ఐపీఎల్‌ వైపే మొగ్గు..

దిశ, స్పోర్ట్స్: ప్రపంచ క్రికెట్‌లో బీసీసీఐ బలమెంతో గురువారం నుంచి ప్రారంభంకానున్న ఐసీసీ సమావేశాల్లో తేలనుంది. తమకు పెద్దఎత్తున ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఐపీఎల్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ రద్దు చేయబోమని ఇప్పటికే సంకేతాలు పంపిన బీసీసీఐ, తన పంతాన్ని నెగ్గించుకోబోతున్నట్టే తెలుస్తోంది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆస్ట్రేలియాలో నిర్వహించాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ను వాయిదా వేయడమే కాకుండా, ఆ మెగా టోర్నీని 2022లో నిర్వహించేలా క్రికెట్ ఆస్ట్రేలియాను ఒప్పించినట్టు సమాచారం. కరోనా నేపథ్యంలో 16 జట్లను ఒకే […]

Update: 2020-05-27 08:47 GMT

దిశ, స్పోర్ట్స్: ప్రపంచ క్రికెట్‌లో బీసీసీఐ బలమెంతో గురువారం నుంచి ప్రారంభంకానున్న ఐసీసీ సమావేశాల్లో తేలనుంది. తమకు పెద్దఎత్తున ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఐపీఎల్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ రద్దు చేయబోమని ఇప్పటికే సంకేతాలు పంపిన బీసీసీఐ, తన పంతాన్ని నెగ్గించుకోబోతున్నట్టే తెలుస్తోంది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆస్ట్రేలియాలో నిర్వహించాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ను వాయిదా వేయడమే కాకుండా, ఆ మెగా టోర్నీని 2022లో నిర్వహించేలా క్రికెట్ ఆస్ట్రేలియాను ఒప్పించినట్టు సమాచారం. కరోనా నేపథ్యంలో 16 జట్లను ఒకే దేశానికి తరలించి, క్వారంటైన్ చేయడం కష్టమని ఐసీసీ భావిస్తోంది. గురువారం ప్రారంభం కానున్న ఐసీసీ వీడియో కాన్ఫరెన్స్ సమావేశాల్లో దీనిపై ప్రధాన చర్చ నడవనుంది.

అన్ని దారులూ అటు వైపే..

ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ ఆస్ట్రేలియాలో నిర్వహించాలి. వన్డే, టీ20 వరల్డ్‌కప్‌ల మధ్య సరైన సమయం ఉండట్లేదని భావించిన ఐసీసీ 2023లో వన్డే వరల్డ్ కప్‌కు రెండేండ్ల ముందు మరో టీ20 వరల్డ్‌కప్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇంతకుముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 2020లో ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్‌కప్ నిర్వహించి, ఆ తర్వాత నుంచి వరల్డ్‌కప్‌లను క్రమబద్ధీకరించాలని భావించింది. ఈ షెడ్యూల్ ప్రకారం 2021లో ఇండియాలో టీ20 వరల్డ్‌కప్ నిర్వహించనున్నారు. ఇప్పుడు 2020 టీ20 వరల్డ్‌కప్ వాయిదా వేసిన ఐసీసీ, భారత్‌లో 2021లో జరగాల్సిన టీ20ని వాయిదా వేయడం లేదు. అంతేకాకుండా, ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ గ్యాప్‌ను ఐపీఎల్‌తో భర్తీ చేసేందుకు ఐసీసీ కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. క్రికెట్ ఆడే దేశాల్లోని మెజార్టీ బోర్డులు, క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడటానికే ఆసక్తి కనబరుస్తున్నారు.

టెస్టు అంపైరింగ్

ప్రస్తుతం ఏ దేశంలో టెస్టులు ఆడితే ఆ దేశానికి చెందిన అంపైర్లు బాధ్యతలు నిర్వర్తించట్లేదు. ప్రతి టెస్టు మ్యాచ్‌కు తటస్థ అంపైర్లే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మెన్ అనిల్ కుంబ్లే పలు కీలక సూచనలు చేశారు. వన్డేల మాదిరిగానే టెస్టుల్లో కూడా ఒక స్థానిక అంపైర్, మరో తటస్థ అంపైర్ ఉండాలని సూచించారు. ఈ విషయమై ఇవాళ ఐసీసీ సమావేశాల్లో కీలకంగా చర్చ జరిగింది. కరోనా లాక్‌డౌన్ తర్వాత అంతర్జాతీయ ప్రయాణాలకు అంత సులభంగా అనుమతులు లభించవు కాబట్టి స్థానిక అంపైర్‌ను నియమించడం మేలని ఐసీసీ భావిస్తోంది. అనిల్ కుంబ్లే కమిటీ సిఫారసులను కూడా ఈ సమావేశాల్లో చర్చించారు.

నామినేషన్లు ఎప్పుడు?

ఐసీసీ సమావేశాల్లో కీలకమైన చైర్మన్ పదవి ఎన్నికలపై ఇంకా చర్చ జరగలేదు. రాబోయే మూడు రోజుల సమావేశాల్లో ఈ విషయమై కీలక సమాచారం అందనుంది. మొదట్లో ఈసీబీ చైర్మన్ కొలిన్ గ్రీవ్స్ మాత్రమే అభ్యర్థి అనుకున్నా అనూహ్యంగా బీసీసీఐ తెరవెనుక పావులు కదిపి గంగూలీని బరిలోకి దింపాలనే యోచనలో ఉంది. కాగా, ఐసీసీ చైర్మన్ ఎన్నిక, నామినేషన్ల ప్రక్రియపై గురువారం కీలక నిర్ణయం తీసుకుకే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News