద్దల సభకు బీజేపీ పంపించనుంది. తన వర్గం ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం ద్వారా ఆ రాష్ట్రంలో బీజేపీ సర్కార్ ఏర్పాటుకు సహకరించడంతో బోనస్‌గా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలిసింది. కాంగ్రెస్‌ను జ్యోతిరాదిత్య వీడిన మరుక్షణంలోనే 21 మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌కు రాజీనామా లేఖలు పంపించారు. ఈ విషయాన్ని రాజ్‌భవన్ వర్గాలు ధ్రవీకరించాయి. మొత్తంగా 25 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ రాజీనామాలకు ఆమోదం లభిస్తే 15 నెలల కమల్‌నాథ్ ప్రభుత్వం మైనార్టీలో పడి కూలిపోయే అవకాశం ఉన్నది. జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్ర క్యాబినెట్‌లో బెర్తు కల్పిస్తుండటంతో మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ మళ్లీ అధికార పీఠం ఎక్కే అవకాశాలు లేకపోలేదు.