మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ తప్పదా?
దిశ, న్యూస్ బ్యూరో: దేశంలో, రాష్ట్రంలో కొనసాగుతున్నది లాక్‌డౌనా..? అన్‌లాక్‌డౌనా అనేది అంతుచిక్కడం లేదు. కంటైన్‌మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో అన్ని రకాల కార్యకలాపాలు యధావిధిగా జరుగుతున్నాయి. దీంతో అసలు లాక్‌డౌన్ అనేది ఉందా..? అనే చర్చ ప్రజల్లో మొదలైంది. ప్రతి రోజు ఎక్కువ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండడమే ఇందుకు కారణం. హైదరాబాద్ నగరం సహా అన్ని జిల్లాల్లోనూ పాజిటివ్‌లు పెరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. దీన్ని కట్టడి చేయడానికి మళ్లీ లాక్‌డౌన్ […]
దిశ, న్యూస్ బ్యూరో:
దేశంలో, రాష్ట్రంలో కొనసాగుతున్నది లాక్‌డౌనా..? అన్‌లాక్‌డౌనా అనేది అంతుచిక్కడం లేదు. కంటైన్‌మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో అన్ని రకాల కార్యకలాపాలు యధావిధిగా జరుగుతున్నాయి. దీంతో అసలు లాక్‌డౌన్ అనేది ఉందా..? అనే చర్చ ప్రజల్లో మొదలైంది. ప్రతి రోజు ఎక్కువ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండడమే ఇందుకు కారణం. హైదరాబాద్ నగరం సహా అన్ని జిల్లాల్లోనూ పాజిటివ్‌లు పెరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. దీన్ని కట్టడి చేయడానికి మళ్లీ లాక్‌డౌన్ విధించక తప్పదా? అనే చర్చ మొదలైంది. వైద్యారోగ్య శాఖ అధికారులు ముఖ్యమంత్రితో ఇటీవల జరిగిన సమావేశం సందర్భంగా హైదరాబాద్‌లో సడలింపులు ఎత్తివేసి, లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలని ప్రతిపాదించారు.
ఈనెల 30తో ముగియనున్న లాక్‌డౌన్
కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఇటీవల మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ విధించాల్సి వస్తుందని ప్రజలను హెచ్చరించారు. మిజోరాం ప్రభుత్వం సడలింపులు లేని సంపూర్ణ లాక్‌డౌన్‌ను ఈ నెల 30 దాకా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. మద్రాసు హైకోర్టులో దాఖలైన ఒక పిటిషన్ విచారణ సందర్భంగా జడ్జి కూడా చెన్నయ్ సిటీలో కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ లేదా పూర్తి స్థాయి కర్ఫ్యూ ప్రకటించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా..? అని అడ్వొకేట్ జనరల్‌ను ప్రశ్నించారు. ప్రస్తుతానికి ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించారు. ఇన్ని సందేహాల నడుమ కేంద్రం మాత్రం సందర్భానుసారం లాక్‌డౌన్ మళ్లీ విధించే అవకాశం లేదని సంకేతాలు ఇచ్చింది. మరోమారు లాక్‌డౌన్ వార్తల్లో నిజం లేదని కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసింది.
సడలింపులే కేసులకు కారణమా..?
వలస కార్మికుల కష్టాలు, చిరుద్యోగులకు ఉపాధి లేకపోవడం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే పేరుతో ఇచ్చిన సడలింపులన్నీ కరోనా కేసుల పెరుగుదలకు దారితీశాయనేది ప్రజల అభిప్రాయం. ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక రాజధానులుగా గుర్తింపు పొందిన ముంబై, ఢిల్లీ, చెన్నయ్ లాంటి నగరాలతో పాటు హైదరాబాద్‌లో కేసుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. నగరంలోని కేసుల పట్ల కేంద్ర వైద్యారోగ్య మంత్రి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో పర్యటించిన కేంద్ర బృందం సైతం ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే నెలాఖరుకు కేసులు భారీ స్థాయిలో పెరుగుతాయని హెచ్చరించింది.
రోజుకు 10వేల మందికి వైరస్
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 30 దాకా మాత్రమే లాక్‌డౌన్ ఉంటుంది. రైలు, విమాన సర్వీసులు కూడా పరిమిత సంఖ్యలో నడవనున్నాయి. ఆ తర్వాత లాక్‌డౌన్‌పై కేంద్రం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా మార్పులు చేర్పులు ఉండొచ్చు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో డబుల్ డిజిట్ స్థానంలో ఉండిన భారతదేశం ఇప్పుడు నాలుగో స్థానంలోకి చేరుకుంది. మొత్తం కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువయ్యాయి. దేశం మొత్తం మీద మృతుల సంఖ్య 8 వేలు దాటింది. ప్రతి రోజూ 10 వేలకు పైగా కేసులు కొత్తగా నమోదవుతున్నాయి. ఇట్లాంటి సిచువేషన్లో మున్ముందు ఈ పరిస్థితులు ఎలా ఉంటాయనే భయం ప్రజల్లో ఉంది. అనేక దేశాల్లో లాక్‌డౌన్ తర్వాత పరిస్థితుల్లో మార్పు రావడంతో ఇక్కడ కూడా మరోమారు సంపూర్ణ లాక్‌డౌన్ పెట్టడం శ్రేయస్కరమని ప్రజలు కోరుకుంటున్నారు.