బై.. బై.. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్!
నువ్వు చాలా నెమ్మదస్తుడివి అని చెప్పడానికి ఈతరం యువత వాడే ఉదాహరణ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్. అత్యంత నెమ్మదిగా పనిచేసే బ్రౌజర్‌గా దీనికి పేరుపడింది. మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసినపుడు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ డీఫాల్ట్‌గా వస్తుంది. దాన్ని ఉపయోగించి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ గానీ లేదా మొజిల్లా ఫైర్‌ఫాక్స్ గానీ డౌన్‌లోడ్ చేసుకుంటారు. అంతే.. అదే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ మొదటి, చివరి వినియోగం. ఆ తర్వాత ఏదో చిన్న చిన్న ప్రభుత్వ వెబ్‌సైట్‌లను లేదంటే […]
నువ్వు చాలా నెమ్మదస్తుడివి అని చెప్పడానికి ఈతరం యువత వాడే ఉదాహరణ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్. అత్యంత నెమ్మదిగా పనిచేసే బ్రౌజర్‌గా దీనికి పేరుపడింది. మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసినపుడు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ డీఫాల్ట్‌గా వస్తుంది. దాన్ని ఉపయోగించి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ గానీ లేదా మొజిల్లా ఫైర్‌ఫాక్స్ గానీ డౌన్‌లోడ్ చేసుకుంటారు. అంతే.. అదే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ మొదటి, చివరి వినియోగం. ఆ తర్వాత ఏదో చిన్న చిన్న ప్రభుత్వ వెబ్‌సైట్‌లను లేదంటే మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులైన ఎంఎస్ ఆఫీస్, అవుట్‌లుక్, వన్‌డ్రైవ్ వంటి వాటిని అప్‌డేట్ చేయడానికి ఉపయోగిస్తారు. మిగతా సమయాల్లో దాన్ని అసలు పట్టించుకోరు. కానీ 90వ దశకంలో పుట్టినవారికి, గూగుల్ క్రోమ్ రాకముందు అదే గొప్ప బ్రౌజర్. అందుకే 2021 నుంచి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఉండదు అని మైక్రోసాఫ్ట్ ప్రకటించినప్పటి నుంచి వీళ్లందరూ దానికి నివాళులు తెలియజేస్తున్నారు.
ఆగస్టు 17, 2021 నుంచి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ పనిచేయబోదని మైక్రోసాఫ్ట్ ప్రకటించిన తర్వాత సోషల్ మీడియా మొత్తం ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ మీమ్‌లతో నిండిపోయింది. ‘నువ్వు స్లోగా పనిచేసినా మంచి బ్రౌజర్‌వు, ఎలాంటి వైరస్ తీసుకొచ్చేదానివి కాదు’ అని ఒక నెటిజన్ ట్వీట్ చేయగా, ‘నేను మొదట ఉపయోగించినపుడు ఓనమాలు దిద్దించిన బ్రౌజర్ నువ్వే’ అంటూ మరో నెటిజన్ పోస్ట్ చేశారు. ఇక ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ‘రెస్ట్ ఇన్ పీస్’ అంటూ వేల సంఖ్యలో పోస్టులు, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఫొటోలకు దండ వేస్తూ లక్షల సంఖ్యలో ఫొటోలు ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం విండోస్ 10 వినియోగదారులందరికీ క్రోమియం-ఆధారిత ఎడ్జ్ బ్రౌజర్‌ను వాడుకోవచ్చని, తర్వాత రాబోయే విండోస్ అప్‌డేట్‌లలో కూడా కొత్త ఎడ్జ్ బ్రౌజర్ మాత్రమే ఉంటుందని మైక్రోసాఫ్ట్ తమ బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది.