బీజేపీలో కొత్త నినాదం.. జై శ్రీరాం వర్సెస్ జై ఈటల
దిశ ప్రతినిధి, కరీంనగర్: జై శ్రీరాం అన్న నినాదాన్ని ఓన్ చేసుకున్న బీజేపీలో చేరిన ఈటల వర్గీయులు మాత్రం తమ నోటి నుండి ఆ మాట పలికేందుకు సాహసించడం లేదా ? తమ నేత ఈటల కాబట్టి జై ఈటల జైజై ఈటల అన్న నినాదంతోనే సరి పెడుతున్నారా ? బీజేపీ గురించి చెప్పడం కన్నా తన గురించి, కేసీఆర్ గురించే మాట్లాడేందుకే ఈటల ప్రాధాన్యం ఇస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తున్నాయి.. గత కొద్ది రోజులుగా జరుగుతున్న […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: జై శ్రీరాం అన్న నినాదాన్ని ఓన్ చేసుకున్న బీజేపీలో చేరిన ఈటల వర్గీయులు మాత్రం తమ నోటి నుండి ఆ మాట పలికేందుకు సాహసించడం లేదా ? తమ నేత ఈటల కాబట్టి జై ఈటల జైజై ఈటల అన్న నినాదంతోనే సరి పెడుతున్నారా ? బీజేపీ గురించి చెప్పడం కన్నా తన గురించి, కేసీఆర్ గురించే మాట్లాడేందుకే ఈటల ప్రాధాన్యం ఇస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తున్నాయి.. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈటల ప్రసంగాలు, ప్రచారాల తీరు గమనిస్తుంటే.
బీజేపీలో చేరినా..
అట్ట హాసంగా బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ తన నియోజకవర్గానికి చేరుకున్న తరువాత కూడా కాషాయం జెండా ఎగురుతుందన్న వ్యాఖ్యలతో సరి పెడుతున్నారు తప్ప బీజేపీ గురించి అంతగా ప్రచారం చేయడం లేదన్న చర్చ ఆ పార్టీలో సాగుతోంది. బీజేపీకి ప్రయారిటీ ఇవ్వకుండా తనకు జరిగిన అన్యాయం గురించి, ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్న ఈటల కేంద్ర సంక్షేమ పథకాల ఊసు కూడా ఎత్తడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా చిన్నా పెద్ద తేడా లేకుండా మోడీ జపం చేస్తున్నా ఈటల మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యహరిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రానున్న ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న ఈటల అనుచరులు కూడా జై ఈటల… జై జై ఈటల అన్న నినాదాలతోనే సరిపెడుతున్నారు. జై శ్రీరాం అన్న నినాదం జోలికే వెల్లడం లేదెందుకు అన్న చర్చ బీజేపీ వర్గాల్లో సాగుతోంది. బీజేపీ జెండాలు పట్టుకుంటున్న ఈటల కేడర్ ఆ పార్టీకి మాత్రం జై కొట్టేందుకు సుముఖంగా లేరా లేక ఈటల బ్రాండ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారా అన్నదే హుజురాబాద్ ప్రాంతంలో హాట్ టాపిక్ గా నడుస్తోంది.
కేంద్ర నిధుల ఊసు లేదు..
దుబ్బాక ఉప ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్న నిధుల గురించి ప్రచారం చేయడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది బీజేపీ నాయకత్వం. ఒక దశలో ఈ అంశం గురించి టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య సవాళ్ల వరకు దారి తీసింది. కానీ హుజురాబాద్ లో మాత్రం అలాంటి పరిస్థితి కనబడడం లేదు. ఇక్కడ ఈటల వర్సెస్ కేసీఆర్ అన్న పరిస్థితిని అక్కడి ప్రజలకు చూపిస్తున్నారు తప్ప తాను బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నానని, కమలం గుర్తును మర్చిపోవద్దని మాత్రం ప్రజలను కోరడం లేదు. ఈ పద్ధతి వల్ల ఇప్పటి వరకు కారు గుర్తుపై పోటీ చేసిన విషయం అక్కడి ప్రజల్లో బలంగా నాటుకోపోయి ఉంది. తానిప్పుడు కారు గుర్తు నుండి కాదు కమలం గుర్తు ద్వారా పోటీ చేస్తున్నాన్న విషయాన్ని ప్రజలకు వివరించకపోతే పోలింగ్ నాడు సామాన్య జనం గత ఎన్నికల గుర్తునే మనసులో పెట్టుకుని కారు గుర్తుకే ఓటేస్తే అంచనాలు అన్ని తలకిందులవుతాయి కదా అని అనుకుంటున్న వారూ లేకపోలేదు.
అలాగే ఓ సారి ఆర్థిక, పౌరసరఫరాల మంత్రిగా, మరో సారి వైద్య మంత్రిగా పనిచేసిన ఈటల కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఎంత మేర చేసింది, రాష్ట్రం ఈ విషయాన్ని ఎలా కప్పి పుచ్చింది అన్న వివరాలను ప్రజల ముందు ఉంచితే వారి నుండి సానుకూలత వస్తుంది కానీ అలాంటి ప్రయత్నాలకు శ్రీకారం చుట్టకపోవడం విస్మయపరుస్తోందని బీజేపీకి చెందిన ఓ నాయకుడు వ్యాఖ్యానించారు. రెండు సార్లు క్యాబినెట్ లో ఉన్నందున ఆయన అంతర్గతంగా జరిగిన విషయాలను బాహాటంగా వివరిస్తే పార్టీకి, ఈటలకు కూడా లాభం ఉంటుందన్న అభిప్రాయాలు బీజేపీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. కానీ కేవలం తన గురించి మాత్రమే చెప్పుకుంటూ ప్రజల్లోకి వెల్లడం సరైంది కాదంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా ఎంత రాష్ట్రం వాటా ఎంత అన్న విషయాన్ని గణాంకాలతో సహా నిరూపించేగలిగే అవకాశం ఉన్నప్పటికీ ఈటల కానీ ఆయన వర్గీయులు కానీ ఎందుకు పట్టించుకోవడం లేదన్న చర్చ సాగుతోంది.
సిద్ధాంతానికి వ్యతిరేకంగా..
భారతీయ జనతా పార్టీ సిద్దాంతానికి వ్యతిరేకంగా జరుగుతున్న తీరుపై కొంతమంది సీనియర్లు కూడా గుర్రుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. వ్యక్తి కన్నా వ్యవస్థ ముఖ్యమన్న విధానంతో ముందుకు సాగే తమ పార్టీలో లీడర్ తన పర్సనల్ పబ్లిసిటీతోనే సరిపెడుతండం కొంతమంది కమలనాథులకు నచ్చడం లేదు.