తెలంగాణకు ఇరిగేషన్ మంత్రి మహిళలా.. పురుషులా: రేవంత్‌రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జరుగుతున్న కృష్ణా జలాల వివాదం సీఎం కేసీఆర్ ఒక రాజకీయ ప్రయోజనం కోసం ఉద్దేశపూర్వకంగా సృష్టించిన కుట్ర అని, ఆ ట్రాప్‌లో రాజకీయ పార్టీలు పడొద్దని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి ఇలాంటి వివాదాలను తెరపైకి తేవడం కేసీఆర్‌కు అలవాటని, ఒక నిర్దిష్ట వ్యూహం ప్రకారమే ఇలాంటి సెంటిమెంట్ అస్త్రాలు సృష్టిస్తూ ఉంటారని ఆరోపించారు. పన్నెండేళ్ళ క్రితం చనిపోయిన వైఎస్సార్‌ను మళ్ళీ […]

Update: 2021-07-01 12:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జరుగుతున్న కృష్ణా జలాల వివాదం సీఎం కేసీఆర్ ఒక రాజకీయ ప్రయోజనం కోసం ఉద్దేశపూర్వకంగా సృష్టించిన కుట్ర అని, ఆ ట్రాప్‌లో రాజకీయ పార్టీలు పడొద్దని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి ఇలాంటి వివాదాలను తెరపైకి తేవడం కేసీఆర్‌కు అలవాటని, ఒక నిర్దిష్ట వ్యూహం ప్రకారమే ఇలాంటి సెంటిమెంట్ అస్త్రాలు సృష్టిస్తూ ఉంటారని ఆరోపించారు. పన్నెండేళ్ళ క్రితం చనిపోయిన వైఎస్సార్‌ను మళ్ళీ ఇప్పుడు జలదోపిడీ పేరుతో చంపుతున్నారని, ఆయనను తిడితే వివాదం పరిష్కారమవుతుందా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. మాజీ ఎంపీ సురేశ్​షెట్కర్ నివాసంలో గురువారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు.

జలదోపిడీలో వైఎస్సార్‌కు ఎలాంటి ప్రమేయం లేదని, ఆయన కుమారుడు జగన్ జూరాల నుంచే కృష్ణా జలాలను తరలించుకపోవడానికి భారీ స్కెచ్ వేశారని ఆరోపించారు. స్టువర్టుపురం దారి దోపిడీ తరహాలో నీళ్ల దోపిడీ చేసే కుట్ర చేశారని, జూరాల నుంచి సంగంబండకు వచ్చేలోపే కృష్ణా జలాలను మొత్తం మాయం చేస్తారని ఆరోపించారు. తెలంగాణ కోడలినని చెప్పుకునే షర్మిలకు రాజకీయాల పట్ల అవగాహన లేదని, కాంగ్రెస్ శ్రేణులను ఆమెకు దగ్గర చేయడానికి కేసీఆర్ నాటకం ఆడిస్తున్నారని ఆరోపించారు. నీళ్ళు తెలంగాణకు జీవన్మరణ సమస్య అని, ఆ అంశాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ సందర్భానుసారం ఏటీఎం తరహాలో వాడుకున్నదన్నారు. ఓట్ల అవసరం ఏర్పడినప్పడల్లా కేసీఆర్ నీళ్ల అంశాన్ని తెరపైకి తెస్తారని, ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో మరో కోణంలో దీన్ని రంగంమీదకు తీసుకొచ్చారన్నారు.

ఓట్ల కోసమే నీళ్ళ పంచాయితీ

ఏపీ సీఎం జగన్ కృష్ణా నీటిని రోజుకు 11 టీఎంసీల చొప్పున తరలించేలా ప్లాన్ చేస్తున్నారన్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న అన్ని ప్రాజెక్టులకు కలిపి రోజుకు ఒక టీఎంసీ మాత్రమే వాడుకోగలమన్నారు. నీళ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధత తీసుకొచ్చిందని గుర్తుచేశారు. జలాల కోసం ప్రభుత్వం పోరాటం చేయాల్సి ఉన్నా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నదని, రాయలసీమ ఎత్తిపోతల మీద సామాన్య రైతు గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్ వేస్తే దాంట్లో సర్కారు ఇంప్లీడ్ అయ్యిందని గుర్తుచేశారు. ఏపీకి జగన్ సీఎం అయిన తర్వాత సాదరంగా ప్రగతి భవన్‌కు పిలిపించుకుని పర్వాన్నం పెట్టి ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నికల కోసం మంత్రులతో తిట్టిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు ఇరిగేషన్ మంత్రి మహిళలా పురుషులా అనేది అర్థంకావడంలేదని తనదైన శైలిలో వ్యంగాస్త్రం విసిరారు.

వైఎస్సార్ సభ్యురాలైన సినీ నటి రోజా ఇంటికి వెళ్ళి ‘బేసిన్లు లేవు.. భేషజాలు లేవు…‘ అంటూ చెప్పిన కేసీఆర్ ఏపీ ప్రభుత్వ నీటి దోపిడీపై చట్టపరంగా ఎందుకు కొట్లాడడంలేదని రేవంత్ ప్రశ్నించారు. అనేక అంశాలపై ప్రధానితో భేటీ అయ్యే కేసీఆర్ ఇప్పుడు ఈ విషయంలో ఎందుకు సైలెంటుగా ఉన్నారని ప్రశ్నించారు. త్వరలో జరిగే వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు ఈ విషయాన్ని సభలో లేవనెత్తాలని డిమాండ్ చేశారు. లేదా తన వెంట పంపిస్తే కేంద్రంపై వత్తిడి తీసుకొస్తానని వ్యాఖ్యానించారు. మంత్రులు ప్రెస్‌మీట్‌లు పెట్టి వైఎస్సార్‌ను తిడితే సమస్య పరిష్కారమవుతుందా అని ప్రశ్నించారు. కోర్టులో న్యాయపోరాటం ఎందుకు చేయరని కేసీఆర్‌ను నిలదీశారు.

వైఎస్సార్‌ను తిడుతూ ఉంటే జగన్, విజయమ్మ ఏం చేస్తున్నారు?

తెలుగు రాజకీయాల్లో దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్సార్‌లు ఒక శకం లాంటివారని, వారి హయాంలో పేదలకు సంక్షేమం ద్వారా చేయాల్సిందంతా చేశారని రేవంత్ వ్యాఖ్యానించారు. అలాంటి వైఎస్సార్‌ను తెలంగాణ మంత్రులు ఇప్పుడు కృష్ణా జలాల అంశాన్ని తెరపైకి తెచ్చి తిడుతూ ఉంటే భార్య విజయమ్మ, కొడుకు జగన్ ఏం చేస్తూ న్నారని ప్రశ్నించారు. వైఎస్సార్‌ను తిట్టడం ద్వారా రెండు రాష్ట్రాల మధ్య కేసీఆర్ వైషమ్యాలను పెంచుతున్నారని అన్నారు. నీళ్ళ దోపిడీలో వైఎస్సార్ పాత్ర లేదని, ఆయన కుమారుడు జగన్ హస్తం ఉందన్నారు. జలదోపిడీకి ముమ్మాటికీ కేసీఆర్ కారణం అని ఆరోపించారు. తాను చాలా స్పష్టతతో నిర్దిష్టంగానే ఈ ఆరోపణ చేస్తున్నట్లు నొక్కి చెప్పారు.

కృష్ణా జలాలను ఏ విధంగా వాడుకోదల్చుకున్నదీ, తరలించుకుపోనున్నదీ ఏపీ సీఎం జగన్ నిండు అసెంబ్లీలోనే ప్రకటన చేశారని, ఆ తర్వాతనే ఆయనను ప్రగతి భవన్‌కు పిలిపించుకుని విందు ఇచ్చారని రేవంత్ గుర్తు చేశారు. ఈ విందు సమావేశంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం మార్పులు, కమీషన్లు సిద్ధమయ్యాయని, ఆ తర్వాతనే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన జీవో జారీ అయిందన్నారు. కేసీఆర్‌కు అన్ని విషయాలు చెప్పిన తర్వాతనే ఏపీ సర్కారులో పక్కా వ్యూహం ఖరారైందన్నారు. ఏపీ చేస్తున్న నీటి దోపిడీపై మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి అప్పట్లో సీఎం కేసీఆర్‌కు, గవర్నర్‌కు లేఖ రాసినా స్పందన లేదని గుర్తుచేశారు. కేసీఆర్ తీసుకొచ్చిన కృత్రిమ పంచాయితీ ట్రాప్‌లో పడొద్దని వ్యాఖ్యానించారు. జల వివాదం ఎంత ముదిరితే రాజకీయంగా అంత లబ్ధి పొందాలనేది కేసీఆర్ లక్ష్యమన్నారు.

కాంగ్రెస్ శ్రేణుల్ని షర్మిలపార్టీ వైపు పంపే కుట్ర

కాంగ్రెస్ శ్రేణులను షర్మిల పార్టీ వైపు నడిపించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, కృష్ణా జలాల అంశం కూడా అందులో ఒకటని అని రేవంత్ రెడ్డి అన్నారు. షర్మిలకు రాజకీయాలపై అవగాహన లేదని, కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేవలం ప్రకటనలు చేయడం కాకుండా నిర్దిష్టంగా ఆమె దగ్గర ఉన్న కార్యాచరణ, రాజకీయ ఎత్తుగడలు ఏంటి అని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్‌గా తాను నియమితులైన తర్వాత కాంగ్రెస్‌కు గతంలో అనుకూలంగా ఉన్న వ్యక్తులు, శక్తులు మళ్లీ తిరిగి వస్తూ ఉంటే దాన్ని చూసి తట్టుకోలేక కేసీఆర్ మరికొన్ని కుట్రలకు వ్యూహరచన చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అభిమానులను తప్పుదారి పట్టించేందుకు కేసీఆర్ డ్రామా చేస్తున్నారన్నారు.

Tags:    

Similar News