లా కమిషన్ వద్ద ‘జమిలి’ ఫైల్
దిశ, తెలంగాణ బ్యూరో : జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం ఆ వ్యవహారం లా కమిషన్ వద్ద పెండింగ్‌లో ఉందని కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. జమిలి ఎన్నికలను ఎలా నిర్వహించాలన్నదానిపై రోడ్ మ్యాప్ తయారీ, ఫ్రేమ్ వర్క్ అంశాలపై కసరత్తు జరుగుతుందని స్పష్టం చేసింది. పలువురు లోక్‌సభ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ, పార్లమెంటరీ […]
దిశ, తెలంగాణ బ్యూరో : జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం ఆ వ్యవహారం లా కమిషన్ వద్ద పెండింగ్‌లో ఉందని కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. జమిలి ఎన్నికలను ఎలా నిర్వహించాలన్నదానిపై రోడ్ మ్యాప్ తయారీ, ఫ్రేమ్ వర్క్ అంశాలపై కసరత్తు జరుగుతుందని స్పష్టం చేసింది. పలువురు లోక్‌సభ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ, పార్లమెంటరీ స్థాయీ సంఘం తన 79వ నివేదికలో కొన్ని సిఫారసులు చేసిందని, వాటిని లా కమిషన్ పరిశీలిస్తోందని పేర్కొన్నారు.
పర్సనల్ గ్రీవియెన్స్, లా-జస్టిస్ అంశాలపై ఏర్పడిన పార్లమెంటరీ స్థాయీ సంఘం ఒకేసారి లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడంపై అన్ని రాష్ట్రాలతో చర్చించిందని, కేంద్ర ఎన్నికల సంఘంతోనూ చర్చించినట్లు తెలిపారు. అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక రూపొందించి కొన్ని సిఫారసులు చేసిందని, ఆచరణాత్మకంగా ఉండేలా ఒక రోడ్ మ్యాప్ తయారుచేయడానికి, ఫ్రేమ్ వర్క్ రూపొందించడానికి లా కమిషన్‌కు రిఫర్ చేసిందని మంత్రి వివరించారు.
అప్పట్లో ఇలా..
కాంగ్రెస్ ఎంపీ సుదర్శన్ నాచియప్పన్ చైర్మన్‌గా ఉన్న పార్లమెంటరీ స్థాయీ సంఘం 2015 డిసెంబరు 17వ తేదీన కొన్ని సిఫారసులతో పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. ప్రతీ ఐదేళ్ళకోసారి జమిలి ఎన్నికలను నిర్వహించడం సమీప భవిష్యత్తులో సాధ్యం కాదని, ఒక క్రమంలో వీలవుతుందని సిఫారసు చేసింది. ఇదే సమయంలో రాజకీయ పార్టీల సహకారం, ప్రజల సన్నద్ధతతో జమిలి ఎన్నికల నిర్వహణ ఆచరణ సాధ్యమేనని పేర్కొంది. ఎన్నికైన చట్టసభ పదవీ కాలాన్ని పొడిగించడం చట్టప్రకారం సాధ్యం కాదని, కానీ ఎన్నికల కమిషన్ ఆరు నెలల ముందే ఎన్నికలను నిర్వహించవచ్చని, కానీ పదవీ కాలం ముగిసేంత వరకూ ఫలితాలను వెల్లడించరాదని పేర్కొన్నట్లు గుర్తుచేసింది.
రెండు దశల్లో నిర్వహించొచ్చు..
ఒకేసారి జమిలి ఎన్నికలను నిర్వహించడానికి బదులుగా ప్రత్యామ్నాయంగా, ఆచరణ సాధ్యమయ్యేలా రెండు దశల్లో నిర్వహించవచ్చని సూచించింది. ఈ మధ్యలో జరిగే ఎన్నికలను జమిలి ఎన్నికల సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటికి ఎంత కాలం మిగిలి ఉంటుందో ఆ మేరకు మాత్రమే పదవీకాలాన్ని నిర్దేశించి ఎన్నికలను నిర్వహించవచ్చని తెలిపింది. 2014 వరకు మొత్తం ఏడు లోక్‌సభల పదవీకాలం మధ్యలోనే ముగిసిపోయిందని, అవిశ్వాస తీర్మానం లాంటివి రావడంతో అర్ధాంతరంగా సభలు రద్దు కావడమో లేక ఎన్నికలు రావడమో జరిగాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో లా కమిషన్ వెల్లడించే అభిప్రాయానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల నిర్వహణపై విధానపరమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.